Share News

Telangana Government: గురుకులాల్లో అత్యవసర ఖర్చులకు రూ.60 కోట్లు!

ABN , Publish Date - Oct 11 , 2025 | 02:56 AM

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కల్పన కోసం అత్యవసర ఖర్చుల కింద ప్రభుత్వం కొంత నిధిని అందించింది..

Telangana Government: గురుకులాల్లో అత్యవసర ఖర్చులకు రూ.60 కోట్లు!

  • సీఎం సహాయనిధి నుంచి కేటాయింపు

  • బడ్జెట్‌ కేటాయింపులకు ఇవి అదనం

  • భవనాలు, టాయిలెట్ల మరమ్మతులు, ఇతర చిన్న సమస్యల పరిష్కారానికి వినియోగం

హైదరాబాద్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కల్పన కోసం అత్యవసర ఖర్చుల కింద ప్రభుత్వం కొంత నిధిని అందించింది. ఎస్సీ, బీసీ గురుకులాలకు రూ.20 కోట్ల చొప్పున, ఎస్టీ, మైనార్టీ గురుకులాలకు రూ.10 కోట్ల చొప్పున.. మొత్తం రూ.60 కోట్లను ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) నుంచి కేటాయించింది. 2025-26 బడ్జెట్‌లో చేసిన కేటాయింపులకు ఈ నిధులు అదనం కావడం గమనార్హం. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కలిపి 851 గురుకుల పాఠశాలలు, కాలేజీలు ఉండగా వాటిలో 4,89,916 మంది, 86 డిగ్రీ కా లేజీల్లో 68,500 మంది చదువుతున్నారు. పలుచోట్ల గురుకుల భవనాల్లో చిన్న చిన్న సమస్యలు తలెత్తుతుండటం, టాయిలెట్ల మరమ్మతులు చేయాల్సి వస్తుండటం ఇబ్బంది గా మారింది. ఈ అంశం సీఎం దృష్టికి వెళ్లడంతో ఇలాంటి చిన్న చిన్న సమస్యల వల్ల పిల్లలు ఇబ్బందులు పడకుండా ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధికారులకు సూచించినట్టు తెలిసింది. ఈ క్రమంలో అధికారులు ఎంతమేర నిధులు అవసరమనే దానిపై పరిశీలన జరిపారు. ఆ మేరకు రూ.60 కోట్లను సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి మంజూరు చేయడంతోపాటు చెక్కులనూ అందించారు.

బిల్లుల మంజూరుకు వేచి చూడాల్సిన పనిలేదు

రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో ఏటా విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయానికి మరమ్మతులు చేస్తుంటారు. అయినా మధ్యలో చిన్నచిన్న సమస్యలు తలెత్తుతుంటా యి. వాటిని సరిచేయించాలంటే.. ఆ పనుల వివరాలన్నింటినీ పేర్కొంటూ గురుకులాల కార్యదర్శులు ప్రభుత్వానికి లేఖలు రాయాలి. ఆమోదం వచ్చాక, చేసిన పనులకు బిల్లుల కోసం ఆర్థిక శాఖవైపు చూడాల్సి వస్తోంది. దీనితో జాప్యం జరుగుతోంది. మరమ్మతుల పనులు చేయాలంటే గుత్తేదారులు ముందుకు రావడంలేదు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం గురుకులాల కార్యదర్శుల స్థా యిలోనే నిధులు మంజూరు అయ్యేలా ఏర్పాట్లు చేసింది.

Updated Date - Oct 11 , 2025 | 02:56 AM