Share News

పాక హనుమంతుకు కన్నీటి వీడ్కోలు

ABN , Publish Date - Dec 29 , 2025 | 12:48 AM

ఒడిశాలో ఈ నెల 25న జరిగిన భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు అంత్యక్రియలు నల్లగొండ జిల్లా చండూరు మండలంలోని పుల్లెంల గ్రామంలో ఆదివారం ముగిశాయి.

పాక హనుమంతుకు కన్నీటి వీడ్కోలు

అంత్యక్రియలకు భారీగా తరలి వచ్చిన ప్రజలు

నాలుగు గంటలపాటు పుల్లెంలలో అంతిమయాత్ర

సొంత వ్యవసాయ భూమిలో దహన సంస్కారాలు

చండూరు, డిసెంబరు 28,(ఆంధ్రజ్యోతి): ఒడిశాలో ఈ నెల 25న జరిగిన భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు అంత్యక్రియలు నల్లగొండ జిల్లా చండూరు మండలంలోని పుల్లెంల గ్రామంలో ఆదివారం ముగిశాయి. హనుమంతు మృతదేహాన్ని కడసారిగా చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు, అభిమానులు, బంధువులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. పోస్టుమార్టం అనంతరం ఒడిశా నుంచి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చిన పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆదివారం ఉదయం జనంతో పాటు పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, పౌరహక్కుల సంఘం నేతలు పుల్లెంల గ్రామానికి భారీగా తరలివచ్చారు. అంతిమయాత్రలో కుటంబ సభ్యులు, పౌరహక్కుల సంఘాల నాయకులు, అమరుల బంధుమిత్రుల కమిటీ ప్రతినిధులు ఎర్రజెండాలు పట్టుకుని, విప్లవ పాటలు పాడుతూ పాల్గొన్నారు. అమరుల బంధుమిత్రుల కమిటీ, తెలంగాణ పౌరహక్కుల సంఘం నేతలు తదితరులు భౌతికకాయానికి నివాళులర్పించారు.కవులు, కళాకారులు హనుమంతు మృతదేహానికి నివాళుర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. అంతిమయాత్ర సుమారు నాలుగు గంటల పాటు సాగింది. హనుమంతు ఉద్యమబాట పట్టిన తీరు, పీడిత ప్రజల కోసం చేసిన త్యాగాలను పలువురు వివరిస్తుంటే ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు.

మారణకాండను తక్షణమే ఆపాలి

ఆపరేషన్‌ కగార్‌ పేరిట సాగిస్తున్న మారణకాండను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆపాలని, దీనిపై సుప్రీం కోర్టు సిట్టింగ్‌ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని పలువురు డిమాండ్‌ చేశారు. బూ టకపు ఎన్‌కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్య లేనని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ అన్నారు. మావోయిస్టులు శాంతి చర్చలు జరపాలని పిలుపునిచ్చినా ప్రభుత్వం పట్టించుకోకుండా అడవులను జల్లెడ పడుతూ అమాయకులను చంపుతున్నారని ఆరోపించారు. పహల్గాంలో దాడి చేసిన టెర్రరిస్టులను పట్టుకోలేని మోదీ, అమిత్‌షా 2026 మార్చి నాటికల్లా మావోయిస్టులను అంతం చేస్తామని చెప్పడం దారుణమన్నారు. వాంతి చర్చలు జరపాలని పిలుపునిచ్చాన మావోయిస్టులపై కనికరం లేకుండా కాల్చి చంపడం ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు. ఆయుధాలు విడిచి లొంగిపోతామని మావోయిస్టులు ప్రకటిస్తుంటే పాలకులు పట్టించు కోకుండా ఎన్‌కౌంటర్ల పేరుతో ఈ దేశ పౌరు లను కాల్చి చంపడం ఏమిటని ప్రశ్నించారు. జనజీవన స్రవంతిలో కలిసేందుకు తమకు కొంత సమయం కావాలని మావోయిస్టులు లేఖలు రాస్తే ప్రభుత్వాలు పట్టించుకోకుండా అశాంతిని నెలకొల్పడం సరైంది కాదన్నారు. ఇప్పటికైనా పాలకులు మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి దేశంలో ప్రశాంత వాతావరణం ఏర్పాటు చేయాలని కోరారు. హను మంతు మృతి విచారకరమన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చండూరు సీఐ ఆదిరెడ్డి, ఎస్‌ఐ వెంకన్న ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కుటుంబసభ్యులతో పాటు అమరవీరుల బంధు మిత్రుల సంఘం నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్‌నేత, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్‌, పల్లె రవికుమార్‌, పలువురు రాజకీయ నాయకులు, సర్పంచ్‌ ముక్కాముల వెంకన్న పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2025 | 12:48 AM