Kaka Venkataswami: బడుగుల గొంతుక కాకా వెంకటస్వామి
ABN , Publish Date - Oct 06 , 2025 | 03:53 AM
బడుగు, బలహీన వర్గాల గొంతుక గడ్డం వెంకటస్వామి (కాకా) అని.. ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని వక్తలు కొనియాడారు...
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.. భట్టి, మహేశ్ గౌడ్, పలువురు మంత్రులు
కవాడిగూడ/రవీంద్రభారతి/న్యూఢిల్లీ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): బడుగు, బలహీన వర్గాల గొంతుక గడ్డం వెంకటస్వామి (కాకా) అని.. ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని వక్తలు కొనియాడారు. కాకా సేవలు చిరస్మరణీయమని.. ఆయన ఆశయాల సాధనకు యువత పాటుపడాలని పిలుపునిచ్చారు. ఆదివారం గడ్డం వెంకటస్వామి జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఆయన విగ్రహానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇటు రవీంద్రభారతిలోనూ తెలంగాణ భాషా సంస్కాృతిక శాఖ ఆధ్వర్యంలో కాకా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్రమంత్రిగా, రాష్ట్ర మంత్రిగా కాకా చేసిన సేవలు మరువలేనివని భట్టి అన్నారు. దేశంలో కార్మికుల ఉన్నతికి పాటుపడ్డారని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి, మలిదశ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారని చెప్పారు. మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో నీతి, నిజాయతీలకు నిలువుటద్దం కాకా అని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో కాకా తనను ఎంతో ప్రోత్సహించి, ప్రేరణ కలిగించారని శ్రీధర్ బాబు గుర్తు చేసుకున్నారు. పొన్నం మాట్లాడుతూ.. తెలంగాణ సాధనే ధ్యేయంగా కాకా పనిచేశారని.. మలిదశ ఉద్యమంలో తనకు, వివేక్ వెంటకస్వామికి సలహాలు, సూచనలిచ్చారన్నారు. అత్యంత పేద కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగిన మహోన్నత వ్యక్తి కాకా అని జూపల్లి కొనియాడారు. తెలంగాణ సాధన కోసం చివరి దాకా పోరాడారన్నారు. వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. తన తండ్రి (కాకా)ని ఆదర్శంగా తీసుకునే రాజకీయాల్లోకి వచ్చానని.. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. కాగా, కాకా జయంతి వేడుకలు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లోనూ నిర్వహించారు. భవన్ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్, ప్రభుత్వ కార్యదర్శి (సమన్వయం) గౌరవ్ ఉప్పల్ సహా అధికారులు, సిబ్బంది కాకా చిత్రటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు