Share News

Panchayat Elections: తొలి విడతలో 395 ఏకగ్రీవాలు

ABN , Publish Date - Dec 05 , 2025 | 03:05 AM

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల లెక్క తేలింది. ఎన్నికల అధికారులు ప్రకటించిన వివరాల ప్రకారం.. తొలి విడతలో .....

Panchayat Elections: తొలి విడతలో 395 ఏకగ్రీవాలు

  • సీఎం ఇలాఖాలోవే 26 సర్పంచ్‌ స్థానాలు.. తొలి విడతలోని 4,236 స్థానాల్లో 5 చోట్ల నామినేషన్లు నిల్‌

  • 3,836 స్థానాలకు 11న పోలింగ్‌

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల లెక్క తేలింది. ఎన్నికల అధికారులు ప్రకటించిన వివరాల ప్రకారం.. తొలి విడతలో ఎన్నికల జరగనున్న 4,236 సర్పంచ్‌ స్థానాల్లో 395 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నారాయణపేట జిల్లా కొడంగల్‌ నియోజకవర్గంలోని 26 స్థానాలు ఉన్నాయి. ఈ 26 మందిలో 25 మంది కాంగ్రెస్‌ మద్దతుదారులు కాగా ఒకరు టీడీపీకి చెందిన వారు. కాగా, తొలి విడత ఎన్నికలకు సంబంధించి ఓ ఐదు గ్రామాల్లో ఒక్క నామినేషన్‌ కూడా దాఖలవ్వలేదు. దీంతో మిగిలిన 3,836 సర్పంచ్‌ స్థానాలకు ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం తొలి విడత కోసం 25,654 మంది నామినేషన్లు దాఖలు చేయగా 8,095మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. పలువురి నామినేషన్లు అనర్హతకు గురయ్యాయి. 395 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. చివరిగా 13,127మంది అభ్యర్థులు తొలి విడత ఎన్నికల బరిలో మిగిలారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యే నాటికి ఒక్కో సర్పంచ్‌ స్థానానికి ఆరుగురు పోటీలో ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య నలుగురికి తగ్గింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం, నెల్లివెంకటాపూర్‌, ఉండూరుగూడ గ్రామ పంచాయతీలు, ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి మండలంలోని తేజాపూర్‌., నిర్మల్‌జిల్లా దస్తాబాద్‌ మండలం పెర్కపల్లి పంచాయతీల్లో ఒక్క నామినేషన్‌ కూడా దాఖలవ్వలేదు. రిజర్వేషన్లు సరిగాలేవని, ఇతర కారణాలు చూపుతూ ఒక్క నామినేషన్‌ కూడా వేయకుండా ఆ గ్రామాల ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. తొలి విడత ఎన్నికల్లో 37,440 వార్డు సభ్యుల స్థానాలకుఎన్నికలు జరగాల్సి ఉండగా వాటిల్లోని 9,331స్థానాలు ఏకగీవ్రం అయ్యాయి. మంచిర్యాల, ఆసిఫాబాద్‌, నిర్మల్‌ జిల్లాల పరిధిలోని 5గ్రామాలతోపాటు మరికొన్నిచోట్ల రిజర్వేషన్లు, ఇతర కారణాలతో 149 స్థానాల్లో ఒక్క నామినేషన్‌ కూడా దాఖలవ్వలేదు. మిగిలిన 27,960వార్డు సభ్యుల స్థానాలకు67,893 మంది బరిలో నిలిచారు.


బరిలో ఎమ్మెల్యే సతీమణి

కార్వాన్‌ ఎమ్మెల్యే కౌసర్‌ మొహియుద్దీన్‌ సతీమణి స్థానిక ఎన్నికల బరిలో నిలిచారు. ఎమ్మెల్యే కౌసర్‌ స్వగ్రామమైన మెదక్‌ జిల్లాలోని బస్వాపూర్‌ గ్రామ సర్పంచ్‌ స్థానానికి కౌసర్‌ సతీమణి నజ్మా సుల్తానా గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఇక, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం మంచరామి గ్రామ సర్పంచ్‌ స్థానానికి రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఉప్పు తిరుపతి సతీమణి లక్ష్మీ గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. కాగా, తన భార్యకు ఓటేసి ఎన్నికల్లో గెలిపిస్తే వార్డులోని వారికి ఐదేళ్ల పాటు హెయిర్‌ కట్‌ ఉచితంగా చేస్తానని హామీ ఇచ్చాడో భర్త. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లికి చెందిన శ్రీకాంత్‌ తన భార్య కోసం ఇలా ప్రచారం చేస్తున్నాడు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం గంగాపూర్‌ సర్పంచ్‌ పదవి కోసం అన్నదమ్ముల కుటుంబాలకు చెందిన కోడళ్లు కవిత జ్ఞాన్‌రెడ్డి, ప్రమీల పాండు రంగారెడ్డి పోటీ పడగా.. కాంగ్రెస్‌ మద్దతుదారులంతా సమావేశమై రాజీకి యత్నించారు. ఫలితం లేకపోవడంతో టాస్‌ వేసి అందులో గెలిచిన కవిత జ్ఞాన్‌రెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించుకున్నారు. ప్రమీల టాస్‌కు కట్టుబడి ఉంటారా ? లేదా ? అనేది తేలాల్సి ఉంది.

Updated Date - Dec 05 , 2025 | 03:05 AM