Ration Rice Scam: 300 క్వింటాళ్ల రేషన్ బియ్యం దారి మళ్లింపు
ABN , Publish Date - Dec 06 , 2025 | 05:51 AM
సాధారణంగా పేదలకు అందించాల్సిన రేషన్ బియ్యాన్ని గోదాముల్లో నిల్వ ఉంచుతారు. అక్కడి నుంచి ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు....
బైకుకు జీపీఎస్ అమర్చి ఏమార్చిన అక్రమార్కులు
అక్రమ దందాను గుర్తించిన విజిలెన్స్ అధికారులు
15 మందిపై కేసు నమోదు.. 13 మంది అరెస్టు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన
కొత్తగూడెం కలెక్టరేట్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): సాధారణంగా పేదలకు అందించాల్సిన రేషన్ బియ్యాన్ని గోదాముల్లో నిల్వ ఉంచుతారు. అక్కడి నుంచి ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు.. అటు నుంచి ఆయా ప్రాంతాల్లోని రేషన్ దుకాణాలకు లారీల్లో బియ్యాన్ని సరఫరా చేసి లబ్ధిదారులకు అందిస్తారు. రేషన్ బియ్యం దారిమళ్లకుండా సరఫరా చేసే లారీలకు జీపీఎ్‌సను అమరుస్తారు. దీని ద్వారా లారీ ఎటువైపు వెళ్తుందన్నది తెలుసుకోవచ్చు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం లారీకి బదులు బైక్‌కు జీపీఎ్‌సను అమర్చి.. అధికారులను ఏమార్చి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. విషయం తెలిసిన సివిల్ సప్లయీస్ రాష్ట్ర విజిలెన్స్ అండ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు పాల్వంచలోని ఎంఎల్‌ఎస్ పాయింట్ వద్ద నిఘా పెట్టి.. అక్రమ దందాను బట్టబయలు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ వెల్లడించారు. జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అందిన సమాచారం మేరకు ఈ నెల 2వ తేదీన సాయంత్రం 4.15 గంటల సమయంలో విజిలెన్స్ అధికారులు పాల్వంచలోని ఎంఎల్‌ఎస్ పాయింట్ వద్ద నిఘా పెట్టారు. ఆ సమయంలో ఏపీ20ఏవీ1899 నెంబరుగల ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ యువకుడు స్టాక్ పాయింట్‌లోకి వెళ్లి ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జ్ సత్యవతి, డేటా ఎంట్రీ ఆపరేటర్ బానోతు కృష్ణకుమార్‌కు కొన్ని పత్రాలు అందజేయగా.. వారు కొంత సమాచారం నమోదు చేసి తిరిగి ఆయనకు ఆ పత్రాలు అందించారు. దానిపై అనుమానం వచ్చిన విజిలెన్స్ అధికారులు ఎంఎల్‌ఎస్ పాయింట్ ప్రధాన గేటు వద్ద సదరు యువకుడిని ఆపి విచారించగా.. తనపేరు ప్రశాంత్ అని, తాను స్టేజ్-1 కాంట్రాక్టర్ ఎన్.శ్రీనివా్‌సకు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నట్టు వివరించాడు. ఎంఎల్‌ఎస్ పాయింట్ సిబ్బందితో కలిసి మల్లారం వ్యవసాయ మార్కెట్ గోదాం నుంచి ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు రావాల్సిన సన్నబియ్యాన్ని దారి మళ్లించినట్లు తెలిపాడు.
బియ్యాన్ని సరఫరా చేసే లారీకి ఉండాల్సిన జీపీఎస్ ట్రాకింగ్‌ను ద్విచక్ర వాహనానికి అమర్చి అక్రమ దందాకు పాల్పడినట్లు పేర్కొన్నాడు. లారీనెం. టీఎ్‌స29టీ5139కు సంబంధించిన ట్రక్ చిట్‌నంబరు 4346 ద్వారా 300 క్వింటాళ్ల బియ్యాన్ని నల్లబజారుకు మళ్లించినట్టు వివరించాడు. ఈ వ్యవహారంలో ఎంఎల్‌ఎస్ పాయింట్ సిబ్బంది, రేషన్ డీలర్లు కలిసి తప్పుడు పత్రాలతో ప్రభుత్వానికి భారీగా ఆర్థిక నష్టం కలిగించినట్టు అదనపు కలెక్టర్ తెలిపారు. పంచనామా అనంతరం ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. డీలర్లు రేషన్ బియ్యం అందుకున్నట్టుగా బయోమెట్రిక్ సంతకాలు చేశారు కానీ అసలు బియ్యం మాత్రం పొందలేదని, లారీకి నకిలీ రశీదుల కోసం ఎంఎల్‌ఎస్ సిబ్బంది లంచాలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు. రేషన్ బియ్యం మళ్లింపులో ఓ మాఫియా రింగ్ పనిచేస్తున్నట్టు గుర్తించిన అధికారులు 15 మందిపై కేసు నమోదు చేసి, 13 మందిని అరెస్ట్ చేశారు.
స్టేజ్-1 కాంట్రాక్టర్ అక్రమాలు
స్టేజ్-1 కాంట్రాక్టర్ ఎన్.శ్రీనివా్‌సను అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా.. తన భార్య సరోజ పేరుతో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నానని తెలిపాడు. మణుగూరుకు చెందిన రమ్యా రైస్ ట్రేడర్స్‌కు అక్రమంగా 300 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని తరలించినట్లు పేర్కొన్నాడు. లారీ ట్రిప్పుకు రూ.50 వేల చొప్పున ఐదుసార్లు రైస్ మిల్లర్ యజమాని పంపించినట్లు ఒప్పుకున్నాడు.