Share News

Indian Road Congress: ఐఆర్‌సీ 85వ సదస్సు తెలంగాణలోనే

ABN , Publish Date - Nov 08 , 2025 | 02:36 AM

ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ (ఐఆర్‌సీ) 85వ సదస్సు తెలంగాణలో జరగనుంది. ప్రస్తుతం భువనేశ్వర్‌లో జరుగుతున్న 84వ ఐఆర్‌సీ సదస్సులో .....

Indian Road Congress: ఐఆర్‌సీ 85వ సదస్సు తెలంగాణలోనే

  • భువనేశ్వర్‌ సదస్సులో ఆమోదం తెలిపిన కౌన్సిల్‌

  • కేంద్రానికి మంత్రి కోమటిరెడ్డి ధన్యవాదాలు

  • ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’

హైదరాబాద్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ (ఐఆర్‌సీ) 85వ సదస్సు తెలంగాణలో జరగనుంది. ప్రస్తుతం భువనేశ్వర్‌లో జరుగుతున్న 84వ ఐఆర్‌సీ సదస్సులో నిర్వహించిన కౌన్సిల్‌ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనను ఆమోదించారు. 85వ సదస్సును తెలంగాణలో నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలంటూ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీకి లేఖ రాశారు. ఈ మేరకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఆ తరువాత సమావేశమైన ఐఆర్‌సీ కౌన్సిల్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. దీంతో కేంద్ర మంత్రి గడ్కరీకి కోమటిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అసోం, రాజస్థాన్‌ రాష్ట్రాల ప్రతినిధులు పోటీకి వచ్చినా.. కేంద్రం, ఐఆర్‌సీ కౌన్సిల్‌ తెలంగాణ వైపే మొగ్గుచూపించాయని ఆర్‌అండ్‌బీ అధికారుల ద్వారా తెలిసింది. కాగా, తెలంగాణలో ఐఆర్‌సీ 85వ సదస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని, తెలంగాణకు అవకాశం దక్కవచ్చంటూ ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పింది. అక్టోబరు 29న ఇందుకు సంబంధించి కథనం ప్రచురించింది.

2016లోనూ హైదరాబాద్‌లో సదస్సు..

పదేళ్ల క్రితం 2016లో ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ 77వ సదస్సు తెలంగాణలో జరిగింది. ఆ సమయంలోనే తెలంగాణకు దాదాపు రూ.12 వేల కోట్ల విలువ చేసే పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులను కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. మళ్లీ పదేళ్ల తరువాత రాష్ట్రంలో ఐఆర్‌సీ సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కొత్త ప్రాజెక్టులు ప్రకటించే అవకాశం కూడా ఉందని అధికార వర్గాలు అంటున్నాయి. వచ్చే ఏడాది సదస్సుకు 4-5వేల మంది దాకా వచ్చే అవకాశం ఉంటుందని, ఖర్చు కూడా రూ.18 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు అన్ని రాష్ట్రాల ప్రతినిధులు వస్తుండడంతో.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

ఐఆర్‌సీ కౌన్సిల్‌ అధ్యక్ష పదవి తెలంగాణకు!

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ కౌన్సిల్‌ అధ్యక్ష పదవి ఈసారి తెలంగాణకు దక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐఆర్‌సీ కౌన్సిల్‌ సభ్యుడిగా, వైస్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ ఈఎన్సీ మోహన్‌నాయక్‌కు ప్రెసిడెంట్‌గా అవకాశం లభించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం భువనేశ్వర్‌లో జరుగుతున్న సదస్సు సందర్భంగా ఈ అంశంపై చర్చలు జరిగినట్లు, ఈసారి తెలంగాణకు అవకాశమివ్వాలనే ఉద్దేశంతో కౌన్సిల్‌ ఉన్నట్లు తెలిసింది. అవకాశం దక్కితే తెలంగాణకు ఇదే మొదటిసారి కానుంది. దీనిపై ఈ నెల 10న భువనేశ్వర్‌లో ముగియనున్న ఐఆర్‌సీ సదస్సులో ప్రకటన వెలువడనున్నట్లు తెలిసింది.

Updated Date - Nov 08 , 2025 | 02:36 AM