Share News

మృత్యువులోనూ వీడని స్నేహం

ABN , Publish Date - Aug 12 , 2025 | 12:28 AM

వారిద్దరూ స్నేహితులు. ఆస్పత్రిలో ఉన్న బంధువును చూసి బైక్‌పై తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని మృత్యువాతపడ్డారు.

మృత్యువులోనూ వీడని స్నేహం
రోదిస్తున్న మృతుల బంధువులు

రోడ్డు ప్రమాదంలో యువకులు మృతి

తిరుమలగిరి రూరల్‌, నాగారం, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): వారిద్దరూ స్నేహితులు. ఆస్పత్రిలో ఉన్న బంధువును చూసి బైక్‌పై తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా నాగారం మండలంలో ఆదివారం రాత్రి జరిగింది. తిరుమలగిరి మండలంలోని తొండ గ్రామానికి చెందిన గొలుసుల వెంకన్న, జయమ్మ దంపతుల చిన్న కుమారుడు నరేష్‌(25). గొలుసుల రవి, సాలమ్మ దంపతుల చిన్న కుమారుడు ప్రశాంత్‌. (22) స్నేహితులు. ఇంటర్‌ వరకు చదివిన వీరు గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. డెలివరీ కోసం సూర్యాపేట ఆస్పత్రిలో ఉన్న నరేష్‌ వదినను పరామర్శించడానికి బైక్‌పై సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వెళ్లారు. ఆదివారం రాత్రి సుమారు 9గంటల సమయంలో వస్తుండగా నాగారం- ఫణిగిరి గ్రామాల మధ్య గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో నరేష్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. గ్రామస్థులతో సమాచారంతో ప్రశాంత్‌ను పోలీసులు సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా, చికిత్సపొందుతూ మృతిచెందాడు. చేతికందిన కుమారులు మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. నరేష్‌, ప్రశాంత్‌ మంచి స్నేహితులని, మరణంలోనూ స్నేహాన్ని వదలలేదని అక్కడున్న వారు కంటతడి పెట్టుకున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నాగారం ఎస్‌ఐ ఎం. అయిలయ్య తెలిపారు.

Updated Date - Aug 12 , 2025 | 12:28 AM