Education Secretary Krishna Aditya: తెలుగులోనూ 99 మార్కులు!
ABN , Publish Date - Sep 25 , 2025 | 05:24 AM
ఇంటర్మీడియట్‌లో తెలుగు భాషను ప్రోత్సహించడానికి మరిన్ని చర్యలు తీసుకుంటామని ఇంటర్ విద్యా కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు...
ఇంటర్ విద్యలో మాతృభాషను ప్రోత్సహిస్తాం
ఇంటర్ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య
ప్రభుత్వ కాలేజీల్లో 91,853 కొత్త ప్రవేశాలు
హైదరాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌లో తెలుగు భాషను ప్రోత్సహించడానికి మరిన్ని చర్యలు తీసుకుంటామని ఇంటర్ విద్యా కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అత్యధిక మార్కులు సాధించేందుకు విద్యార్థులు సంస్కృతాన్ని ద్వితీయ భాషగా ఎంచుకోవడం వల్ల తెలుగు తీసుకునేవారి సంఖ్య గణనీయంగా తగ్గిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారంగా ఈ విద్యా సంవత్సరం నుంచే తెలుగులోనూ గరిష్ఠంగా 99 మార్కులు వచ్చేలా మార్పులు చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ నిర్ణయం మాృభాష పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయని కృష్ణ ఆదిత్య తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 9 శాతం వృద్ధి నమోదైంది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో గతేడాది 83,635 మంది చేరగా, ఈ ఏడాది ఈ సంఖ్య 91,853కు పెరిగిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఇంటర్ ప్రవేశాలు 9.82 లక్షలకు చేరాయన్నారు. వచ్చే ఏడాది నుంచి అన్ని సబ్జెక్టుల పాఠ్యాంశాలను మార్చనున్నామని తెలిపారు. అలాగే, కాలేజీల్లోని ఖాళీల భర్తీకి 494 అతిథి అధ్యాపకులను నియమించడానికి ప్రభుత్వం అనుమతించిందని, ఈ నియామకాలు త్వరలో చేపడతామని వెల్లడించారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా మూడు కాలేజీలు వచ్చే ఏడాది నుంచి ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని కృష్ణ ఆదిత్య పేర్కొన్నారు.