Share News

35 Booked for Lottery: ఏకగ్రీవానికి వేలంపాట.. 35 మందిపై కేసు

ABN , Publish Date - Dec 06 , 2025 | 05:22 AM

పంచాయతీ ఎన్నికల్లో తమ సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు వేలంపాట నిర్వహించిన ఓ గ్రామానికి చెందిన 35 మందిపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.....

35 Booked for Lottery: ఏకగ్రీవానికి వేలంపాట.. 35 మందిపై కేసు

  • సిద్దిపేట అర్బన్‌ మండలం బొగ్గులోనిబండలో ఘటన

  • వేలంలో ఓడిన వ్యక్తి నామినేషన్‌ వేయడంతో విషయం వెలుగులోకి

  • పోలీసుల విచారణ.. కేసు నమోదు

సిద్దిపేట అర్బన్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల్లో తమ సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు వేలంపాట నిర్వహించిన ఓ గ్రామానికి చెందిన 35 మందిపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఇందులో వేలంలో పాల్గొన్న అభ్యర్థులు, వేలం నిర్వహించిన గ్రామ పెద్దలు ఉన్నారు. సిద్దిపేట అర్బన్‌ మండలం బొగ్గులోని బండ (పాండవపురం)లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి సిద్దిపేట త్రీ టౌన్‌ సీఐ విద్యాసాగర్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బొగ్గులోనిబండ సర్పంచ్‌ స్థానానికి పొటీ చేసేందుకు అందే శంకర్‌, బైరి రాజు, అందే ఆంజనేయులు అనే వ్యక్తులు ముందుకొచ్చారు. సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు మూడు రోజుల క్రితం గ్రామపెద్దలు వేలంపాట నిర్వహించగా రూ.16.30లక్షలకు అందే శంకర్‌ గెలిచారని సమాచారం. అయితే, వేలం అనంతరం పోటీ నుంచి తప్పుకున్న మిగిలిన ఇద్దరిలో ఒకరైన బైరి రాజు నామినేషన్‌ వేయడంతో గ్రామ ప్రజలు శుక్రవారం మరోసారి సమావేశమయ్యారు. ఈ విషయం పోలీసులు దృష్టికి రాగా ఎన్నికల విభాగానికి చెందిన ఎఫ్‌ఎ్‌సటీ ఇన్‌చార్జి వంశీకృష్ణతో కలిసి సీఐ గ్రామంలో విచారణ చేపట్టారు. వేలంపాట విషయం నిజమేనని తేలడంతో ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన అభ్యర్థులు, కుల సంఘ పెద్దలు, గ్రామ ఆలయ కమిటీ సభ్యులు కలిపి మొత్తం 35 మందిపై కేసులు నమోదు చేశారు. వేలం పాటకు సంబంధించిన రికార్డులు, 11 వాహనాలను సీజ్‌ చేశారు. కాగా, వేలంపాటలో గెలుపొందిన అందే శంకర్‌ ఇప్పటికే రూ.10లక్షలు కులపెద్దలకు ఇచ్చాడని, బైరి రాజు తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నాడని సమాచారం.

Updated Date - Dec 06 , 2025 | 05:22 AM