Share News

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్‌ బరిలో 58 మంది

ABN , Publish Date - Oct 25 , 2025 | 05:27 AM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. మొత్తం 81 మంది నామినేషన్లు చెల్లుబాటు కాగా.. వారిలో 23 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు..

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్‌ బరిలో 58 మంది

  • నామినేషన్లు ఉపసంహరించుకున్న 23 మంది.. 4 బ్యాలెట్‌ యూనిట్లు వినియోగించే అవకాశం

  • నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 4,01,365.. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 16,100 పెరుగుదల

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. మొత్తం 81 మంది నామినేషన్లు చెల్లుబాటు కాగా.. వారిలో 23 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. బరిలో ఉన్న వారు, నోటాతో కలిపితే మొత్తం సంఖ్య 59కి చేరనున క్రమంలో నాలుగు బ్యాలెట్‌ యూనిట్లు వినియోగించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్‌ తెలిపారు. ఒక్కో బ్యాలెట్‌ యూనిట్‌పై 16 మంది అభ్యర్థుల పేర్లు ఉంటాయని పేర్కొన్నారు. ఒకే కంట్రోల్‌ యూనిట్‌తో నాలుగు బ్యాలెట్‌ యూనిట్లు పని చేసే వెసులుబాటు ఉందని, ఓటింగ్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదని వెల్లడించారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో నాలుగు బ్యాలెట్‌ యూనిట్లు, ఒక్కో కంట్రోల్‌ యూనిట్‌, వీవీ ప్యాట్‌ యంత్రం వినియోగించనున్నారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడం.. నాలుగు బ్యాలెట్‌ యూనిట్లు వినియోగించాల్సిన దృష్ట్యా.. ఓటింగ్‌ కంపార్ట్‌మెంట్‌ కొంత ఎక్కువ పరిమాణంలో ఉండనుంది. ఉప ఎన్నికలో భాగంగా 211 మంది 321 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 130 మంది నామినేషన్లు తిరస్కరణకు గురి కాగా.. 81 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. వీరిలో 23మంది పోటీ నుంచి తప్పుకొన్నారు. కాగా, స్వతంత్రులు, ఎన్నికల సంఘం గుర్తింపు లేని పార్టీల అభ్యర్థులకు గుర్తులు కేటయించినట్టు రిటర్నింగ్‌ అధికారి సాయిరాం పేర్కొన్నారు. కాగా, జీహెచ్‌ఎంసీ తాజాగా ప్రకటించిన అనుబంధ జాబితా ప్రకారం జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో 3,85,265 మంది ఓటర్లు ఉంటే..తాజాగా ఆ సంఖ్య 16,100 మేర పెరిగింది.

ఫార్మాసిటీ రైతుల నామినేషన్ల తిరస్కరణ

యాచారం: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో భాగంగా ఫార్మాసిటీ బాధిత రైతులు వేసిన పది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇలా ఎందుకు జరిగిందో ఎన్నికల అధికారులతో మాట్లాడుతామని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ నాయకుడు సందీ్‌పకుమార్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Oct 25 , 2025 | 05:27 AM