KTR Alleges Congress Rigging: జూబ్లీహిల్స్‌లో 20 వేల దొంగ ఓట్లు
ABN , Publish Date - Oct 14 , 2025 | 02:45 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయరని కాంగ్రె్‌సకు అర్థమైంది. మనల్ని ఓడించాలనే కాంగ్రెస్ ఒక్క ఇంట్లోనే 43 దొంగ ఓట్లు నమోదు చేయించింది...
బీఆర్‌ఎ్‌సను ఓడించాలనే నమోదు
జూబ్లీహిల్స్ దెబ్బకు ‘ఢిల్లీ’ అదిరిపడాలి
ఇంటింటికీ వెళ్లి బాకీ కార్డులు పంచుదాం
కారు కావాలా.. బుల్డోజరు రావాలా
ప్రజలు ఆలోచించి ఓటేయాలి: కేటీఆర్
దొంగ ఓట్లపై సీఈవోకు ఫిర్యాదు
హైదరాబాద్ సిటీ/హైదరాబాద్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయరని కాంగ్రె్‌సకు అర్థమైంది. మనల్ని ఓడించాలనే కాంగ్రెస్ ఒక్క ఇంట్లోనే 43 దొంగ ఓట్లు నమోదు చేయించింది. ఇలా వేల ఓట్లు చేర్చింది. జూబ్లీహిల్స్‌లో కొట్టే దెబ్బకు ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం అదిరిపడాల’ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజలంతా బీఆర్‌ఎస్ వెంటే ఉన్నారని, నిజం, ధర్మం కూడా బీఆర్‌ఎస్ పక్షానే ఉన్నాయన్నారు. రహమత్‌నగర్ డివిజన్ పార్టీ కార్యకర్తల సమావేశంలో, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో)కి ఫిర్యాదు అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో 400 పోలింగ్ కేంద్రాల పరిధిలో 50-100 చొప్పున మొత్తం 20 వేల దొంగ ఓట్లను నమోదు చేయించినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ గురించి, రేవంత్ రెడ్డి గురించి హైదరాబాద్ ప్రజలకు బాగా తెలుసని, అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదని వ్యాఖ్యానించారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కారుకు, బుల్డోజరుకు మధ్య జరుగుతోందని, ఎన్నిక తర్వాత మీ ఇంటికి కారు రావాలా, బుల్డోజరు రావాలా అనేది ప్రజలు ఆలోచించాలన్నారు. కారు రావాలంటే మాగంటి సునీతను గెలిపించాలని, ఇళ్లు కూలగొట్టడానికి హైడ్రా రావాలనుకుంటే కాంగ్రె్‌సకు ఓటేయండని సూచించారు. కేసీఆర్ ఉన్నప్పుడు నల్లా బిల్లు రాలేదని, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ముక్కు పిండి వసూలు చేస్తున్నారన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలైపోగానే ఉచిత మంచినీటి పథకం కూడా ఎత్తేస్తారని ఆరోపించారు.
రెండేళ్లలో అవినీతిమయం
రెండేళ్లలో రాష్ట్రం అవినీతి మయమైందని బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు విమర్శించారు. ‘భవన నిర్మాణ అనుమతి కావాలంటే చదరపు అడుగుకు రూ.70కట్టాలంట. భూముల సమస్యల పరిష్కారం కావాలంటే 40 శాతం రాసివ్వాలంట.. ఇంతటి అవినీతి ఎక్కడా లేద’ని దుయ్యబట్టారు. ముస్లింలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హమీ నెరవేర్చలేదని, రంజాన్ తోఫా కూడా ఇవ్వలేదని విమర్శించారు. మంత్రి పదవి కాదు కదా.. కనీసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వలేదన్నారు. కార్యకర్తల సమావేశంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు.