Students Fall Sick After Eating Contaminated Food: కలుషితాహారంతో 66 మంది విద్యార్థులకు అస్వస్థత
ABN , Publish Date - Dec 13 , 2025 | 05:27 AM
మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలలో, బాగ్‌లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు...
మాదాపూర్ ప్రభుత్వ పాఠశాల, బాగ్‌లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో ఘటనలు
గచ్చిబౌలి/రాంనగర్, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలలో, బాగ్‌లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మాదాపూర్‌లోని చంద్రానాయక్ తండా పాఠశాలలో శుక్రవారం ఉదయం టిఫిన్‌గా బోండా, మధ్యాహ్నం భోజనంలో సేమియా పాయసం, బంగాళదుంప కూర పెట్టారు. భోజనం చేసిన తర్వాత 44 మంది విద్యార్థులకు గంటలోపే వాంతులు, విరేచనాలు అయ్యాయి. పాఠశాల సిబ్బంది వెంటనే వారిని కొండాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆరుగురిని నానక్‌రాంగూడలోని రెయిన్‌బో ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో రాత్రికి 44 మందినీ డిశ్చార్జి చేశారు. డీఈవో సుశేషేందర్‌రావు ఆస్పత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. భోజనం నమూనాలను ల్యాబ్‌కు పంపినట్లు ఆయన తెలిపారు.
బాగ్‌లింగంపల్లిలో 22 మందికి..
బాగ్‌లింగంపల్లిలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని 22 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉదయం ఉప్మా తిన్న విద్యార్థినులకు వాంతులు, విరేచనాలయ్యాయి. వెంటనే వారిలో 16 మందిని కింగ్‌కోఠి ఆస్పత్రికి, ఆరుగురిని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. వారంతా కోలుకుంటున్నారని ప్రిన్సిపల్ వాణిశ్రీ తెలిపారు. పాఠశాలలో 350 మంది విద్యార్థినులు ఉన్నారు. సుల్తాన్‌బజార్ పీహెచ్‌సీ బృందం వచ్చి మిగతా విద్యార్థులను పరీక్షించారు. వారి ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. అస్వస్థతకు గురైన విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పాఠశాలను సందర్శించి ఆహార నమూనాలను సేకరించి, ల్యాబ్‌కు పంపించారు.