400 Ballot Papers Found in Drain: మురుగు కాల్వలో 400 బ్యాలెట్ పేపర్లు!
ABN , Publish Date - Dec 13 , 2025 | 05:29 AM
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేసిన 400 బ్యాలెట్ పేపర్లు మురుగు కాల్వలో ప్రత్యక్షమయ్యాయి! బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసిన ఈ బ్యాలెట్...
కత్తెర గుర్తుకు ఓటేసినట్లు గుర్తింపు
అది బీఆర్‌ఎస్ మద్దతుదారుడైన సర్పంచ్ అభ్యర్థి గుర్తు
నల్లగొండ జిల్లా చినకాపర్తిలో ఘటన
చిట్యాల రూరల్, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేసిన 400 బ్యాలెట్ పేపర్లు మురుగు కాల్వలో ప్రత్యక్షమయ్యాయి! బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసిన ఈ బ్యాలెట్ పేపర్లలో కొన్ని కాలిన స్థితిలో ఉన్నాయి! నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చినకాపర్తి గ్రామంలో శుక్రవారం వెలుగు చూసిన ఈ ఘటన కలకలం సృష్టించింది. చినకాపర్తి పంచాయతీ జనరల్‌కు రిజర్వు కాగా, 12 వార్డుల్లో 2,469 ఓట్లు ఉన్నాయి. ఈ నెల 11న 2,254 మంది తమ ఓటుహక్కు వినియోగించుకోగా, కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు ఆవుల సుందర్ సర్పంచ్‌గా గెలుపొందారు. పోలింగ్ నిర్వహించిన ప్రభుత్వ పాఠశాల పక్కనే ఉన్న మురుగు కాల్వలో శుక్రవారం స్థానికులు బ్యాలెట్ పేపర్లను గుర్తించారు. సీపీఐ, బీజేపీలు బలపరిచిన బీఆర్‌ఎస్ సర్పంచ్ అభ్యర్థి బిక్షం కత్తెర గుర్తుపై స్వస్తిక్ ముద్రతో ఓటు వేసిన కొన్ని బ్యాలెట్ పేపర్లు, సగం కాలిన స్థితిలో ఉన్న మరికొన్నింటిని గమనించారు. మొత్తం 400 బ్యాలెట్ పేపర్లు ఉండడంతో స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డిలకు తెలియజేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని కత్తెర గుర్తుపై స్వస్తిక్ ముద్రతో ఓటేసిన బ్యాలెట్ పేపర్లను, పక్కనే పడేసి ఉన్న బ్యాలెట్ పేపర్లతో విద్యార్థులు ఆడుకోవడం, చింపివేయడం మరికొన్నింటిని డ్రైనేజీలో కట్టలుగా పడేయడాన్ని గుర్తించారు. విషయం తెలుసుకున్న నల్లగొండ ఆర్డీవో యానాల అశోక్‌రెడ్డి అక్కడికి చేరుకుని బ్యాలెట్ పేపర్లు బహిరంగ ప్రదేశంలో లభించడాన్ని పరిశీలించి.. జిల్లా కలెక్టర్‌కు, ఎన్నికల అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఎన్నికను రద్దు చేయాలి
చినకాపర్తి సర్పంచ్ ఎన్నికను రద్దు చేయాలని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం రాత్రి వారు సంఘటనా స్థలానికి చేరుకుని బ్యాలెట్ పేపర్లను పరిశీలించారు. చిన్నకాపర్తి సర్పంచ్ ఎన్నికను రద్దు చేసి తిరిగి ఎన్నిక నిర్వహించాలని, లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కాగా, బ్యాలెట్ పత్రాలు బయటికొచ్చిన సంఘటనలో స్టేజ్-2 ఆర్వోను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠీ తెలిపారు. ఘటనపై విచారణ జరిపేందుకు నల్లగొండ ఆర్డీవోను నియమించినట్లు తెలిపారు. పోలైన బ్యాలెట్ పేపర్లను బయటకు తీసుకొచ్చిన గుర్తుతెలియని వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. మిగిలిపోయిన బ్యాలెట్ పత్రాలన్నింటినీ ఆర్డీవో సమక్షంలో భద్రపరచాలని, దాన్ని వీడియో తీయాలని ఆదేశించారు.