Share News

Montek Singh Ahluwalia: 8-9శాతం వృద్ధి రేటుతో వికసిత్‌ భారత్‌ లక్ష్యం సాకారం

ABN , Publish Date - Dec 02 , 2025 | 05:42 AM

దేశ మాజీ ప్రధానులు పీవీ నర్సింహారావు, మన్మోహన్‌సింగ్‌లు తీసుకువచ్చిన మాదిరిగా ఆర్థిక సంస్కరణలు తేవాలని చాలా మంది కోరుకుంటున్నారని ప్రణాళిక సంఘం మాజీ డిప్యూటీ చైర్మన్‌ మాంటెక్‌సింగ్‌ అహ్లువాలియా....

Montek Singh Ahluwalia: 8-9శాతం వృద్ధి రేటుతో వికసిత్‌ భారత్‌ లక్ష్యం సాకారం

  • పీవీ, మన్మోహన్‌సింగ్‌ తెచ్చినట్టుగా ఆర్థిక సంస్కరణలు తేవాలి

  • ప్రణాళిక సంఘం మాజీ డిప్యూటీ చైర్మన్‌ మాంటెక్‌సింగ్‌ అహ్లువాలియా

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): దేశ మాజీ ప్రధానులు పీవీ నర్సింహారావు, మన్మోహన్‌సింగ్‌లు తీసుకువచ్చిన మాదిరిగా ఆర్థిక సంస్కరణలు తేవాలని చాలా మంది కోరుకుంటున్నారని ప్రణాళిక సంఘం మాజీ డిప్యూటీ చైర్మన్‌ మాంటెక్‌సింగ్‌ అహ్లువాలియా పేర్కొన్నారు. అప్పుడున్న పరిస్థితులను బట్టి పీవీ, మన్మోహన్‌సింగ్‌లు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారన్నారు. 1991వరకు అనేక అంశాల్లో ప్రపంచంతో సంబంధాలు నెరపకుండా దూరంగా ఉన్న భారత్‌లో అవకాశాలకు ఒక్కసారిగా ద్వారాలు తెరిచారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడలాంటి క్లిష్ట పరిస్థితులేమీలేకున్నా ప్రధానంగా రెండు సవాళ్లు కనిపిస్తున్నాయన్నారు. వాటిలో ఒకటి మన వృద్ధిని అడ్డుకుంటున్న దేశీయ పరిస్థితులయితే.. మార్పులను మారిన ప్రపంచంతో ఎలా అనుసంధానించాలనేది రెండోది అని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (సెస్‌)లో నిర్వహించిన 4వ బీపీఆర్‌ విఠల్‌ మెమోరియల్‌ లెక్చర్‌లో మాంటెక్‌సింగ్‌ అహ్లువాలియా కీలకోపన్యాసం చేశారు. ‘అత్యంత వేగంగా మారుతున్న ప్రపంచంలో విధానాల రూపకల్పనలో ఎదురయ్యే సవాళ్లు’ అనే అంశంపై ఆయన ఢిల్లీ నుంచి వెబినార్‌లో మాట్లాడారు. 20 ఏళ్లలో చేసిన సంస్కరణ ఫలితంగానే ఇప్పుడు 6.5ు వృద్ధిని సాధించగలిగామని, ఇప్పుడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్ధల్లో భారత్‌ ఒకటిగా నిలిచిందన్నారు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యం చేరేందుకు 6.5ు వృద్ధి రేటు సరిపోదని, కనీసం 8-9 శాతం వృద్ధి రేటు ఉంటేనే ఆ లక్ష్యం సాకారం అవుతుందన్నారు. ఇందుకు ప్రభుత్వ ప్రయత్నాలు అధికం కావాల్సి ఉంటుందని చెప్పారు. ప్రపంచం అత్యంత వేగంగా మారుతోందని, మారుతున్న అంశాలను నిశితంగా గమనిస్తూ విధానాలను రూపొందించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. భౌగోళిక, రాజకీయ పరిస్థితులు, అంతర్జాతీయ వాణిజ్యం, వాతావరణ మార్పులు గణనీయమైన మార్పులకు కారణమవుతున్నాయని చెప్పారు. విద్య, ఆరోగ్య రంగాలతోపాటు పరిశోధనలు, రక్షణ రంగాలపై చేసే వ్యయం పెంచాల్సి ఉందని అహ్లువాలియా అన్నారు. ఆర్థిక లోటు తగ్గించడంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ చర్యలు ప్రశంసనీయమని చెప్పారు. తెలంగాణలో హైదరాబాద్‌, కర్ణాటకలో బెంగళూరు అభివృద్ధి చెందినట్లుగా ఈ రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి లేదన్నది వాస్తవమేనన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆర్బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు మాట్లాడుతూ.. విధాన పరమైన నిర్ణయాలను తీసుకోవడం గతంలోకన్నా ఇప్పుడు సంక్లిష్టంగా మారిందని చెప్పారు. బీపీఆర్‌ విఠల్‌ ఇంటలెక్చువల్‌ బ్యూరోక్రాట్‌ అని, ఏడుగురు ముఖ్యమంత్రులతో కలిసి పనిచేయడంతోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశారన్నారు. కార్యక్రమంలో ఇటీవల పద్మశ్రీ అందుకున్న సెస్‌ మాజీ చైర్‌పర్సన్‌ ప్రొఫెసర్‌ కెఎల్‌ కృష్ణను సత్కరించారు.

Updated Date - Dec 02 , 2025 | 05:42 AM