IT Minister Sridhar Babu: నుమాయిష్‌కు వేళాయె
ABN , Publish Date - Dec 29 , 2025 | 01:21 AM
దేశంలోనే అతి పెద్దదైన ప్రతిష్ఠాత్మక 85వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన-2026 నుమాయి్‌షను వచ్చే జనవరి 1 సాయంత్రం నుంచి ప్రారంభించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు...
జనవరి 1న డిప్యూటీ సీఎం భట్టి చేతుల మీదుగా షురూ.. 45 రోజుల పాటు నిర్వహణ : మంత్రి శ్రీధర్‌బాబు
అఫ్జల్‌గంజ్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : దేశంలోనే అతి పెద్దదైన ప్రతిష్ఠాత్మక 85వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన-2026 నుమాయి్‌షను వచ్చే జనవరి 1 సాయంత్రం నుంచి ప్రారంభించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల ఉత్పత్తుల ప్రదర్శన, మార్కెటింగ్, వ్యాపారం, వినోదం, విజ్ఞానం వంటి వాటికి వేదికగా నిలుస్తున్న ఈ నుమాయిష్ ఫిబ్రవరి 15 వరకు వరుసగా 45 రోజుల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దీన్ని ప్రారంభిస్తారని, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితోపాటు పలువురు పాల్గొంటారని తెలిపారు. ఎగ్జిబిషన్ మైదానం గాంధీ సెంటినరీ హాల్ వేదికగా శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన నుమాయిష్ వివరాలు వెల్లడించారు. రోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు నుమాయిష్ తెరిచి ఉంటుందని, శని, ఆదివారాలు, ప్రభుత్వ సెలవు రోజుల్లో రాత్రి 11 గంటల వరకు ఉంటుందని ఆయన వివరించారు. ప్రవేశ టికెట్ ధర రూ.50 అని, ఐదేళ్లలోపు పిల్లలకు ఉచితం అని పేర్కొన్నారు. నుమాయి్‌షను సందర్శించేందుకు లక్షల సంఖ్యలో వచ్చే సందర్శకులకుఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. సందర్శకుల సౌకర్యార్థం రాకపోకలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుస్తాయని, అదేవిధంగా మెట్రో రైళ్లను రాత్రి 11 గంటల వరకు నడుపుతారని చెప్పారు. వాహనాల పార్కింగు గృహకల్ప, చంద్రవిహార్, గగన్ విహార్, భీంరావుబాడ ఖాళీ స్థలాల్లో చేసుకోవచ్చన్నారు. నుమాయిష్ ద్వారా 2024, 2025 సంవత్సరాల్లో వివిధ పన్నుల ద్వారా ప్రభుత్వానికి రూ.10 కోట్ల ఆదాయం సమకూరిందని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి రాజేశ్వర్, జాయింట్ సెక్రటరీ చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు సుఖేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.