BRS politics: ఏం చెబుదాం!?
ABN , Publish Date - Sep 13 , 2025 | 05:09 AM
నోటీసులు అందుకున్న పది మంది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది స్పీకర్‌కు వివరణ ఇచ్చారు! పిలిచినప్పుడు హాజరై దానిపై వాదనలు వినిపించాలంటూ...
న్యాయ నిపుణులతో చర్చల్లో దానం, కడియం
బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన నాగేందర్
వరంగల్ లోక్‌సభలో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున శ్రీహరి ప్రచారం
వివరణ ఇవ్వడంపై మల్లగుల్లాలు.. మరింత గడువు కోరిన ఎమ్మెల్యేలు
హైదరాబాద్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): నోటీసులు అందుకున్న పది మంది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది స్పీకర్‌కు వివరణ ఇచ్చారు! పిలిచినప్పుడు హాజరై దానిపై వాదనలు వినిపించాలంటూ బీఆర్‌ఎస్‌కు స్పీకర్ కార్యాలయం నోటీసులూ ఇచ్చింది! కానీ, దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇంకా న్యాయ నిపుణులతో చర్చల్లోనే ఉన్నారు. వివరణ ఇచ్చేందుకు స్పీకర్ నుంచి మరింత గడువు కూడా కోరారు. ఇందుకు కారణం లేకపోలేదు. మిగిలిన ఎనిమిది మందిదీ ఓ దారి అయితే.. వీరిద్దరిదీ ‘రహదారి’ కావడమే ఇక్కడ సమస్య. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ టికెట్‌పై గెలిచిన పదిమంది కాంగ్రె్‌సలో చేరారని, వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు బీఆర్‌ఎస్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వారిని అనర్హులను చేయాలంటూ సుప్రీం కోర్టునూ ఆశ్రయించింది. బీఆర్‌ఎస్ ఫిర్యాదుపై మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని గత నెల 25న సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చర్యలకు ఉపక్రమించిన స్పీకర్.. వివరణ ఇవ్వాల్సిందిగా పది మంది ఎమ్మెల్యేలకూ నోటీసులు జారీ చేశారు. వీరిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి మినహా మిగిలిన 8 మందీ స్పీకర్ కార్యాలయానికి వివరణ ఇచ్చారు. తాము పార్టీ మారలేదని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నామని వివరణ ఇచ్చిన వారు.. దానికి సంబంధించిన ఆధారాలూ సమర్పించారు. దాంతో, విచారణకు పిలిచినప్పుడు హాజరై.. ఆయా కేసుల్లో బీఆర్‌ఎస్ తరఫున వాదనలు చెప్పాలంటూ ఆ పార్టీకి స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇచ్చింది కూడా. అయితే వివరణ ఇచ్చేందుకు స్పీకర్‌ను దానం, కడియం కొంత గడువు కోరారు. కాంగ్రెస్ పార్టీ కార్యాచరణలో వారు పాల్పంచుకున్నట్లు స్పష్టమైన ఆధారాలున్న నేపథ్యంలో స్పీకర్‌కు ఇచ్చే వివరణపై న్యాయ నిపుణులతో వారు చర్చలు జరుపుతున్నారు. నిజానికి, బీఆర్‌ఎస్ టికెట్‌పై ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్.. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మూడు రంగుల కండువా కప్పుకొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక, స్టేషన్ ఘన్‌పూర్ నుంచి బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచిన కడియం శ్రీహరి.. లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తన కుమార్తె కడియం కావ్య తరఫున బాహాటంగానే ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్ నోటీసులకు ‘ఏం చెప్పాలనే’ అంశంపై వీరిద్దరూ న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. ఇవి కొలిక్కి రావడానికి ఇంకాస్త సమయం పడితే.. స్పీకర్‌ను కలిసి మరికొంత గడువు కోరే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న శ్రీహరి ఇంటికే పరిమితమయ్యారని, కోలుకోగానే స్పీకర్‌కు ఇచ్చే వివరణపై దృష్టి పెడతారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.