Share News

8 ఎకరాలు.. 3టన్నుల ఆయిల్‌పామ్‌ తొలి దిగుబడి

ABN , Publish Date - Jun 02 , 2025 | 12:30 AM

సూర్యాపేట జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ ఆయిల్‌పామ్‌ సాగులో మొదటి కోతలోనే ఎనిమిది ఎకరాల్లో మూడు టన్నుల దిగుబడి సాధించారు.

8 ఎకరాలు.. 3టన్నుల ఆయిల్‌పామ్‌ తొలి దిగుబడి
నల్లగొండ జిల్లా చండూరు మండలం కొండాపురం గ్రామంలో ఆయిల్‌ పామ్‌ దిగుబడిని చూపుతున్న సూర్యాపేట జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ

సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తోటలో కాత

ఉద్యానశాఖ సూచనలతో అధిక దిగుబడులు

ప్రభుత్వ ఉద్యోగిలా నెలసరి ఆదాయం వస్తుంది: ఎస్పీ నరసింహ

చండూరురూరల్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ ఆయిల్‌పామ్‌ సాగులో మొదటి కోతలోనే ఎనిమిది ఎకరాల్లో మూడు టన్నుల దిగుబడి సాధించారు. స్వగ్రామం నల్లగొండ జిల్లా చండూరు మండలం కొండాపురం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్‌పామ్‌ తోట సాగు చేస్తున్నారు. ఆదివారం మొదటి దిగుబడి కోయగా సుమారు 3 టన్నుల దిగుబడి వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కొత్తపల్లి నరసింహ మాట్లాడుతూ 2021-22 సంవత్సరంలో ఉద్యానశాఖ నల్లగొండ ఆధ్వర్యంలో ఆయిల్‌పామ్‌ మొక్కలను నాటినట్లు తెలిపారు. మూడేళ్ల వయసులో ఆ మొక్కలు మొదటి పంట ప్రారంభమైందని, సుమారు 3టన్నుల దిగుబడి వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఉద్యానశాఖ అధికారుల సలహాలు, సూచనలు మేరకు మేలైన యాజమాన్య పద్ధతులు, డ్రిప్‌ ద్వారా నీటి యాజమాన్యం పాటించి, సేంద్రీయ ఎరువుల వినియోగం ద్వారా వ్యవసాయం చేసి అధిక దిగుబడులు వచ్చాయన్నారు. నీటి వసతి కలిగిన రైతులందరూ ఆయిల్‌పామ్‌ సాగు చేపడితే మంచి లాభాలు పొందవచ్చని, ఎలాంటి మార్కెటింగ్‌ సమస్య ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని తెలిపారు. ప్రతీ నెలా పంట దిగుబడిని తీస్తూ ప్రభుత్వ ఉద్యోగి మాదిరిగా నెలసరి ఆదాయం పొందవచ్చని సూచించారు. సాధారణంగా ఎనిమిది ఎకరాల్లో మొదటి కోతలో రెండు టన్నుల వరకే దిగుబడి వస్తుందని, మేలైన పద్ధతులు పాటించటంతో మూడు టన్నుల దిగుబడి వచ్చిందని జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి పిన్నపురెడ్డి అనంతరెడ్డి తెలిపారు. మూడేళ్లలో సాగుకు రూ.2లక్షలు ఖర్చుకాగా, ప్రభుత్వ సబ్సిడీ రూ.1లక్ష వస్తుందన్నారు. ఆయిల్‌పామ్‌ టన్నుకు రూ.21వేలు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ప్రతి నెల ఆయిల్‌ పామ్‌ పంట దిగుబడి వస్తుందని, దీంతో ఆదాయం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధికారి రావుల విద్యాసాగర్‌, పతంజలి ఫీల్డ్‌ ఆఫీసర్‌ శ్రీను, మోహన్‌, రైతులు శ్రీను, శంకరమ్మ, లింగస్వామి పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2025 | 12:30 AM