kumaram bheem asifabad- రెండో విడతలో 86.64 శాతం పోలింగ్
ABN , Publish Date - Dec 14 , 2025 | 11:49 PM
జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా ఆదివారం జరిగిన మలి విడత ఎన్నికల పోలీంగ్ ప్రశాంతంగా జరిగింది. కాగజ్‌నగర్ డివిజన్‌లోకి బెజ్జూరు, చింతలమానేపల్లి, దహెగాం, కౌటాల, పెంచికల్‌పేట, సిర్పూర్(టి) మండలాల్లోని 113 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే సిర్పూర్(టి) మండలంలోని భూపాలపట్నం గ్రామ పంచాయతీ ఏకగ్రీవం కాగా ఆదివారం 112 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. జిల్లాలో చలి తీవ్రత కారణంగా ఉదయం 7 నుంచి 9 గంటల వరకు పోలింగ్ మందకొడిగా జరిగింది. ఆ తర్వాత పుంజుకుంది.
- ఓటు హక్కు వినియోగించుకున్న 1,13,733 మంది ఓటర్లు
- కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీలు
ఆసిఫాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా ఆదివారం జరిగిన మలి విడత ఎన్నికల పోలీంగ్ ప్రశాంతంగా జరిగింది. కాగజ్‌నగర్ డివిజన్‌లోకి బెజ్జూరు, చింతలమానేపల్లి, దహెగాం, కౌటాల, పెంచికల్‌పేట, సిర్పూర్(టి) మండలాల్లోని 113 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే సిర్పూర్(టి) మండలంలోని భూపాలపట్నం గ్రామ పంచాయతీ ఏకగ్రీవం కాగా ఆదివారం 112 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. జిల్లాలో చలి తీవ్రత కారణంగా ఉదయం 7 నుంచి 9 గంటల వరకు పోలింగ్ మందకొడిగా జరిగింది. ఆ తర్వాత పుంజుకుంది. ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. క్యూలైన్‌లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 19.49 శాతం పోలింగ్ నమోదు కాగా 11 గంటల వరకు 56.91 శాతం, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 84.56 శాతం పోలింగ్ నమోదు కాగా పోలింగ్ సమయం ముగిసే వరకు క్యూలైన్‌లో ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోగ జిల్లాలో మొత్తం 86.64 శాతంగా పోలింగ్ నమోదైంది .జిల్లాలో అత్యధికంగా దహెగాం మండలంలో 90.44 శాతం పోలీంగ్ నమోదు కాగా, అత్యల్పంగా బెజ్జూరు మండలంలో 83.70 శాతం పోలీంగ్ నమోదైంది. పోలీంగ్ సందర్భంగా ఎక్కడ ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకొలేదు. బెజ్జూరు మండలంలో23,734 మంది ఓటర్లకు గాను 19,866 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చింతలమానేపల్లి మండలంలో 23,955 మందికి గాను 20,888 మంది, దహెగాం మండలంలో 22, 092 మందికి గాను 19,980 మంది, కౌటాల మండలంలో 27,357 మందికి గాను 23,238 మంది, పెంచికల్‌పేట మండలంలో 12,302 మందికి గాను 11,104 మంది, సిర్పూర్(టి) మండలంలో 21,838 మందికి గాను 18,657 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పలు మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా ఎస్పీ నితికా పంత్, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్ద శుక్లా, రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు శ్రీనివాస్‌లు సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లు జరుగకుండా ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాల ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించారు
బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): బెజ్జూరు మండలంలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. మండలంలో 22 గ్రామ పంచాయతీలు 188 వార్డు స్థానాల పరిధిలో మొత్తం 23,734 ఓటర్లు ఉండగా 19484 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండల వ్యాప్తంగా 82.11 శాతం పోలింగ్ నమోదు అయింది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా చలి తీవ్రత కారణంగా ఓటింగ్ ప్రక్రియ మందకొడిగా సాగింది. 9 గంటల నుంచి ఓటర్లు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున బారులు తీరారు. మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఆవరణలో ఉన్న ఓటర్లను ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు. కొన్ని చోట్ల 11 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. పెద్ద గ్రామ పంచాయతీలో గడువు వరకు ఓటర్లు బారులు తీరారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు స్వగ్రామమైన రెబ్బెన పంచాయతీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎసైస సర్తాజ్‌పాషా గట్టి బందో బస్తు నిర్వహించారు. ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్, తహసీల్దార్ రామ్మోహన్ ఎప్పటికప్పుడు ఎన్నికల సిబ్బందకి తగు సూచనలు అందజేశారు. కాగా బెజ్జూరు పోలింగ్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ డేవిడ్ సిబ్బందితో కలిసి సందర్శించి పలు సూచనలు చేశారు.
సిర్పూర్(టి), (ఆంధ్రజ్యోతి): సిర్పూర్(టి) మండలంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మండలంలో 16 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో ఒకటి ఏకగ్రీవం కాగా మిగితా 15 పంచాయతీల్లో ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. ప్రత్యేకంగా సిర్పూర్(టి) మేజర్ గ్రామపంచాయతీలో 14 వార్డులకు 79 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇందులో 5921 ఓట్లు పోలయ్యాయి. సిర్పూర్(టి)లో పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ నితికా పంత్, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా, డీఎసీప వహిదుద్దీన్‌లు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. వారి వెంట ఎంపీడీఓ సత్యనారాయణ, తహసీల్దార్ రాహిముద్దీన్, సీఐ సురేష్, ఎస్సై తదితరులు ఉన్నారు.
పెంచికలపేట,(ఆంధ్రజ్యోతి): మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. మండలంలో 12 గ్రామ పంచాయతీ స్థానాల పరిధిలో మొత్తం 12,302 ఓటర్లు ఉండగా 10914 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండల వ్యాప్తంగా 88.72 శాతం నమోదు అయింది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ మందకొడిగా సాగింది. 9 గంటల నుంచి ఓటర్లు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున బారులు తీరారు. మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఆవరణలో ఉన్న ఓటర్లను ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు. కొన్ని చోట్ల 11 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. పెద్ద గ్రామ పంచాయతీలో గడువు వరకు ఓటర్లు బారులు తీరారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై అనీల్‌కుమార్ ఆధ్వర్యంలో గట్టి బందో బస్తు ఏర్పాటు చేశారు. బొంబాయిగూడ, చెడ్వాయి పంచాయతీల్లో ఎన్నికల సరళిని కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లాతో కలిసి పరిశీలించారు.
దహెగాం, (ఆంధ్రజ్యోతి): దహెగాం మండలంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. మండలంలో 24 గ్రామపంచాయతీల పరిధిలో 200 వార్డు స్థానాల్లో మొత్తం 22092 ఓటర్లు ఉండగా 19882 ఓటర్లు తమ ఓటు హకుక వినియోగించుకున్నారు. దహెగాం మండల వ్యాప్తంగా 90.46 శాతం పోలింగ్ నమోదు అయింది. చలి తీవ్ర ఉన్న కారణంగా ఉదయం 7 గంటల నుంచి కాస్త మందకొడిగా సాగిన పోలింగ్ 9 గంటల తరువాత ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినయోగిచుకున్నారు. ఈ సందర్భంగా 224 మంది పీఓలు, 244 మంది ఓపీఓలు, 25 మంది ఆర్‌ఓలతో పాటు 500 పైగా ఎన్నిక సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు.