Share News

Maoists Surrender: 71 మంది మావోయిస్టుల లొంగుబాటు

ABN , Publish Date - Sep 25 , 2025 | 04:29 AM

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతెవాడ జిల్లా పోలీసుల ఎదుట బుధవారం 71మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 21 మంది మహిళలతో పాటు ఓ బాలుడు...

Maoists Surrender: 71 మంది మావోయిస్టుల లొంగుబాటు

  • వారిలో 21 మంది మహిళలు, ముగ్గురు మైనర్లు

  • 30 మందిపై రూ.64 లక్షల రివార్డు

  • పోలీసులపై దాడులు, విధ్వంసక చర్యల్లో వారి ప్రమేయం

చర్ల, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతెవాడ జిల్లా పోలీసుల ఎదుట బుధవారం 71మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 21 మంది మహిళలతో పాటు ఓ బాలుడు (17), ఇద్దరు బాలికలు (16, 17) ఉన్నారు. వీరిలో 30 మందిపై రూ.64 లక్షల రివార్డు ఉంది. వీరు మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పని చేశారు. బమన్‌ మడ్కం (30), మాంకీ అలియాస్‌ షమీలా మాండవి (20)లు ఒక్కొక్కరిపై రూ.8 లక్షల చొప్పున, గంగి అలియాస్‌ రోహిణీ బర్సే (25), దేవె అలియాస్‌ కవితా మాద్వి (25), సంతోష్‌ మాండవి (30)లు ఒక్కొక్కరిపై రూ.5 లక్షల చొప్పున, మిగతావారిపై కూడా రూ.50 వేల నుంచి రూ.3 లక్షల వరకు రివార్డు ఉంది. పోలీసులపై జరిగిన పలు దాడుల్లో బమన్‌, షమీలా, గంగి ప్రమేయం ఉందని దంతెవాడ ఎస్పీ గౌరవ్‌ రాయ్‌ తెలిపారు. మిగతా మావోయిస్టులు రోడ్లు తవ్వేయడం, చెట్లు కూల్చేయడం, నక్సలైట్ల బ్యానర్లు కట్టడం, పోస్టర్లు అంటించడం, కరపత్రాలు పంచడం వంటి కార్యకలాపాల్లో పాల్గొన్నారని చెప్పారు. మావోయిస్టు పార్టీ డొల్ల సిద్ధాంతంతో విసిగిపోయామని లొంగిపోయినవారు తెలిపారని పేర్కొన్నారు. బస్తర్‌ రేంజ్‌ పోలీసులు ప్రారంభించిన పునరావాస కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కొత్త పునరావాస విధానం తమను ప్రభావితం చేశాయని చెప్పారని తెలిపారు. లొంగిపోయినవారికి రూ.50 వేల ఆర్థిక సహాయంతో పాటు పునరావాసం కల్పిస్తామన్నారు. గత 17 నెలల్లో బస్తర్‌ డివిజన్‌లో లాల్‌వర్రాట్‌ కార్యక్రమం కింద 1,113 మంది మావోయిస్టులు లొంగిపోయారని, వారిలో 297 మందిపై రివార్డులు ఉన్నాయని ఎస్పీ చెప్పారు. లొంగిపోయినవారిలో దంతెవాడ జిల్లా నుంచి 461 మంది ఉన్నారన్నారు. కాగా, ఛత్తీ్‌సగఢ్‌లోని నారాయణ్‌పూర్‌ జిల్లాలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేతలు రాజు దాదా అలియాస్‌ కట్టా రామచంద్రారెడ్డి (63), కోసా దాదా అలియాస్‌ కడారి సత్యనారాయణ రెడ్డి (67) మృతిచెందిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బతగిలింది. తాజాగా వరుస లొంగుబాట్లతో పార్టీ మనుగడ కష్టంగా కనిపిస్తోంది.

Updated Date - Sep 25 , 2025 | 04:29 AM