Vijay Diwas: పరేడ్‌గ్రౌండ్‌లో విజయ్ దివస్ వేడుకలు
ABN , Publish Date - Dec 17 , 2025 | 06:00 AM
సికింద్రాబాద్‌లోని కేవీ కృష్ణారావు పరేడ్ గ్రౌండ్‌లో 54వ విజయ్ దివస్ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.......
పాల్గొన్న గవర్నర్, డిప్యూటీ సీఎం, మేజర్ జనరల్ అజయ్‌మిశ్రా
హైదరాబాద్/అల్వాల్/కార్వాన్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌లోని కేవీ కృష్ణారావు పరేడ్ గ్రౌండ్‌లో 54వ విజయ్ దివస్ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మేజర్ జనరల్ అజయ్ మిశ్రా వంటి ప్రముఖులు పాల్గొని, 1971 ఇండో-పాక్ యుద్ధంలో అమరులైన సైనికులకు స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించారు. 1971లో పాకిస్థాన్‌పై భారత్ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబర్ 16న విజయ్ దివస్ జరుపుకొంటారు. కేవలం 13 రోజుల పాటు జరిగిన ఈ యుద్ధం ఫలితంగానే.. తూర్పు పాకిస్థాన్ విముక్తి పొంది ప్రస్తుత బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. ఆ రోజున పాకిస్థాన్‌కు చెందిన 93వేల మందికి పైగా సైనికులు భారత దళాల ముందు లొంగిపోయారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం సైనికులు చేసిన పోరాటాలు మరువలేనివన్నారు. యుద్ధంలో భారత సైనికులు చూపిన ధైర్యసాహసాలు వెలకట్టలేనివని, వారి త్యాగాలను స్మరించుకోవడం ప్రతిపౌరుడి భాధ్యత అని భట్టి అన్నారు.
భారత సాయుధ దళాల చరిత్రాత్మక విజయం: జూపల్లి
భారత సాయుధ దళాలు 13 రోజుల్లోనే చరిత్రాత్మక విజయం సాధించాయని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం గోల్కొండ కోటలో నిర్వహించిన విజయ్ దివస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అంతర్జాతీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ జాతీయ ప్రయోజనాల కోసం అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు.