2029 Elections: 2029 ఎన్నికలు పాత స్థానాలతోనే!
ABN , Publish Date - Dec 13 , 2025 | 05:42 AM
రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు పాత నియోజకవర్గాలతోనే జరుగనున్నాయి. ఎందుకంటే.. నియోజకవర్గాల పునర్విభజనకు జనగణన ప్రక్రియ ప్రధాన అవరోధంగా నిలుస్తోంది.....
నియోజకవర్గాల పునర్విభజనకు ‘జనగణన’ అడ్డు
వచ్చే ఏప్రిల్ నుంచి జనాభా లెక్కలు
2028 జూన్‌కు పూర్తయ్యే అవకాశం
తర్వాత పునర్విభజనకు మరో ఏడాదిన్నర
అప్పటికి ముగిసిపోనున్న 2029 ఎన్నికలు
ఇక 2034 ఎన్నికలనాటికే కొత్త స్థానాలు!
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు పాత నియోజకవర్గాలతోనే జరుగనున్నాయి. ఎందుకంటే.. నియోజకవర్గాల పునర్విభజనకు జనగణన ప్రక్రియ ప్రధాన అవరోధంగా నిలుస్తోంది. జనాభా లెక్కల సేకరణ, దాని తర్వాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తయ్యే సమయానికి 2029 ఎన్నికలు ముగిసేపోతాయి. నియోజకవర్గాల పునర్విభజనపై 2001లో తీసుకొచ్చిన 84వ రాజ్యాంగ సవరణలో.. ఆ రోజుకు ఉన్న అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల పరిధిని ఫ్రీజ్ చేశారు. 2026 తర్వాత చేపట్టే జనగణన ఆధారంగా నియోజకర్గాల పునర్విభజన జరగాలని అందులో నిర్దేశించారు. అయితే రాష్ట్ర విభజన చట్టం(2014)లోని సెక్షన్ 26(1) ప్రకారం తెలంగాణలో విభజన నాటికి ఉన్న 119 అసెంబ్లీ సీట్లను 153కి.. ఏపీలో 175 అసెంబ్లీ సీట్లను గరిష్ఠంగా 225కి పెంచుకునే వెసులుబాటు కల్పించారు. దీని ఆధారంగా 2029 ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తూ వచ్చాయి. జనగణన ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన జరగాలని విభజన చట్టంలో ఎక్కడా లేదని.. ప్రజల సౌకర్యం, పాలనాసౌలభ్యం, భౌగోళిక సమస్యలు తలెత్తకుండా మాత్రమే పునర్విభజన జరగాలని అందులో ఎన్నికల కమిషన్(ఈసీ)కి నిర్దేశించారని వాదిస్తూ వచ్చాయి. కేంద్రం మాత్రం జనగణన తర్వాతే రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని స్పష్టం చేసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ సమయలోనూ తన వైఖరిని తేల్చిచెప్పింది. జనగణన తర్వాత ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాలు పెంచుకోవచ్చని కోర్టుకు నివేదించింది.
జనగణన.. సుదీర్ఘ ప్రక్రియ
జనగణన ప్రక్రియ 2020లోనే ప్రారంభం కావలసి ఉంది. అయితే కరోనా కారణంగా కేంద్రం వాయిదా వేసింది. ఆ తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికలు రావడంతో మళ్లీ వాయిదా పడింది. ఎట్టకేలకు కేంద్రం ఈ ఏడాది జూన్ 4న 2027 జనగణనకు షెడ్యూల్ ప్రకటించింది. ఈ ప్రక్రియకు రూ.11,718 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. జనగణన ప్రారంభమై తుది నోటిఫికేషన్ ఇవ్వడానికి కనీసం ఏడాదిన్నర నుంచి రెండేళ్లు పడుతుంది. అంటే 2028 మధ్యలోనే జనాభా లెక్కలపై తుది నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఆ నోటిఫికేషన్ ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలంటే ఎంత లేదన్నా ఇంకో ఏడాది నుంచి ఏడాదిన్నర పడుతుంది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేపట్టేందుకు ముందుగా కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్‌ను నియమించాల్సి ఉంటుంది. ఈ కమిషన్ రాష్ట్రమంతా తిరిగి ప్రజాభిప్రాయాలను సేకరించి తుది నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన 2029 ఏప్రిల్, మే నెలల్లో జరిగే ఎన్నికలకు కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం అసాధ్యం. ఆ తర్వాత పునర్విభజన చేపడితే.. 2034 ఎన్నికలకు మాత్రమే కొత్త నియోజవకర్గాలు అందుబాటులోకి వచ్చే వీలుంది.