Massive Scam in Outsourcing: స్కామ్ సోర్సింగ్
ABN , Publish Date - Dec 29 , 2025 | 02:13 AM
రాజకీయ నాయకులు, ఐఏఎ్‌సలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కొందరు ‘ఔట్‌సోర్సింగ్’లో ఆదాయ మార్గాలు వెతుక్కున్నారు! ఇప్పటికే నిర్వర్తిస్తున్న పదవులు, ఉద్యోగాలతో వచ్చే రాబడి చాలదనుకున్నారేమో..
బడాబాబులకు ఆదాయ వనరుగా ‘ఔట్‌సోర్సింగ్’!.. రాష్ట్రంలో 900 ఏజెన్సీలు
నేతలు, ఐఏఎ్‌సల బినామీలవే కొన్ని.. 25 వేల మంది బోగస్ ఉద్యోగులు!
గత పదేళ్లుగా ఏజెన్సీల లెక్కల్లో గోల్‌మాల్
లేని ఉద్యోగులకూ జీఎస్టీ చెల్లిస్తున్న సర్కారు!
రెగ్యులర్ ఉద్యోగులు కూడా రెండేసి కొలువుల్లో!
2 జీతాలు తీసుకుంటున్నవారు 600 మందిపైనే!!
జీతాలతో పాటు జీఎస్టీలోనూ ఏజెన్సీల దోపిడీ
ఈపీఎఫ్, ఈఎ్‌సఐ, జీఎస్టీ నిధులు తీసుకుంటూ..ఉద్యోగులకు సకాలంలో చెల్లించని వైనం
ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటుకూ అడ్డుపుల్ల
ఔట్‌సోర్సింగ్ ముసుగులో భారీ కుంభకోణం
హైదరాబాద్, డిసెంబరు 28 (ఆంధ్ర జ్యోతి): రాజకీయ నాయకులు, ఐఏఎ్‌సలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కొందరు ‘ఔట్‌సోర్సింగ్’లో ఆదాయ మార్గాలు వెతుక్కున్నారు! ఇప్పటికే నిర్వర్తిస్తున్న పదవులు, ఉద్యోగాలతో వచ్చే రాబడి చాలదనుకున్నారేమో.. బినామీలతో ఏజెన్సీలు పెట్టించేశారు! తాత్కాలిక ఉద్యోగులను నియమించుకునే ఔట్‌సోర్సింగ్ పద్ధతిని ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు. మరికొందరేమో ఆయా ఏజెన్సీల్లో వాటాలు పెట్టుకున్నారు!! ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల లెక్కలు చూసి, వారికి జీతాలు చెల్లించే స్థాయిలో ఉన్నవారు లేదా ఉద్యోగ నియామకాలు, జీతాల లెక్కలను ప్రభావితం చేయగలిగే హోదాల్లో ఉన్నవారిలోనే కొందరు ఇలా బినామీ ఏజెన్సీలు, వాటాలను ఏర్పాటు చేసేసుకున్నారు. ఇక ఈ ఏజెన్సీల లీలలు అన్నీ ఇన్నీ కావు..! కొన్ని ఏజెన్సీల్లో వాస్తవంగా పనిచేసే ఉద్యోగుల కంటే రికార్డుల్లో ఉండేవారి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది! ప్రభుత్వం నుంచి ఏజెన్సీలు తీసుకునే సొమ్ములకు.. ఆయా ఏజెన్సీలు ఉద్యోగులకు చెల్లించే మొత్తాలకు పొంతనే ఉండదు! గత పదేళ్లుగా జరుగుతున్న ఈ గోల్‌మాల్ లెక్కలను బయటకు తీసి.. అక్రమంగా జీతాలు పొందిన వారి నుంచి సొమ్ము రికవరీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి.. ఉద్యోగులందరినీ దాని పరిధిలోకి తెస్తామనీ వెల్లడించింది. కానీ, ఈ ప్రక్రియకు కూడా ప్రస్తుత ఏజెన్సీల వెనక ఉన్న బడాబాబులు మోకాలడ్డుతున్నట్లు తెలుస్తోంది. గతంలో కొన్ని జిల్లాల్లోని కలెక్టర్లు, జిల్లా ఉపాధి కల్పన అధికారులు కూడా వాటాలు మాట్లాడేసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు కూడా కొందరు వాటిని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల లెక్కలు తేల్చడంపై దృష్టి పెట్టిన అధికారులు.. శాఖల వారీగా ఎంత మంది పని చేస్తున్నారు? వేతనాలు తీసుకుంటున్న వారెంతమంది? రికార్డుల్లో ఉంటూ కార్యాలయాల్లో కనిపించని ఉద్యోగులు ఎంతమంది? అన్న వివరాలను సేకరిస్తున్నారు. వేతనాల ముసుగులో భారీ కుంభకోణం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర పరిపాలనను కుదిపేస్తున్న ఔట్‌సోర్సింగ్ వేతనాల కుంభకోణంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తే అన్ని వ్యవహారాలూ బయటకు వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
లెక్కలు తేల్చే పనిలో ఆర్థిక శాఖ..
ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల నుంచి వచ్చే లెక్కలకు, ప్రభుత్వం చెల్లించే వేతనాలకు మధ్య ఉండే వ్యత్యాసాలను జనవరి 26లోపు తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆర్థిక శాఖ చేపట్టిన విచారణలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులే కొన్ని విభాగాల్లో ఒక్కో వ్యక్తి రెండు వేతనాలు తీసుకుంటున్నట్లు గుర్తించారు. ఈ తరహా ఉద్యోగులు 600 మందికిపైగా ఉన్నట్లు అధికారులు అంచనాకు వచ్చారు. ఇక ఔట్‌సోర్సింగ్‌లో సుమారు 25 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. వీరి పేరుతో జరిగిన వేతనాల చెల్లింపుల నుంచి ఎవరు లబ్ధి పొందారనే లెక్కలు కూడా తీస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం దొరకడమే గగనమైన తరుణంలో ఒకే వ్యక్తి వేర్వేరు ప్రభుత్వ విభాగాల్లో ఐడీలు మార్చి రెండు వేతనాలు తీసుకున్నట్లు ఆర్థిక శాఖ విచారణలో వెలుగు చూసింది. కొన్ని కార్పొరేషన్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా చెల్లింపులు చేసే విభాగాలు, గ్రామీణాభివృద్ధి శాఖ, వైద్య విధాన పరిషత్, విద్యుత్తు వంటి విభాగాల్లో ఈ తరహా మోసాలకు పాల్పడినట్లు తేలింది. చెక్ రూపంలో వేతనాలు ఇచ్చే చోట, ఆధార్ డేటా అనుసంధానం కాని విభాగాల్లో ఉద్యోగి ఐడీని మాత్రమే చూపి వేతనాలు పొందుతున్నట్లు గుర్తించారు. ఇక ఫారిన్ సర్వీస్ పేరుతోనూ అటవీ శాఖ, పురపాలక శాఖ, నీటిపారుదల విభాగాల్లో ఈ తరహా ఉద్యోగులు రెండు వేతనాలు పొందుతున్నారని తేలింది. పూర్తి విచారణ జరిపిన తర్వాత ఇలాంటి ఉద్యోగుల మీద రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. వారి నుంచి సొమ్ములు రాబట్టుకుంటామని ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు.
బోగస్ ఉద్యోగులు 25 వేలకు పైనే..!
ఔట్‌సోర్సింగ్ పేరుతో జరిగిన అక్రమాలకు అంతే లేకుండా పోయింది. రాష్ట్రంలో సుమారు 900 ఏజెన్సీలు ఉండగా.. వాటి పరిధిలో పనిచేస్తున్నట్లు చూపిస్తున్న సంఖ్యకు, వాస్తవ సంఖ్యకు సుమారు 25 వేల వరకు తేడా ఉంది. అంటే వీరంతా బోగస్ ఉద్యోగుల పేరుతో వేతనాలు పొందుతున్నట్లు గుర్తించారు. విచారణ కొనసాగుతుండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నకిలీ లెక్కలతో ప్రభుత్వ నిధులు డ్రా చేసుకున్న వ్యక్తులు, సంస్థలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ తరహా మోసాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు చూపే లెక్కలకు పొంతన కుదరడం లేదు. హాజరు రిజిస్టర్‌లు, మాన్యువల్ ఎంట్రీలు, నకిలీ సంతకాల ద్వారా వేతనాలు పొందినట్లు విచారణలో తేలింది. ఇంత సాంకేతికత అందుబాటులోకి వచ్చినప్పటికీ కొన్ని శాఖలు ఏజెన్సీలతో కుమ్మక్కై మాన్యువల్ రిజిస్టర్ల పేరుతో వేతనాల కుంభకోణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పురపాలక శాఖలో పారిశుద్ధ్య కార్మికులు, డ్రైవర్లు, టెక్నికల్ సిబ్బంది ముసుగులో సుమారు 8000 మంది వరకు నకిలీ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. ఇక వైద్య ఆరోగ్య శాఖలో ఔట్‌సోర్సింగ్ విధానంలో నర్సింగ్, పేషెంట్ అటెండర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు సుమారు 5 వేల మంది వరకు ఉన్నట్లు సమాచారం. విద్యా శాఖలో క్లర్కులు, ఆఫీస్ సబార్డినేట్లు, బోధనేతర సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లు సుమారు 3 వేల మంది; రెవెన్యూ శాఖలో సర్వేయర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్ల ముసుగులో సుమారు 2 వేల మంది, విద్యుత్తు, ఇతర మౌలిక వసతుల విభాగాల్లో లైన్మెన్లు, హెల్పర్లు, సూపర్‌వైజర్లు వంటి ఉద్యోగాల్లో సుమారు 3 వేల మంది నకిలీ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, పౌరసరఫరాలు, నీటిపారుదల వంటి శాఖల్లోనూ ఔట్‌సోర్సింగ్ పేరుతో సుమారు 4 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు తెలిసింది. అన్ని శాఖల లెక్కలు తేలితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని సమాచారం. తుది లెక్కలు వచ్చేటప్పటికీ బోగస్ ఉద్యోగుల సంఖ్య కొంత మేరకు తగ్గే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల నుంచి శాఖల వారీగా ఎంత మంది ఉద్యోగులు పని చేస్తున్నారనే లెక్కలు తేలితేనే ఎంత సొమ్ము కాజేశారనే విషయం వెలుగులోకి వస్తుంది. ఉన్నతాధికారులే బినామీల పేరుతో ఏజెన్సీలు నడుపుతున్నారన్న ఆరోపణలున్నాయని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు అంటున్నారు. ఏజెన్సీలను తొలగించి, కార్పొరేషన్ ద్వారా ఉద్యోగులను తీసుకుంటే ఆదాయం కోల్పోతామన్న భయంతోనే కార్పొరేషన్ ఏర్పాటుకు కొందరు అధికారులు అడ్డుపడుతున్నారని అంటున్నారు.
జీఎస్టీ పేరుతోనూ దందా..
