అప్రమత్తతతో తప్పిన పెనుముప్పు
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:13 AM
అధికారుల అప్రమత్తతో శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది.
కోతకు గురైన శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారి
డిండి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): అధికారుల అప్రమత్తతో శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. భారీ తుపాన్‌తో డిండి ప్రాజెక్టుకు మునుపెన్నడూ లేని విధంగా వరద ప్రవాహం పోటెత్తింది. ఎగువ నుంచి 36వేల క్యూసెక్కుల ఇన్‌ప్లో దుందుభి వాగు నుంచి బుధవారం డిండి ప్రాజెక్టుకు వచ్చి చేరింది. దీంతో స్పిల్‌వే వియర్ నుంచి అంతేనీరు దిగువకు విడుదలవుతోంది. ఎప్పటిలాగానే జాతీయ రహదారి 765 శ్రీశైలం- హైదరాబాద్ వాహనాల రాకపోకలు కొనసాగుతూ వచ్చాయి. క్రమంగా నీటి ఉధృతి పెరగడంతో వియర్ దిగువన శ్రీశై లం-హైదరాబాద్ జాతీయ రహదారి 765పై ఉన్న బిడ్జి పైనుంచి నీటి ప్రవాహం పెరిగింది. హైవేపై వరద ఉధృతికి రోడ్డు కోతకు గురైంది. నీటి ప్రవాహం ఉండడంతో కోతకు గురైన విషయం స్థానిక తహసీల్దార్ శ్రీనివా్‌సగౌడ్, ఎస్‌ఐ బాలకృష్ణ ఉన్నత అధికారులకు సమాచారం ఇచ్చారు. జాతీయ రహదారిపై రెండువైపుల వాహనాలను నిలిపివేశారు. నీటి ఉధృతికి క్రమంగా బుధవారం అర్థరాత్రి రోడ్డు పూర్తిగా తెగిపోయింది. వాహనాల నిలిపివేత వల్ల పెను ప్రమాదం తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఆర్టీసీ బస్సుల దారి మళ్లింపు
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులతోపాటు ఇతర డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులు శ్రీశైలం నుంచి హైదరాబాద్‌కు డిండి మీదుగా వెళుతుంటాయి. ప్రతిరోజూ సుమారు వంద బస్సులకుపైగా శ్రీశైలం - హైదరాబాద్ జాతీయ రహదారిపై వెళుతుంటాయి. రోడ్డు కోతకు గురికావడంతో బస్సులను అధికారులను నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునూతల, చింతపల్లి, సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి మీదుగా దారి మళ్లించారు. కొట్టుకుపోయిన శ్రీశైలం - హైదరాబాద్ ప్రధాన రహదారిపై రాకపోకలు పునరుద్ధరించేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. నీటిని ఒకవైపు మళ్లించి ప్రధాన రహదారిపై ఏర్పడిన గండిని మట్టితో నింపుతున్నారు. త్వరితగతిన కోతకు గురైన గండిని పూడ్చి వాహనాలను పునరుద్దరిస్తామని అధికారులు చెబుతున్నారు.
సూర్యాపేట- మిర్యాలగూడెం రూట్‌లో బస్సు సర్వీసులు రద్దు
కేతేపల్లి: వరద నీటి ప్రభావంతో సూర్యాపేట-మిర్యాలగూడెం పట్టణాల మధ్య భీమారం మీదుగా గల రహదారిపై గురువారం రెండో రోజూ వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర ద నీరు లోలెవల్ కాజ్‌వే మీదుగా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో భీమారం పంచాయతీ కార్యదర్శి, జీపీవోలు అక్కడే ఉండి నది వైపు ఎవరూ వెళ్లకుండా చూస్తున్నారు. కేతేపల్లి తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీవో శ్రీనివాసరావు భీమారం బ్రిడ్జి వద్దకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు.