Share News

Tragic Accident: ప్రాణం తీసిన పెన్సిల్‌

ABN , Publish Date - Dec 25 , 2025 | 05:08 AM

విద్యార్థులు నిత్యం ఉపయోగించే పెన్సిల్‌ ఓ ఆరేళ్ల బాలుడి ఉసురు తీసింది. పాఠశాల మైదానంలో పరుగెడుతూ బాలుడు కిందపడ్డ క్రమంలో చేతిలోని పెన్సిల్‌ గొంతుకి గుచ్చుకొని....

Tragic Accident: ప్రాణం తీసిన పెన్సిల్‌

  • చేతిలోని పెన్సిల్‌ గొంతుకు గుచ్చుకొని ఆరేళ్ల బాలుడి మృతి

  • పాఠశాల మైదానంలో పరుగెడుతూ పడిపోయిన యూకేజీ విద్యార్థి

  • ఈ క్రమంలో పెన్సిల్‌ దిగి తీవ్ర రక్తస్రావం, మృతి

కూసుమంచి, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు నిత్యం ఉపయోగించే పెన్సిల్‌ ఓ ఆరేళ్ల బాలుడి ఉసురు తీసింది. పాఠశాల మైదానంలో పరుగెడుతూ బాలుడు కిందపడ్డ క్రమంలో చేతిలోని పెన్సిల్‌ గొంతుకి గుచ్చుకొని తీవ్ర గాయమవ్వగా.. ఆ పసిప్రాణం లోకాన్ని వీడింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో బుధవారం జరిగిన ఈ ఘటనలో విహార్‌(6) అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాలిలా ఉన్నాయి. నాయకన్‌గూడెం గ్రామానికి చెందిన మేడారపు ఉపేంద్రాచారి, మౌనిక దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడైన విహార్‌(6) గ్రామంలోని ప్రైవేట్‌ స్కూల్‌లో యూకేజీ చదువుతున్నాడు. ఎప్పట్లాగే బుధవారం కూడా పాఠశాలకు వచ్చిన విహార్‌ తోటి విద్యార్థులతో కలిసి పాఠాలు విన్నాడు. మధ్యాహ్నం విరామ సమయంలో మూత్రశాలకు వెళ్లిన విహార్‌.. తిరిగి తరగతి గదికి పరుగెత్తుకుంటూ వస్తుండగా అదుపు తప్పి మైదానంలో పడిపోయాడు. అతడి చేతిలో ఉన్న పెన్సిల్‌ గొంతుకి బలంగా గుచ్చుకొని తీవ్ర రక్తస్రావమైంది. పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు.. విహార్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుమారుడి మరణ వార్త తెలిసి నేలకొండపల్లి ఆస్పత్రికి చేరుకున్న విహార్‌ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

Updated Date - Dec 25 , 2025 | 05:08 AM