Telangana police: పోలీస్ సంస్కరణలకు 30 స్టేషన్ల ఎంపిక
ABN , Publish Date - Sep 16 , 2025 | 05:28 AM
పోలీస్ సంస్కరణల ప్రాజెక్టు అమలుపై రాష్ట్ర పోలీస్, ఇండియన్ పోలీస్ ఫౌండేషన్(ఐపీఎ్‌ఫ)ల మధ్య ఒప్పందం కుదిరింది....
హైదరాబాద్, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): పోలీస్ సంస్కరణల ప్రాజెక్టు అమలుపై రాష్ట్ర పోలీస్, ఇండియన్ పోలీస్ ఫౌండేషన్(ఐపీఎ్‌ఫ)ల మధ్య ఒప్పందం కుదిరింది. ఇందుకు సంబంధించిన అవగాహనా ఒప్పందం(ఎంఓయూ)పై సోమవారం డీజీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సంతకాలు జరిగాయి. తొలుత సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 15 పోలీస్ స్టేషన్లు, సంగారెడ్డి జిల్లా పరిధిలో 15 పోలీస్ స్టేషన్లలో సంస్కరణలను అమలు చేయనున్నారు. పోలీసు స్టేషన్లతో సంబంధం ఉన్న అన్ని వర్గాల వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకొని, పరిష్కార మార్గాలను సూచిస్తారు. ఇతర రాష్ట్రాల్లోని ఉత్తమ పద్ధతుల్ని గుర్తించి నివేదికలు సిద్ధం చేస్తారు. వీటిపై ఎంపికైన ఈ 30 పోలీస్ స్టేషన్ల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లకు విస్తరిస్తారు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ మాట్లాడుతూ... ఇప్పటికే రాష్ట్ర పోలీ్‌సలు చేపట్టిన పోలీస్ స్టేషన్లలో క్యూఆర్ కోడ్ వ్యవస్థ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, మహిళల కోసం టీ-సేఫ్ యాప్ వంటి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు.