Ameenpur Spark Controversy: సర్కారీ భూమిలో 40 లగ్జరీ విల్లాలు
ABN , Publish Date - Nov 14 , 2025 | 04:13 AM
హెచ్‌ఎండీఏ లే-అవుట్.. అన్ని అనుమతులూ ఉన్నాయి’’ అనే భరోసాతో రూ.కోట్లు వెచ్చించి ఖరీదైన విల్లాలను కొనుగోలు చేసిన 40 మంది..
దాదాపు రూ.వంద కోట్ల విలువైన ఇళ్ల భవిష్యత్తుపై నీలినీలిడలు.. అమీన్‌పూర్ కిష్టారెడ్డిపేట రెయిన్‌బో మీడోస్ కాలనీవాసుల వ్యథ
తమకిక ఆత్మహత్యలే శరణ్యం అంటున్న బాధితులు
లే-అవుట్ చేసిన బిల్డర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఎమ్మెల్యే
అమీన్‌పూర్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ‘‘హెచ్‌ఎండీఏ లే-అవుట్.. అన్ని అనుమతులూ ఉన్నాయి’’ అనే భరోసాతో రూ.కోట్లు వెచ్చించి ఖరీదైన విల్లాలను కొనుగోలు చేసిన 40 మంది.. అవి సర్కారీ భూమిలో కట్టినవని పదేళ్ల తర్వాత తేలడంతో తాము నట్టేట మునిగిపోయామని ఇప్పుడు వాపోతున్నారు! సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉన్న రెయిన్‌బో మీడోస్ కాలనీలో విల్లాలు కొన్న కొందరి దుస్థితి ఇది. ఈ కాలనీ మధ్యలో 198, 204, 208, 210 సర్వే నంబర్లలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి 40 ఇళ్లు కట్టినట్టు ఏడీ సర్వేలో తేలింది. బ్యాంకుల్లో అప్పులు చేసి కొన్ని ఇళ్లు ప్రభుత్వ భూమిలో ఉన్నాయని ఏడీ సర్వేలో తేలడంతో.. ఆ నలభై ఇళ్ల యజమానులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. మిగతా పట్టాభూముల్లో నిర్మించిన ఇండ్లకు వెళ్లేదారి సైతం ప్రభుత్వ భూమిలో వేసిన రోడ్డే ఆధారం. దీంతో మిగతా ఇండ్ల యజమానులు సైతం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. హెచ్‌ఎండీఏ అనుమతితో పాటు నిర్మాణానికి సంబంధించిన అన్ని అనుమతులూ చూసుకునే విల్లాలను కొన్నామని.. వాటిపై కోట్లాది రూపాయల లోన్లు తీసుకున్నామని.. అధికారులు తీరిగ్గా ఇప్పుడొచ్చి అది ప్రభుత్వ భూమి అంటే తాము ఏం చేయాలని బాధితులు ప్రశ్నిస్తున్నారు. హెచ్‌ఎండీఏ అనుమతులు పొందే సమయంలో సదరు స్థలలానికి ఇదే రెవెన్యూ అధికారులు ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికెట్లు ఎలా ఇచ్చారని నిలదీస్తున్నారు. లే-అవుట్ మధ్యలో రెండెకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైతే ఇన్నాళ్లు రెవెన్యూ సిబ్బంది చూస్తూ ఎలా ఊరుకున్నారన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇలా వెలుగులోకి..
రెయిన్‌బో మీడోస్ కాలనీ మధ్యలో కొన్ని పట్టాభూములు చాలాకాలంగా ఖాళీగా ఉన్నాయి. కాలనీవాసులు అవన్నీ ప్రభుత్వ భూములని ఇన్నాళ్లూ భావించారు. అయితే, ఆ భూములకు పట్టాలు కలిగినవారు వాటిని స్వాధీనం చేసుకోవడంతో.. కాలనీవాసులు ప్రభుత్వ స్థలం కబ్జా జరుగుతోందంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్థలా న్ని స్వాధీనం చేసుకున్నవారి వద్ద ఉన్న పట్టాదారు పాస్‌పుస్తకాలు, ఇతర రికార్డులను పరిశీలించిన స్థానిక తహసీల్దారు.. వారు కబ్జాదారులు కాదని, అది వారి భూమేనని నిర్ధారించారు. అంతేకాదు.. అసలు కాలనీలోనే ప్రభుత్వ భూమి కలిసిందనే విషయం సర్వేలో వెలుగులోకి రావడంతో కాలనీవాసులు షాక్‌కు గురయ్యారు. గ్రామ నక్షా, టిప్పన్ మ్యాప్ ప్రకారం సర్వే నం.208, 210లో 1.06 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమితోపాటు చుట్టూ పట్టా నెంబర్లలో భూములను కొనుగోలు చేసిన బిల్డర్లు.. రెయిన్‌బో మీడోస్ కాలనీ పేరుతో హెచ్‌ఎండీఏ అనుమతితో లే-అవుట్ వేసి ఇళ్లను నిర్మించి విక్రయించారు. ప్రస్తుతం పట్టాభూములుగా తేలిన భూమిని అప్పట్లో ప్రభుత్వ భూమిగా భావించి.. ఆ భూమిని కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొంటూ అప్పటి కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి తహసీల్దార్ సైతం వారికి అనుకూలంగా ఫైల్‌ను తయారు చేసి కలెక్టర్ పరిశీలనకు పంపారు. కానీ, ఆ తర్వాత అది ముందుకు కదల్లేదు. కాగా.. అప్పట్లో ఈ వెంచర్ వేసిన బిల్డర్లలో ఒకరైన ఇంటూ రి నాగేశ్వరరావు.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని కందుకూరు ఎమ్మెల్యే (టీడీపీ)గా ఉన్నారు. పటాన్‌చెరు, అమీన్‌పూర్, కిష్టారెడ్డిపేట పరిసరాలలో అనేక వెంచర్లు వేశారాయన.
సమగ్ర దర్యాప్తు..
రెయిన్‌బో మీడోస్ కాలనీలో ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని అమీన్‌పూర్ తహసీల్దార్ వెంకటేశ్ తెలిపారు. ఏడీ సర్వే తరువాత కొన్ని హద్దులను నిర్ణయించారన్నారు. త్వరలోనే సమగ్ర నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు.