చెర్వుగట్టుపై ఘనంగా లక్ష పుష్పార్చన
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:44 AM
జిల్లాలో ప్రసిద్ధ శైవక్షేత్రం నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంపై శనివారం లక్ష పుష్పార్చన మహోత్సవం ఘనంగా జరిగింది.
చెర్వుగట్టుపై ఘనంగా లక్ష పుష్పార్చన
నార్కట్‌పల్లి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రసిద్ధ శైవక్షేత్రం నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంపై శనివారం లక్ష పుష్పార్చన మహోత్సవం ఘనంగా జరిగింది. అమావాస్య తిథి సందర్భంగా నిర్వహించే ఈ వేడుకకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తొలుత గర్భాలయం నుంచి పార్వతీపరమేశ్వరుల ఉత్సవ మూర్తులను సన్నాయి వాయిద్యాలు, భక్తుల శివన్నామస్మరణల మధ్య మహా మంటపానికి చేర్చారు. ఆలయ ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ, ఉప ప్రధాన అర్చకుడు సతీష్‌శర్మ సహర్చకులు సురేష్‌శర్మ, శ్రీకాంతశర్మలు, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య విశేష పుష్పాలతో ఉత్సవమూర్తులను ఘనంగా అభిషేకించారు. స్వామి పాదాల చెంత పూజలందుకున్న పుష్పాల కోసం భక్తులు పోటీపడ్డారు. స్వామివారి పుష్కరిణిలో స్నానమాచరించి పార్వతీ జడల రామలింగేశ్వరునితో పాటు గుట్టపైన ఉన్న ఉపాలయాలు, గుట్ట కింద ఉన్న పార్వతీ అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. పాదరక్ష, కోడె మొక్కులను తీర్చుకున్నారు. ఈ వేడుకలో దేవస్థాన ఈవో సిరికొండ నవీనకుమార్ సిబ్బంది పాల్గొన్నారు.