Ponguleti Srinivas Reddy: మే నెలాఖరుకు 3 లక్షల గృహ ప్రవేశాలు!
ABN , Publish Date - Dec 06 , 2025 | 06:02 AM
గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి స్థలం లేని పేదలకు కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు....
జీహెచ్‌ఎంసీలో 13-14 ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు.. గ్రామీణ ప్రాంతాల్లో స్థలం లేని పేదలకూ ఇందిరమ్మ ఇళ్లు
విధివిధానాలు ఖరారయ్యాక వెల్లడిస్తాం
ఓఆర్‌ఆర్ చుట్టూ మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో గృహ సముదాయాలు
పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం: పొంగులేటి
హైదరాబాద్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి స్థలం లేని పేదలకు కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. తొలి విడతలో ఇంటి స్థలం ఉన్న పేదలకు ఇళ్లు మంజూరు చేశామని, ఇకపై స్థలం లేని నిరుపేదలను గుర్తించి వారికి ఇంటి స్థలంతోపాటు ఇల్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. విధివిధానాలు ఖరారు చేసిన తర్వాత పూర్తి వివరాలు చెబుతామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం సచివాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గృహనిర్మాణ శాఖ రెండేళ్ల పురోగతిని వివరించారు. గతంలో హౌసింగ్ బోర్డు కాలనీలు నిర్మించినట్లుగా ఔటర్ రింగురోడ్డుకు చుట్టుపక్కల, హైదరాబాద్‌కు నాలుగు దిశల్లో మధ్యతరగతి వర్గాల ప్రజలకు గృహ సముదాయాలు నిర్మిస్తామని పొంగులేటి చెప్పారు. ఒక్కో చోట 8-10 వేల వరకు ఇళ్లు నిర్మిస్తామని, ఎలాంటి లాభనష్టాలు చూసుకోకుండా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే ధరలతో నిర్మించి, ఇస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కూడా అధ్యయనం చేశామని, 2-3 నెలల్లో ఇందుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ప్రకటిస్తుందని చెప్పారు. తొలివిడతలో 3,80,200 ఇళ్లు మంజూరు చేశామని, వీటిలో 3 లక్షలకు పైగా నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని.. వచ్చే మార్చి నాటికి లక్ష ఇళ్లకు పైగా గృహప్రవేశాలు జరుగుతాయని వివరించారు. మే నెలాఖరు వరకు మొత్తం 3 లక్షల గృహ ప్రవేశాలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు కోర్ అర్బన్ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.
గత ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రాజెక్టు విఫలమైన నేపథ్యంలో ముంబై, బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో అధ్యయనం చేశామని.. శాస్త్రీయంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపడతామని వెల్లడించారు. జీ+3 లేదా జీ+4 ఇళ్లు నిర్మించి నగరంలో ఉండే పేదలకు పంపిణీ చేస్తామని పొంగులేటి తెలిపారు. గ్రేటర్‌లో 13-14 ప్రాంతాలను గుర్తించామని, పేదలకు అక్కడ ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. 30-40 గజాల సొంత స్థలం ఉన్న పేదలకు జీ+1 ఇల్లు నిర్మించుకునే వెసులుబాటు కూడా కల్పిస్తామన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో గత ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకంలో రూ.700 కోట్లు వృథా చేసిందని, నగరంలో ఉండేవారికి శివారు ప్రాంతాల్లో కేటాయింపులు చేస్తే ఎవరూ వెళ్లలేదని, కొన్ని కేటాయింపులు చేయలేదని, మరికొంత మందికి ఇచ్చినా తీసుకోలేదని తెలిపారు. ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లను ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే వారికి కేటాయిస్తామని పొంగులేటి స్పష్టంచేశారు. హౌసింగ్ బోర్డు ఆస్తులు కబ్జాలకు గురైతే రక్షిస్తున్నామని, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తిరిగి తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటివరకు 1,000 ఎకరాలకు పైగా ప్రహరీ గోడలు నిర్మించామని, వేలంపాటల్లో రూ.750-800 కోట్లు సేకరించామని వెల్లడించారు. వైఎస్, కేసీఆర్ ప్రభుత్వాల హయాంలో ఫౌండేషన్ వేసిన ఇళ్లు 15 వేల వరకు ఉన్నాయని, వాటిపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పునాది నిర్మించుకొని, లబ్ధిదారుల జాబితాలో చోటు దక్కని వారి నుంచి కూడా దరఖాస్తులు వచ్చాయని, ఇలాంటి వారికి రెండో విడతలో మంజూరు చేస్తామని చెప్పారు.
భూముల మార్పిడిలో కేటీఆర్ సంతకాలు చేశారు
కేంద్రం నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి, గృహ నిర్మాణ శాఖకు ఇంతవరకు నయా పైసా రాలేదని మంత్రి పొంగులేటి విమర్శించారు. గోపన్‌పల్లిలో భూములను 22(ఏ) జాబితాలో పెట్టింది గత ప్రభుత్వమేనని చెప్పారు. జీవో 59లో అన్యాక్రాంతమైన భూములు మాత్రమే నిషేధిత జాబితాలో ఉన్నట్లు తెలిపారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో వేలం వేసిన భూములను వెనక్కి తీసుకుంటామని, పారిశ్రామిక భూములను వెనక్కి తీసుకుంటామని తామెన్నడూ చెప్పలేదని పొంగులేటి అన్నారు. వేల ఎకరాల భూములను విక్రయించడంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా కేటీఆర్ పాత్ర ఉందని ఆరోపించారు. భూముల మార్పిడి ఫైళ్లపై కేటీఆర్ సంతకాలు చేసిన పత్రాలు కూడా ప్రభుత్వం వద్ద ఉన్నాయని చెప్పారు. దిల్‌సుఖ్‌నగర్‌లో సిరీస్ రాజు ఫ్యాక్టరీ కాలుష్యంతో భూగర్భ జలాలు కూడా విషపూరితంగా మారితే.. యాజమాన్యంతో కుమ్మక్కై నివాస జోన్‌కు మార్చడంలో కేటీఆర్ క్రియాశీల పాత్ర పోషించారని ఆరోపించారు. రూ.5 లక్షల కోట్ల అవినీతి అంటూ కేటీఆర్ విషం చిమ్ముతున్నారన్నారు. భూముల మార్పిడికి సంబంధించి మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని, ఇది ఏ ఒక్కరో తీసుకున్న నిర్ణయం కాదని చెప్పారు.