POCSO Conviction: పోక్సో కేసులో దోషికి 32 ఏళ్ల జైలు
ABN , Publish Date - Oct 23 , 2025 | 06:24 AM
బాలిక అపహరణ, లైంగిక దాడి, బాల్యవివాహం కేసులో నిందితుడికి మూడు సెక్షన్ల కింద 32 సంవత్సరాల జైలు శిక్ష, రూ.75 వేల జరిమానా విధిస్తూ నల్లగొండ...
బాలిక అపహరణ, లైంగిక దాడి, బాల్య వివాహం కేసులో నల్లగొండ పోక్సో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు తీర్పు
నల్లగొండ క్రైం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): బాలిక అపహరణ, లైంగిక దాడి, బాల్యవివాహం కేసులో నిందితుడికి మూడు సెక్షన్ల కింద 32 సంవత్సరాల జైలు శిక్ష, రూ.75 వేల జరిమానా విధిస్తూ నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు అదనపు జడ్జి, నల్లగొండ పోక్సో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు న్యాయాధికారి రోజారమణి బుధవారం తీర్పు చెప్పారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ శరత్‌చంద్రపవార్ ఓ ప్రకటనలో తెలిపారు. నల్లగొండలోని పానగల్ ప్రాంతానికి చెందిన గురజాల చందు ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. నల్లగొండకు సమీపంలో ఉండే ఓ మైనర్ బాలికను పరిచయం చేసుకుని తరచూ ఫోన్‌లో మాట్లాడేవాడు. 2022 సెప్టెంబరు 19న నల్లగొండ వచ్చిన బాలికకు మాయమాటలు చెప్పి తన ఆటోలో బయటకు తీసుకువెళ్లాడు. బాలిక కనిపించకపోవటంతో కుటుంబసభ్యులు నల్లగొండ టూ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసి.. నిందితుడు సెప్టెంబరు 25న ఆ బాలికను నల్లగొండలో దింపి వెళ్లిపోయాడు. ఆమెను నల్లగొండలోని భరోసా కేంద్రానికి తరలించిన పోలీసులు వాంగ్మూలాన్ని నమోదు చేశారు. తనను ఓ గుడికి తీసుకువెళ్లి వివాహం చేసుకున్నాడని, అతని కుటుంబ సభ్యుల ఇంటికి తీసుకువెళ్లి భార్యాభర్తలమని చెప్పి పలుమార్లు తనపై లైంగిక దాడి చేసినట్లు ఆమె వాంగ్మూలం ఇచ్చింది. నిందితుడిపై సెక్షన్ 366, 376(2), పోక్సో చట్టం సెక్షన్ 5 కింద కేసులు నమోదు చేసి... 2022 నవంబరు 15న కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. విచారణ తర్వాత కోర్టు నిందితుడిని దోషిగా తేల్చింది. మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినందుకు పోక్సో చట్టం సెక్షన్ 5(1) కింద 20 సంవత్సరాల జైలు, రూ.25 వేల జరిమానా, బాలికను ప్రలోభపెట్టి కిడ్నాప్ చేసినందుకు సెక్షన్ 366, 376(2) కింద 10 సంవత్సరాల జైలు, రూ.25 వేల జరిమానా విధించింది. ఈ రెండు శిక్షలూ ఏకకాలంలో అమలవుతాయి. బాల్య వివాహ నిషేధ చట్టం కింద రెండు సంవత్సరాల జైలు, రూ.25వేల జరిమానా విధించింది. మొత్తంగా నిందితుడికి మూడు సెక్షన్ల కింద 32 సంవత్సరాల జైలు, రూ.75 వేల జరిమానా విధించిన కోర్టు బాధితురాలికి డీఎ్‌సఎల్‌ఏ ద్వారా రూ.10 లక్షలు పరిహారంగా అందించాలని తీర్పులో పేర్కొంది.
అత్యాచారం కేసులో జీవిత ఖైదు
సంగారెడ్డి క్రైం: బాలికను అపహరించి.. అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్షతో పాటు 10 వేల జరిమానా విధిస్తూ సంగారెడ్డి పోక్సో కోర్టు న్యాయాధికారి కె.జయంతి తీర్పు చెప్పారు. కోహీర్ మండలం గురజాడ గ్రామానికి చెందిన తలారి లక్ష్మీనారాయణ (20) డ్రైవర్. 2018లో ఓ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. జహీరాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరిపి.. సాక్ష్యాధారాలు కోర్టులో సమర్పించారు. జడ్జి విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో దోషి లక్ష్మీనారాయణకు జీవిత ఖైదు, జరిమానా విధించారు.
విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు.. అరెస్టు
కూసుమంచి: విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడిని పోలీసులు పోక్సో కేసులో అరెస్టు చేశారు. అతనిపై డీఈవో సస్పెన్షన్ వేటు వేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నర్సింహులగూడెం ప్రాఽథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గుడిపుడి వీరయ్య కొంతకాలంగా పలువురు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నెల 16న బాధిత విద్యార్థినులు హెచ్‌ఎం శివకుమార్‌కు చెప్పగా ఆయన జిల్లా విద్యాశాఖ అధికారులు, కూసుమంచి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎంఈవో రామాచారి విచారణ జరిపారు. విద్యార్థులు, తల్లితండ్రులు, సహ ఉపాధ్యాయులను విచారించి, నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. నివేదిక ఆధారంగా వీరయ్యను సస్పెండ్ చేస్తూ ఇన్‌చార్జి డీఈవో శ్రీజ ఉత్తర్వులిచ్చారు. పోలీసులు వీరయ్యను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. అయితే దీనికి కొద్దిరోజుల ముందే వీరయ్య తన పలుకుబడిని ఉపయోగించి డిప్యూటేషన్‌పై ఖమ్మం అర్బన్ మండలానికి బదిలీ చేయించుకోవడం గమనార్హం. అతను 2016లో ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి పాఠశాలలో పనిచేస్తున్న సమయంలో ఇలాంటి వ్యవహార శైలితోనే సస్పెన్షన్‌కు గురైనట్టు చర్చ జరుగుతోంది.