Share News

పిడుగుపాటుకు 56 మూగజీవాలు మృత్యువాత

ABN , Publish Date - May 22 , 2025 | 12:29 AM

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బుధవారం కురిసిన అకాల వర్షాలకు పిడుగులు పడి 56 మూగజీవాలు మృత్యువాతపడ్డాయి.

పిడుగుపాటుకు 56 మూగజీవాలు మృత్యువాత

భానుపురి, నార్కట్‌పల్లి, కట్టంగూర్‌, హుజూర్‌నగర్‌, నల్లగొండ రూరల్‌, కోదాడ రూరల్‌, మేళ్లచెర్వు, పెద్దఅడిశర్లపల్లి, మే 21(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బుధవారం కురిసిన అకాల వర్షాలకు పిడుగులు పడి 56 మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. అదేవిధంగా నల్లగొండ జిల్లా నల్లగొండ మండలంలోని అప్పాజిపేట గ్రామ పరిధిలోని బంటుగూడెంలో పిడుగుపడి మహిళా రైతు మృతిచెందింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామానికి చెందిన బడుగుల లక్ష్మయ్య తను గొర్రెలను మేత కోసం మంగళితండా రోడ్డు వద్దకు తీసుకెళ్లాడు. అకస్మాత్తుగా పెద్ద శబ్ధంతో వంద మీటర్ల దూరంలో పిడుగుపడింది. దీంతో ఆ శబ్ధానికి తోడు పిడుగు వేడికి పచ్చిగడ్డి మేస్తున్న 32 జీవాలు అక్కడికక్కడే మృతిచెందాయి. అప్పుడే జీవాల దగ్గరి నుంచి పక్కకు లక్ష్మయ్య వెళ్ళడంతో అతనికి ప్రమాదం తప్పింది. అదేవిధంగా కాపుగల్లులోని దోరకుంట రోడ్డులో మరో పిడుగుపడడంతో అక్కడ గొర్రెలకాపరి మల్లేశానికి చెందిన నాలుగు మేకలు మృతిచెందా యి. కూచిపూడి గ్రామంలో శెట్టి గోవిందస్వామి ఇంటిపై పిడుగుపడడంతో ఇంట్లోని టీవీ, ఫ్రిడ్జ్‌, ఫర్నీచర్‌, ఇల్లు కూడా దగ్ధమైంది. ఆ సమయంలో గోవిందస్వామి అతని భార్య, కుమారుడు ఇంటి బయట ఉండ డం వల్ల ప్రాణాలతో బయటపడ్డారని కుటుంబ సభ్యులు తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 8వ వార్డులోని నల్లచెరువుతండాలో పిడుగుపాటుకు పది మేకలు మృత్యువాత పడ్డాయి. నల్లచెరువుతండాకు చెందిన మేడిదల మల్లయ్య తన మేకలను మేపేందుకు నల్లచెరువుతండాకు తొలు కెళ్లాడు. మబ్బులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి మేకలు ఓ చెట్టు కిందికి చేరాయి. అదే సమయంలో చెట్టుపై పిడుగుపడడంతో చెట్ల కింద ఉన్న 10 మేకలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. వీటి విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని మల్లయ్య కన్నీమున్నీరయ్యాడు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చిన్నతుమ్మలగూడెంలో వ్యవసాయబావుల వద్ద గాలివానతో కురిసిన వర్షానికి విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. గ్రామానికి చెందిన బాత్క నర్సింహ పెంచుతున్న గేదె మేత మేస్తూ తెగిపడిన విద్యుత్‌ తీగలను తగిలి విద్యుదాఘాతంతో మృతిచెందింది. గేదె విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని బాధితుడు తెలిపాడు. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలంలోని కురుమర్తి గ్రామానికి చెందిన రైతు కొమ్మిడి దామోదర్‌రెడ్డి తన రెండు పాడి గేదెలను తన వ్యవసాయ బావి వద్ద కట్టేశారు. అకాల వర్షంతో పాటు సమీపంలో పిడుగు పడటంతో రెండు గేదెలు మృతి చెందాయి. గేదెల విలువ సుమారు రూ.2లక్షలు ఉంటుందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పట్టణం గోవిందాపురంలోని అంగన్‌వాడీ కార్యకర్త చిలకబత్తిని శాంత ఇంటిపై పిడుగుపడింది. దీంతో టీవీ, విద్యుత్‌, ఎలక్ర్టానిక్‌ పరికరాలతో పాటు ఇన్వర్టర్లు కాలిపోయాయి. ఇంటి గోడలు బీటలు వారాయి. సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని శాంత తెలిపింది. మేళ్లచెర్వు మండల పరిధిలోని రేవూరులో విద్యుత్‌ స్తంభాలు కూలి రెండు గేదెలు మృతిచెందాయి. నల్లగొండ జిల్లా నల్లగొండ మండలంలోని దోమలపల్లి గ్రామానికి చెందిన అనంతుల స్వామి వ్యవసాయ భూమి వద్ద కట్టేసిన రెండు గేదెలు, ఒక దూడను కట్టేశాడు. ఉరుములు మెరుపులతో కుడిన వర్షానికి పిడుగులు పడి మూడు జీవాలు మృత్యువాత పడ్డాయి. వీటి విలువ సుమారు రూ.2.25లక్షల ఉంటుందని బాధిత రైతు తెలిపాడు. నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలంలోని పెద్దగట్టు గ్రామానికి చెందిన రైతు మేరావత్‌ శంకర్‌ ఆవులు పొలంలో మేతకు వెళ్లాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి పిడుగు పడడంతో రెండు ఆవులు అక్కడికక్కడే మృతిచెందాయి. వీటి విలువ సుమారు రూ.80 వేలు ఉంటుందని బాఽధితుడు వాపోయాడు.

పిడుగుపాటుతో మహిళా రైతు మృతి

నల్లగొండ టౌన్‌: పిడుగుపాటుతో మహిళా రైతు మృతి చెందింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నల్లగొండ మండలంలోని అప్పాజిపేట గ్రామ పరిధిలోని బంటుగూడెంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన జాల బిక్షవమ్మ (46) వ్యవసాయ బావి వద్ద తోటలో పనిచేస్తుండగా ఆకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంలో ఆమెపై పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతిచెందింది. భిక్షవమ్మకు భర్త, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

Updated Date - May 22 , 2025 | 12:29 AM