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను మూడు విభాగాలుగా విభజించారు. కేటగిరీ-1లో పని చేసే ఉద్యోగికి బేసిక్ వేతనం రూ.15600. ఈ వేతనానికి తోడు ఈపీఎఫ్ కింద 13 శాతం, ఈఎస్‌ఐ కింద 3.25 శాతం, వీటిని కలిపిన తర్వాత 18 శాతం జీఎస్టీని కూడా ప్రభుత్వం చెల్లిస్తోంది. అంటే 13ు ఈపీఎఫ్ కింద రూ.2028, ఈఎ్‌సఐ కింద రూ.507, ఏజెన్సీ కమీషన్ 4 శాతం కింద రూ.624 కలిపితే మొత్తం రూ.18756 అవుతుంది. దీనికి 18 శాతం జీఎస్టీ కింద రూ.3377 కలిపి ఒక ఉద్యోగికి సర్కారు రూ.22,136 చెల్ల్లిస్తోంది. అయితే ఇందులో వాస్తవంగా ఉద్యోగికి ఇచ్చేది రూ.13,611 మాత్రమే. ఎందుకంటే బేసిక్ వేతనం నుంచి ఈపీఎఫ్ 12ు, ఈఎస్‌ఐ, వృత్తి పన్ను 0.75 శాతం కట్ చేస్తారు. అయితే ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల్లో చాలా వరకు ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎ్‌సఐ కట్టడం లేదు. ఒక్కో ఉద్యోగికి ఈపీఎఫ్, ఈఎ్‌సఐ, జీఎస్టీతోపాటు ఏజెన్సీ కమీషన్‌తో కలిపి ఏజెన్సీకి మొత్తం రూ.9425 వస్తుంది. ఇందులో కమీషన్ మినహాయించి మిగిలింది ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, అలా ఇవ్వడం లేదు. అంతేకాదు.. వాస్తవంగా పనిచేస్తున్న ఉద్యోగులకేగాక, లెక్కల్లో తేడాలు చూపించి మెక్కేస్తున్న జీతాలకూ ప్రభుత్వం నుంచి జీఎస్టీ సొమ్మును తీసేసుకుంటున్నారు. కేటగిరీ-2 ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి జీఎస్టీ కింద రూ.4115 చొప్పున ప్రభుత్వం ఏజెన్సీలకు చెల్లిస్తోంది. ఇక మూడో కేటగిరీలో ఉన్న ఉద్యోగులకు దీనికి మించే చెల్లిస్తోంది. కానీ, ఆయా ఏజెన్సీలు మాత్రం తమ కార్యకలాపాలకు సంబంధించి, సర్కారుకు పూర్తిస్థాయిలో పన్నులు చెల్లించడం లేదు. ఏజెన్సీలు చెల్లించిన జీఎస్టీ, ప్రభుత్వం వాటికి చెల్లించిన జీఎస్టీని సరిపోల్చి చూస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.
ఏజెన్సీలకుప్రతినెలారూ.200 కోట్లు!
ఈపీఎఫ్, ఈఎ్‌సఐ, 4 శాతం కమీషన్, జీఎస్టీ వంటివన్నీ కలుపుకొని ప్రతి నెలా ఏజెన్సీలకు సుమారు రూ.200 కోట్లు అందుతున్నాయి. అయితే 50 శాతం పైగా ఏజెన్సీలు ఉద్యోగులకు చెల్లించాల్సిన ఈపీఎఫ్, ఈఎ్‌సఐలను సకాలంలో చెల్లించడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఏజెన్సీల్లో అత్యధికం అధికారులు, వారి బినామీల కనుసన్నల్లోనే ఉన్నాయి. ప్రభుత్వం చేపట్టిన విచారణలో ఏజెన్సీల అక్రమాలు, నకిలీ ఉద్యోగుల వివరాలు వెలుగు చూశాక ఎవరిపై కేసులు నమోదు చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. చాలా సందర్భాల్లో ఏజెన్సీల లోపాలను గుర్తించి కలెక్టర్లు వాటిని బ్లాక్ లిస్టులో పెడితే నాలుగు నెలలు తిరగకముందే మరో పేరుతో అదే వ్యక్తి తెరపైకి వస్తున్నారని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు చెబుతున్నారు.
రకరకాల పేర్లతో లూటీ
రోజువారీ వేతనం, ఎన్‌ఎంఆర్, గౌరవ భృతి అంటూ రకరకాల పేర్లతో ఉద్యోగుల శ్రమ దోపిడీ తప్ప భద్రత ఉండడం లేదు. నిరుద్యోగులకు న్యాయం చేసేలా ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి, కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దీనికి కొంత మంది అధికారులు అడ్డుపడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. వచ్చే మార్చి నుంచి అయినా ప్రభుత్వం ఏజెన్సీల లైసెన్సులను పునరుద్ధరించకుండా, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే నిరుద్యోగులకు మేలు చేకూరుతుంది. ఏజెన్సీలకు ప్రభుత్వం 18 శాతం జీఎస్టీ పేరుతో ఒక్కో ఉద్యోగి (రెండో కేటగిరీ) మీద రూ.4 వేలు వృథా చేస్తోంది. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే అది నేరుగా ఉద్యోగులకే ఇవ్వొచ్చు.
- పులి లక్ష్మయ్య, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు