పొంచిఉన్న తాగునీటి గండం?
ABN , Publish Date - May 19 , 2025 | 12:19 AM
నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం రోజురోజుకూ తగ్గుతోంది.
తగ్గుతున్న సాగర్ ప్రాజెక్టు నీటిమట్టం
ఏకేబీఆర్‌లో 20రోజులకు సరిపడా నీరు నిల్వ ఉన్నాయంటున్న అధికారులు
పుట్టంగండిలో అత్యవసర మోటర్ల ఏర్పాటుకు సన్నాహాలు
నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం రోజురోజుకూ తగ్గుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 512.7 అడుగులకు పడిపోయింది. దీంతో సాగర్, కృష్ణాజలాలపై ఆధారపడిన హైదరాబాద్ జంట నగరాలు, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు తాగునీటి గండం పొంచి ఉంది. నల్లగొండ జిల్లాకు 2.50 లక్షల హెక్టార్ల సాగునీరు, హైదరాబాద్ జంటనగరాలతో పాటు జిల్లాలోని 516గ్రామాలకు సాగునీరు ఏలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా అందిస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం గణనీయంగా తగ్గుతోంది.
(ఆంధ్రజ్యోతి, పెద్దఅడిశర్లపల్లి)
ఎండలు మండుతుండడంతో ఏఎమ్మార్పీ అధికారులు తాగునీటికి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఏకేబీఆర్‌లో 20రోజులకు పైగా తాగునీరు అందించేందుకు నీటిని నిల్వ చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 510అడుగులకు చేరితే ఏఎమ్మార్పీ మోటర్లు పనిచేయని పరిస్థితి. దీంతో నీటిపారుదల శాఖ. జలమండలి అధికారులు ప్రతి సంవత్సరం వేసవిలో అత్యవసర మోటర్లు బిగించి తాగునీటికి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు. ఈ సంవత్సరం ప్రస్తుతం సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 512.7కు చేరుకుంది. సాగర్‌లో నీటిమట్టం తగ్గుతుండడంతో ఏఎమ్మార్పీ ద్వారా తాగునీటిని అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వేలాది గ్రామాలకు తాగునీటిని అందించే సాగర్ అడుగంటు తుండడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రమాదకర స్థాయిలో డెడ్ స్టోరేజ్‌కి నీటి నిల్వలు పడిపోతుండడంతో డేంజర్ బెల్స్ మోగిస్తోంది.
మంచినీటి సరఫరాపై తీవ్ర ప్రభావం
నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 512.7అడుగులు మాత్రమే ఉంది. దీంతో హైదరాబాద్ జంట నగరాలకు ముందుముందు నీటిసరఫరా చేసేందుకు ఇబ్బంది కానుంది. 510 అడుగుల నీరు ఉంటేనే ఏఎమ్మార్పీ ఎత్తిపోతల ద్వారా హైదరాబాద్ జంటనగరాలకు తాగునీటిని సరఫరా చేయడం వీలవుతుంది. 510 అడుగుల కంటే తక్కువ ఉంటే నీటిని పంపింగ్ చేయడం సాధ్యం కాదు. పంపింగ్ కోసం అత్యవసర మోటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సాగర్ నీటినిల్వలు ఆందోళనకర రీతిలో తగ్గుతున్నాయి. రోజుకు దాదాపు ఒక టీఎంసీల నీటిని సాగర్ నుంచి వివిధ అవసరాలకు ఇరిగేషన్ అధికారులు వినియోగిస్తున్నారు. సాగర్ నీటి నిల్వలు తగ్గితే హైదరాబాద్ తాగునీటి అవసరాలకు తీవ్ర ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి ఉందని, జంటనగరాలకు తాగునీటి అవసరాలకు సరిపడా నిల్వలు ఉంచాలని వాటర్‌బోర్డు అధికారులు ఇరిగేషన్ అధికారులకు తెలిపారు. డెడ్‌స్టోరేజ్ 510 అడుగులకు చేరితే ఎమర్జెన్సీ పంపింగ్ చేయాల్సి వస్తుందని వాటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు. సాగర్ వెనుక జలాలు అయిన ఏఎమ్మార్పీ ప్రాజెక్టు నుంచి రోజుకు ఫేజ్-1,2,3 ద్వారా 525 క్యూసెక్కులు నీటిని తరలిస్తున్నారు. మిషన్ భగీరథకు 45క్యూసెక్కుల చొప్పున తరలిస్తూ సాగర్‌పై నున్న శ్రీశైలం ప్రాజెక్టు, జూరాల, ఆల్మట్టి ప్రాజెక్టులు నీరులేక విలవిల లాడుతున్నాయి. ఒకవేల వర్షాలు పడినా ఆ జలా శయాలు నిండిన తర్వాతే సాగర్‌కు రావాలి. వాడకం ఇలాగే కొనసాగితే మరో పది రోజుల్లో సాగర్‌నీటిమట్టం డెడ్ స్టోరేజ్ 510 అడుగులకు చేరుతుంది.
నీటి నిల్వలు తగ్గితే ఏర్పాట్లకు సిద్ధంగా ఉన్నాం
నాగార్జున సాగర్ నీటినిల్వలు ప్రస్తుతం 512.7అడుగల మేర ఉంది. ప్రస్తుతం ఏఏమ్మార్పీ ప్రాజెక్టు మోటర్ల ద్వారా అక్కంపల్లి రిజ్వాయర్‌ను పూర్తిస్థాయిలో నింపి కోదండపురం వాటర్‌ప్లాంట్ ద్వారా జంట నగరా లకు తాగునీటిని తరలిస్తున్నాం. ప్రస్తుతం తాగునీటికి ఎలాంటి సమస్య లేదు. ఒకవేళ నీటి నిల్వలు తగ్గితే అత్యవసర మోటర్ల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం.
వెంకటేశ్వర్‌రెడ్డి, వాటర్ బోర్డు డీఈ.