Share News

Road Accident: అతివేగం.. ప్రాణ సంకటం!

ABN , Publish Date - Oct 26 , 2025 | 04:07 AM

తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు ఏటేటా పెరిగిపోతున్నాయి. వేలాది మంది ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి..

Road Accident: అతివేగం.. ప్రాణ సంకటం!

  • గత 11 ఏళ్లలో తెలంగాణలో రోడ్డు ప్రమాదాల్లో 86 వేల మంది మృతి

  • ప్రమాదాల్లో 85ు అతివేగం వల్లే!

  • నామ్‌కే వాస్తేగా రోడ్‌సేఫ్టీ అథారిటీ డీజీపీ పోస్టు

  • ఏళ్లకేళ్లుగా పదవి ఖాళీ.. సిబ్బంది కూడా కరువు

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు ఏటేటా పెరిగిపోతున్నాయి. వేలాది మంది ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. గత 11 ఏళ్లలో రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో మరణించినవారి సంఖ్య 86 వేలకుపైగానే ఉండటం గమనార్హం. రోడ్డు ప్రమాదాల సంఖ్యలో తెలంగాణ ఏటా జాతీయ స్థాయిలో 6 నుంచి 8 స్థానాల మధ్యలోనే ఉంటోంది. రోడ్డు ప్రమాదాల్లో మరణాలు సంభవించినపుడు.. అక్కడ ప్రమా దం ఎందుకు జరిగింది? మరణం సంభవించడానికి కారణాలేమిటి? రోడ్డు నిర్మాణ లోపాలు ఉన్నాయా? అతి వేగమా? మరేదైనా కారణముందా అని గుర్తించాల్సిన వ్యవస్థలు నిర్వీర్యమవడమే దీనికి కారణమనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ కోసం పోలీసుశాఖలో అదనపు డీజీ స్థాయి అధికారికి రోడ్‌సేఫ్టీ విభాగం బాధ్యతలు అప్పగిస్తుంటారు. ప్రత్యేకంగా రోడ్‌ సేఫ్టీ అథారిటీకి చైర్మన్‌ కూడా ఉంటారు. అది డీజీపీ స్థాయి పోస్టు. అసలు చాలా ఏళ్లపాటు ఈ పోస్టు ఖాళీగానే ఉం డటం గమనార్హం. 2020లో మహేందర్‌రెడ్డి డీజీపీగా ఉన్న సమయంలో రోడ్డు ప్రమాదాల విశ్లేషణ చేపట్టారు. ఆ తర్వా త ఆ దిశగా పోలీసు బాసులెవరూ దృష్టిపెట్టలేదు. ఇటీవల డీజీపీగా బాధ్యతలు చేపట్టిన శివధర్‌రెడ్డి తొలిసారి పోలీసు ఉన్నతాధికారులు, యూనిట్‌ ఆఫీసర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. తెలంగాణలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో ఆరేడువేల మంది వరకు మరణిస్తుండటం బాధాకరమని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో మరణం సంభవించిన ప్రతిచోటా నిశిత విశ్లేషణ చేసి మరో ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


మితిమీరిన వేగమే ప్రమాదం..

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఈ ఏడాది సెప్టెంబరు నెలాఖరు వరకు 2,66,650 ప్రమాదాలు జరగ్గా.. 86,186 మంది మరణించారు. పోలీసుశాఖ జరిపిన విశ్లేషణలో.. 85శాతం ప్రమాదాలు మితిమీరిన వేగంతో, 4శాతం ప్రమాదాలు మద్యం మత్తుతో, మిగతావి వివిధ కారణాలతో జరిగినట్టు తేలింది. మితిమీరిన వేగంతో జరిగిన ఘటనల్లోనే 77శాతం మరణాలు నమోదవుతున్నాయి. ఇక రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో.. పాదచారులు 18శాతం, ద్విచక్ర వాహనదారులు 52శాతం, ఆటోల్లో ప్రయాణిస్తున్నవారు 6 శాతం, కార్లలో ప్రయాణిస్తున్న వారు 12శాతం, ట్రక్కులు, లారీల్లోని వారు 8శాతం, బస్సుల్లో ప్రయాణిస్తున్నవారు 4శాతం వరకు ఉంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా వేగం పరిమితమే

ఆస్ట్రేలియా, చైనా సహా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కూడా గరిష్టంగా గంటకు 110-120 కిలోమీటర్ల మధ్య వేగ పరిమితులు ఉన్నా యి. కొన్ని ప్రత్యేమైన హైవేలపై మాత్రం కొంత ఎక్కువ వేగాన్ని అనుమతిస్తారు. ఇలా సౌదీ, కజకిస్థాన్‌లలో గంటకు 140 కి.మీ, యూఎ్‌సఏలో 137 కి.మీ.గరిష్ఠ వేగానికి అనుమతి ఉంది. ఇక ప్రపంచంలోనే అత్యధికంగా చెక్‌రిపబ్లిక్‌లోని టబోర్‌-సెస్కే హైవే, స్పెయిన్‌లో మ్యాకనెట్‌ డీ లాసెల్వా- ఎల్‌ వెండ్రెల్‌ హైవేలలో 150 కిలోమీటర్ల గరిష్ట వేగానికి అనుమతి ఉంది. అవి అత్యంత భద్రతా ప్రమాణాలతో నిర్మించిన రహదారులు కావడం గమనార్హం.

వేగ నియంత్రణ మాటేలేని ప్రైవేటు బస్సులు!

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ నుంచి విజయవాడ ఇబ్రహీంపట్నం మధ్య దూరం 250 కి.మీ... ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు 3 గంటల్లో ఆ దూరాన్ని అధిగమిస్తాయి. అంటే ఆ బస్సులు ఎంత వేగంతో దూసుకెళుతున్నాయో అర్థమవుతుంది. ఈ హైవేలో రెండు చోట్ల స్పీడ్‌గన్‌లు ఉండగా, బస్సు డ్రైవర్లు ఆ ప్రాంతాల దగ్గరకు వచ్చేసరికి వేగం తగ్గిస్తున్నారు. నిజానికి మన హైవేలలో చాలా వరకు బస్సులైతే గంటకు 80 కి.మీ. వేగంతో, కార్ల వంటివి అయితే 100కి.మీ. వేగంలోపే ప్రయాణించేలా డిజైన్‌ చేసినవి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. హైవేలపై వేగం గంటకు 90 కి.మీ. మించకూడదు. తెలంగాణలో అయితే 80కి.మీ. వేగం దాటకూడదు. కానీ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులను 120 కి.మీ.కుపైగా వేగంతో నడుపుతున్నారు. దీనితో ఏ చిన్న తేడా వచ్చినా క్షణాల్లోపే వాహనంపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోతారు. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో అంతర్రాష్ట్ర సర్వీసుల్లో నడిచే రాజధాని, సూపర్‌ లగ్జరీ బస్సులకు 80కి.మీ, రాష్ట్రంలోపల తిరిగే సర్వీసులకు 75కి.మీ. వేగపరిమితి పాటిస్తుండటం గమనార్హం.

Updated Date - Oct 26 , 2025 | 04:08 AM