Share News

Fake Certificate: నకిలీ లెక్చరర్లు!

ABN , Publish Date - Oct 10 , 2025 | 03:53 AM

రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న జూనియర్‌ లెక్చరర్ల క్రమబద్ధీకరణ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని, 700 మంది నకిలీ...

Fake Certificate: నకిలీ లెక్చరర్లు!

  • వరంగల్‌ ఆర్‌జేడీ నేతృత్వంలోని కమిటీ నిర్ధారణ

నల్లగొండ, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న జూనియర్‌ లెక్చరర్ల క్రమబద్ధీకరణ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని, 700 మంది నకిలీ ధ్రువీకరణ పత్రాలను సమర్పించి క్రమబద్ధీకరణ పొందారని తేలింది. 2023లో రాష్ట్రవ్యాప్తంగా 3,800 మంది కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్‌ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఈ లెక్చరర్ల ధ్రువీకరణ పత్రాల పరిశీలనను చేపట్టిన వరంగల్‌ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌(ఆర్‌జేడీ) నేతృత్వంలోని విచారణ కమిటీ 700మంది తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రెగ్యులరైజ్‌ అయ్యారని గుర్తించింది. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో జూనియర్‌ లెక్చరర్లు కొందరు రెగ్యులరైజ్‌ అయ్యారని, ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని గత ఏడాది నుంచి తెలంగాణ నిరుద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ, తెలంగాణ విద్యారంగ పరిరక్షణ సమితి సహా పలు సంస్థలు ఉన్నత విద్యామండలికి, సీఎం రేవంత్‌ రెడ్డికి ఫిర్యాదు చేశాయి. ఈ మేరకు గత జూలైలో వరంగల్‌ ఆర్‌జేడీ అధ్యక్షతన ఇంటర్‌ బోర్డు కమిటీని ఏర్పాటు చేసింది. 2023లో రెగ్యులరైజ్‌ అయిన జూనియర్‌ లెక్చరర్ల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆ కమిటీని ఆదేశించింది. ఈ కమిటీ అప్పటి నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలు మినహా 31 జిల్లాల్లో క్రమబద్ధీకరణ పొందిన జూనియర్‌ లెక్చరర్ల రఽధువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించింది. ఆ పత్రాలకు సంబంధించి వివిధ యూనివర్సిటీల నుంచి వివరణ కూడా తీసుకుంది. క్రమబద్ధీకరణ పొందేందుకు ఇంటర్‌ బోర్డు నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా పలువురు తప్పుడు విధానాలు అవలంబించినట్లు కమిటీ తేల్చింది. ప్రధానంగా రాష్ట్రంలో చెల్లుబాటు కాని ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేటు యూనివర్సిటీల నుంచి పీజీ చేసినట్లు కొందరు, ఇతర రాష్ట్రాల్లోని యూనివర్సిటీల నుంచి దూరవిద్య ద్వారా ఆయా కోర్సులు పూర్తి చేసినట్లు ఇంకొందరు ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లుగా కమిటీ గుర్తించింది. అలాగే.. జీవో 16 ప్రకారం, 2014లో మంజూరైన పోస్టుల్లో కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్న వారిని, 14 ఏళ్ల పాటు వరుసగా సర్వీసులో ఉన్న వారినే క్రమబద్ధీకరించాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా మధ్యలో సర్వీస్‌ బ్రేక్‌ అయిన వారిని కూడా హడావుడిగా క్రమబద్ధీకరించినట్లు కమిటీ గుర్తించింది. అదేవిధంగా పుట్టిన తేదీని మార్చ టం, కొన్ని యూనివర్సిటీలతో సంబంధిత కోర్సులే లేకపోయినా ఆ కోర్సు చదివినట్లు తప్పుడు పత్రాలు సృష్టించడం వంటి అంశాలను కమిటీ సభ్యులు గుర్తించారు.


నకిలీల పైరవీలు

నకిలీ ధ్రువీకరణ పత్రాలతో క్రమబద్ధీకరణ పొందిన 700 మందిపై చర్యల నిమిత్తం అటార్నీ జనరల్‌ నుంచి ఇంటర్‌ బోర్డు న్యాయపరమైన సలహా పొందినట్లు తెలిసింది. అయితే నకిలీలపై చర్యలు తీసుకుంటే, వారిని రెగ్యులరైజ్‌ చేసిన సమయంలో క్రియాశీలక బాధ్యతలు నిర్వహించిన ఇంటర్‌ బోర్డుకు చెందిన అధికారిపై వేటుపడే అవకాశం ఉంది. దీంతో నకిలీలపై చర్యలు తీసుకోకుండా ఉన్నత స్థాయిలో బేరసారాలకు తెరలేపినట్లు చర్చ సాగుతోంది. అక్రమంగా క్రమబద్ధీకరణ పొందిన లెక్చరర్లను తొలగించకుండా ఉండేందుకు ప్రధానంగా ఒక సంఘం నేత, మరో ఇద్దరు కీలక ఇంటర్‌ బోర్డు అధికారులు రాష్ట్ర ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తుల ద్వారా పైరవీలు చేస్తున్నారని చెబుతున్నారు. ఓ మంత్రి ద్వారా సీఎ్‌సపైనా ఒత్తిడి తెచ్చి చర్యల నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన వారు కూడా అప్పట్లో తలా రూ.5లక్షల వరకు అప్పటి నేతలు, సంఘం నాయకులు, ఇంటర్‌ బోర్డులో పనిచేసిన వారికి ఇచ్చారనే ఆరోపణలున్నాయి. భారీ మొత్తంలో డబ్బులు వెచ్చించైనా ఉద్యోగాలను కాపాడుకునేందుకు తాజాగా ఈ నకిలీ ఉద్యోగులు కొంత నిధిని సమకూర్చారని సమాచారం. వీరిని కాపాడటం ద్వారా తనపై పడే వేటును కూడా తప్పించుకునేందుకు ఇంటర్‌ బోర్డులోని ఓ అధికారి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

సీఎం దృష్టి సారించాలి

అక్రమంగా క్రమబద్ధీకరణ పొందిన లెక్చరర్ల వ్యవహారంపై చర్యలు సూచించాలని కోరుతూ సుప్రీంకోర్టులోనూ నిరుద్యోగ జేఏసీ నాయకులు పిటిషన్‌ వేయగా, సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కౌంటర్‌ వేయాల్సిందిగా సూచించిందని ఆ నాయకులు చెప్పారు. సుప్రీంకోర్టుకు తప్పుడు సర్టిఫికెట్ల వ్యవహారాలన్నింటినీ ఆధారాలతో సమర్పిస్తామని వారు చెబుతున్నారు. నకిలీ సర్టిఫికెట్లతో రెగ్యులరైజ్‌ అయిన లెక్చరర్లను తాజా విచారణ కమిటీ నివేదిక ఆధారంగా తొలగించాలని, వారికి సహకరిస్తున్న ఇంటర్‌ బోర్డులోని కీలక అఽధికారిని సస్పెండ్‌ చేయాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ నాయకులు, ప్రభుత్వ కాలేజీల ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల అసోసియేషన్‌ నాయకులు, తెలంగాణ విద్యారంగ పరిరక్షణ సమితి నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతామని ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

Updated Date - Oct 10 , 2025 | 03:53 AM