Share News

kumaram bheem asifabad- చలిలో చన్నీటి స్నానమే

ABN , Publish Date - Dec 21 , 2025 | 09:46 PM

జిల్లాలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు తీవ్రమైన చలిలోనూ చన్నీటి స్నానమే తప్పడం లేదు. వారం రోజులుగా జిల్లాలో చలి గజ గజ వణికిస్తోంది. ఓ వైపు ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపు పడిపోయాయి. ఒక్కసారిగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయి.

kumaram bheem asifabad- చలిలో చన్నీటి స్నానమే
లోగో

- అలంకారప్రాయంగా సోలార్‌ వాటర్‌ హీటర్లు

- ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని వైనం

- అధికారులు దృష్టి సారించాలని వినతి

బెజ్జూరు, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు తీవ్రమైన చలిలోనూ చన్నీటి స్నానమే తప్పడం లేదు. వారం రోజులుగా జిల్లాలో చలి గజ గజ వణికిస్తోంది. ఓ వైపు ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపు పడిపోయాయి. ఒక్కసారిగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. జిల్లా వ్యాప్తంగా శీతలగాలులతో పాటు ఉదయం పొగమంచు కమ్మేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ విద్యార్థులకు వేడి నీరు అందడం లేదు. చలి కాలంలో చన్నీటి స్నానాలు చేయడంతో విద్యార్థులు వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నా వారి సమస్యలను పట్టించుకున్న వారు కరువయ్యారు. వసతి గృహాల్లో చదివే విద్యార్థులు పేద వర్గాలకు చెందినవారే కావడం, ఇంట్లో ఆర్థికంగా వెనుకబడిన వారు కొందరైతే, తల్లిదండ్రులు కోల్పోయిన వారు మరికొందరు. ఇలా ఉన్నత విద్య అందుబాటులో లేక ఆశ్రమాల్లోనైతే అన్ని వసతులు ఒకేచోట ఉంటాయని, ఉచిత విద్య, పుస్తకాలు, దుస్తులు తదితర సౌకర్యాలు అందుబాటులో ఉంటాయన్న నమ్మకంతో పాఠశాలల్లో చేరుతున్నారు. కానీ పాఠశాలల్లో సమస్యల మద్య సహవాసం చేస్తూ దీనస్థితిని గడుపుతున్నారు.

- బడికి సిద్ధమయ్యేందుకు..

నిత్యం ఉదయం బడికి సిద్ధమయ్యేందుకు స్నానం చేద్దామంటే చలి గుబులు పట్టిస్తోంది. ఎందుకంటే ఆ పిల్లలకు చన్నీళ్లే తప్ప వేడి నీటి జాడ లేదు. రాత్రి వేళలో కంటినిండా నిద్రిద్దామంటే చల్లగాలులు వణికిస్తున్నాయి. మోకాళ్లను పొత్తిళ్ల దగ్గరకు తీసుకొచ్చి పడుకున్నా చలి కలవరపెడుతూనే ఉంది. బరువైన రగ్గులు కప్పుకొందామంటే కరువు. ఇది కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు దుస్థితి. చలి కారణంగా విద్యార్థులు పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. జిల్లాలో మొత్తం 46 ప్రభుత్వ ఆశ్రమ గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 14బాలికల ఆశ్రమ పాఠశాలలు, 32 బాలుర పాఠశాలలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని అన్ని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల సౌకర్యార్థం కోసం 2013లో సోలా ర్‌ వాటర్‌ హీటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గిరిజన విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు వేడి నీళ్లతో ప్నానం చేయడానికి ఆయా పాఠశాలల్లోని భవనాల పైన సౌర యంత్రాలను బిగించింది. ఒక వేడి నీటి యంత్రాన్ని నిర్మించారు. ఒకటి రెండేళ్లు మినహ ఇవి పని చేసిన దాఖలాలు లేవు.

- పట్టింపు లేక నిరుపయోగం..

ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన సోలార్‌ వాటర్‌ హీటర్లు చిన్న చిన్న కారణాలతో పని చేయడం లేదు. హీటర్ల నిర్వహణ సక్రమంగా లేక నిరుపయోగంగా మారుతున్నాయి. కొన్ని పాఠశాలల్లో చిన్నపాటి కారణాలతో చెడిపోయిన వాటికి కూడా అధికారులు మరమ్మతులు చేయడం లేదు. మరి కొన్ని పాఠశాలల్లో కోతులు వాటర్‌ హీటర్లకు న్న పరికరాలు తొలగించాయి. లక్షల రూపాయలతో ఏర్పాటు చేసినా మూనాళ్ల ముచ్చటగా మారడంతో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. కనీసం చలి కాలంలోనైనా మరమ్మత్తులు చేపట్టరా అని విద్యార్థులు ప్రశ్ని స్తున్నారు. దీంతో విద్యార్థులు ఏటా చన్నీటితో స్నా నాలు చేస్తూ అనారోగ్యబారిన పడుతున్నారు. ముఖ్యం గా పలు మండలాల్లో ఏర్పాటు చేసిన సోలార్‌ పరికరాలను కోతులు భవనాలపై ఉన్న పరికరాలను పూర్తిగా ధ్వంసం చేశాయి. ఇదంతా అధికారులకు తెలిసినా మరమ్మతులు చేపట్టడం లేదు. కనీసం పరికరాలు ఏర్పాటు చేసిన చోట రక్షణ చర్యలు తీసుకోకపోవడంతోనే చెడిపోతున్నట్లు విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.

- పరికరాలకు రూ.2.25 లక్షలు..

జిల్లాలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో ఏర్పా టు చేసిన పరికరాలకు ఒక్కో హీటర్‌కు ప్రభుత్వం రూ.2. 25 లక్షలు వెచ్చించారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని ఆశ్రమ పాఠశాలల్లో వీటిని ఏర్పాటు చేశారు. వీటిని ఒక ప్రైవేటు వ్యక్తికి అప్పగించడంతో పనులు పూర్తి చేయించారు. ఏడాది పాటు వాటి నిర్వహణ బాధ్యతను అప్పగించారు. అనంతరం గడువు ముగిసిన అనంతరం పరికరాలు పూర్తిగా చెడిపోవడంతో ఆ తర్వాత వాటి మరమతులు పట్టించుకోలేదు. దీంతో లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసినా నిర్వహణను పట్టించుకోకపోవడంతో విద్యార్థులకు ఏ మాత్రం ఉపయోగం లేకుండా పోయాయి. వీటి మరమ్మత్తుల కోసం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉన్న తాధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఉపా ధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో చలి పంజా విసురుతోంది. విద్యార్థులు మంచి నీటి ట్యాంకుల వద్ద, చేతి పంపుల వద్ద గజ గజ వణుకుతూ చన్నీటితో స్నానాలు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సౌర పరికరాలను బాగు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

ఇబ్బందులు పడుతున్నాం..

- నవీన్‌, విద్యార్థి

ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న తమకు చన్నీటి స్నానాలు చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం. ఎన్నో ఏళ్లుగా సోలార్‌ హీటర్లను బాగు చేయాలని చెబుతున్నా తమ సమస్యను పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు సమస్య పరిష్కరించాలి.

పని చేయడం లేదు..

- వంశీక్రిష్ణ, విద్యారి

సౌర పరికరాలను కోతులు పూర్తిగా ధ్వంసం చేయడంతో అవి పని చేయడం లేదు. దీంతో చలికి చన్నీటి స్నానాలు చేస్తూ తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నాం. అధికారులకు గోడు చెప్పినా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం చలి పెరిగిపోవడంతో స్నానం చేసేందుకు అవస్థలు పడుతున్నాం.

Updated Date - Dec 21 , 2025 | 09:46 PM