Gold Suspected in Maoist Dumps: మావోయిస్టు డంపుల్లో 400 కిలోల పసిడి!?
ABN , Publish Date - Oct 31 , 2025 | 02:47 AM
ఆపరేషన్ కగార్ తర్వాత మావోయిస్టు అగ్రనేతల నుంచి సాధారణ దళ సభ్యుల వరకు లొంగుబాట పట్టారు. మావోయిస్టులు భారీ సంఖ్యలో లొంగిపోతున్న క్రమంలో వారు...
భారీగా పసిడి నిల్వలు ఉండొచ్చని అనుమానాలు
కొవిడ్ సమయంలో పుత్తడి రూపంలోకి నగదు మార్పు
బంగారం నిల్వలను గుర్తించడంపై నిఘా వర్గాల దృష్టి
డొల్ల కంపెనీలు, బ్యాంకు ఖాతాల్లో భారీగా నిధులు
రూ.400 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా
హైదరాబాద్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ కగార్ తర్వాత మావోయిస్టు అగ్రనేతల నుంచి సాధారణ దళ సభ్యుల వరకు లొంగుబాట పట్టారు. మావోయిస్టులు భారీ సంఖ్యలో లొంగిపోతున్న క్రమంలో వారు సేకరించిన రూ.కోట్ల నగదు ఎక్కడ, ఎవరి అధీనంలో ఉంది? డంపుల సంగతేంటి? అనే అంశాలపై నిఘా వర్గాలు దృష్టి సారించగా.. విస్తుపోయే విషయాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. మావోయిస్టులు సేకరించిన రూ.వందల కోట్ల నగదును కొవిడ్ సమయంలో బంగారం రూపంలోకి మార్చివేసినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఝార్ఖండ్, ఛత్తీ్‌సగఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిసా, ఏపీలోని కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తల నుంచి మావోయిస్టులు పార్టీ ఫండ్ వసూలు చేసి.. దాన్ని కేంద్ర కమిటీకి పంపిస్తుంటారు. పార్టీకి నిధుల సేకరణకుగాను విస్తృత నెట్‌వర్క్ ఉందన్న విషయం జాతీయ విచారణ సంస్థ (ఎన్‌ఐఏ) దర్యాప్తులో వెల్లడైంది. మావోయిస్టులకు నిధులు అందకుండా పూర్తిస్థాయిలో అడ్డుకున్నా.. ప్రస్తుతం ఉన్న నిధులతోనే మరో ఐదారేళ్లు పార్టీని నడపొచ్చని, అయితే అప్పటిదాకా ప్రాణాలతో ఉండే పరిస్థితులు కనిపించకపోవడంతోనే మావోయిస్టులు లొంగుబాట పట్టారని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. మావోయిస్టులు తమకు అందిన డబ్బును రెండు విధాలుగా మారుస్తున్నట్లు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. పార్టీ సానుభూతిపరులు, వారి బంధువులు, కుటుంబసభ్యుల పేరిట బ్యాంకు ఖాతాలు, కంపెనీలు ప్రారంభించి అందులోకి కోట్లాది రూపాయలను మళ్లిస్తున్నారని, డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి రూ.కోట్లు జమ చేస్తున్నారని.. మిగతా డబ్బును బంగారం రూపంలోకి మార్చేశారని భావిస్తున్నారు.
ఆ బంగారం ఎక్కడుంది?
మావోయిస్టు పార్టీ వద్ద దాదాపు రూ.400 కోట్ల నిధులు ఉంటాయని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. 400 కిలోల బంగారం నిల్వలు కూడా ఉండొచ్చని అనుమానిస్తున్నాయి. ఆ పుత్తడి అంతా అడవుల్లోని డంపుల్లో ఉందా? లేక బయటే సురక్షిత స్థావరాల్లో దాచారా? అనే అంశంపై కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు దృష్టి సారించాయి. ఝార్ఖండ్‌కు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎల్‌ఎ్‌ఫఐ) నాయకుడు దినేశ్ గోపేను ఆగస్టులో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దినేశ్ తన భార్య, ఆమె బంధువుల పేరిట డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి కాంట్రాక్టర్ల నుంచి సేకరించిన దాదాపు రూ.20 కోట్లను బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించాడని అధికారులు గుర్తించారు. ఇక బీజాపూర్ పోలీసులు మూల్‌వాసీ బచావో మంచ్ (ఎంబీఎం)కు చెందిన ఇద్దరు సభ్యులు బ్యాంకులో రూ.6 లక్షలు డిపాజిట్ చేస్తుండగా అరెస్టు చేశారు. మజ్దూర్ సంఘటన సమితి (ఎంఎ్‌సఎస్) సభ్యులు కొందరు నిధులు సేకరించి, బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గతంలో మావోయిస్టు స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడైన ప్రద్యుమ్నశర్మ బంధువు ఒకరు చెన్నైలోని వైద్య కళాశాలలో చేరగా, ఆమె ఫీజుకు కావాల్సిన రూ.1,13,70,500ను బ్యాంకు ఖాతాల ద్వారా ఇచ్చినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. ఇంత మొత్తంలో డబ్బును సులభంగా పంపగలుగుతున్నారంటే వారి బినామీ ఖాతాల్లో ఎంత నగదు ఉందనే వివరాలు తేలాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. మావోయిస్టు పార్టీ నుంచి ఆయుధాలతో వెళ్లి లొంగిపోతున్న వారు, ఆయుధాలు వదిలి లొంగిపోతున్న వారు తమ వద్ద ఉన్న డబ్బు లెక్కలను పార్టీకి చెప్పిన తర్వాతే బయటకు వస్తున్నారని తెలుస్తోంది. లొంగిపోతున్న మావోయిస్టులను కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాల అధికారులు ప్రశ్నించడంతో పాటు డబ్బు లెక్కలు ఆరా తీస్తున్నట్లు సమాచారం.