Share News

Government Land Grab: రూ.2వేల కోట్ల భూమి కబ్జాకు స్కెచ్‌

ABN , Publish Date - Dec 25 , 2025 | 05:23 AM

రూ.2 వేల కోట్ల ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు ఓ ముఠా.. లేని దస్తావేజులు పుట్టించింది. ఏకంగా 58 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్‌ జరిగినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించింది.

Government Land Grab: రూ.2వేల కోట్ల భూమి కబ్జాకు స్కెచ్‌

  • రంగారెడ్డి జిల్లా మక్తా మహబూబ్‌పేటలో 43 ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేసే యత్నం

  • 1967లో రిజిస్ట్రేషన్‌ జరిగినట్లు నకిలీ లింక్‌ డాక్యుమెంట్‌

  • దాని ఆధారంగా ఈ ఏడాది ఎకరం భూమి రిజిస్ట్రేషన్‌

  • ఇదే అదనుగా మిగిలిన భూమిపై కన్ను.. రేకులతో ప్రహరీ

  • సబ్‌ రిజిస్ట్రార్‌, అధికార్ల సహకారం ఉందన్న అనుమానాలు

  • ఈ వ్యవహారంపై కన్నెత్తి చూడని రెవెన్యూ శాఖ, హైడ్రా

  • ఫిర్యాదుల నేపథ్యంలో ఉన్నతాధికారుల విచారణ

హైదరాబాద్‌, డిసెంబరు 24 (ఆంధ్ర జ్యోతి): రూ.2 వేల కోట్ల ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు ఓ ముఠా.. లేని దస్తావేజులు పుట్టించింది. ఏకంగా 58 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్‌ జరిగినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించింది. వాటినే లింకు డాక్యుమెంట్లుగా పేర్కొంటూ 43 ఎకరాల భూమిని తమ పేరిట రిజిస్టర్‌ చేయించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం తొలుత ఎకరం భూమితో ఈ ‘ప్రయోగం’ చేసింది. కోర్టును కూడా తప్పుదోవ పట్టించి.. ఎకరం భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకుంది. దానిని ఆసరాగా చేసుకొని 43 ఎకరాలను కొట్టేసేందుకు స్కెచ్‌ వేసింది. ఆ భూమి చుట్టూ కంచె వేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం, మక్తా మహబూబ్‌పేట పరిధిలో సర్వే నంబరు 44లోని 43.13 ఎకరాల భూమి ఇలా అక్రమార్కుల చెరలో చిక్కింది.


అత్యంత విలువైన భూమి కావడంతో..

మియాపూర్‌-బాచుపల్లి సరిహద్దుల్లోఉన్న ఈ భూమి ధర ప్రస్తుతం ఎకరానికి రూ.50 కోట్లదాకా పలుకుతుండడంతో అక్రమార్కుల కన్ను దీనిపై పడింది. ఈ ప్రభుత్వ భూమిని సొంతం చేసుకునేందుకుగాను దీనిపై గతంలోనే ఇతరులకు హక్కు ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేశారు. ఇందుకోసం 1967 ఫిబ్రవరి 12న ఇతరుల పేరిట రిజిస్టర్‌ అయినట్లుగా లింక్‌ డాక్యుమెంట్‌ (311/1967)ను సృష్టించారు. అనంతరం ఈ భూమిలో తొలుత ఒక ఎకరం భూమిని తమ పేరిట రిజిస్టర్‌ చేయించుకునేందుకు సేల్‌ డీడ్‌ చేసుకున్నారు. మక్తా మహబూబ్‌పేట సర్వే నంబరు 44 (పాత సర్వే నంబరు 116)లో 4,840 చదరపు గజాల స్థలానికి క్రయవిక్రయాలు జరిగినట్లు పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి పి439/2025 నంబరు, బుక్‌-1 దస్తావేజును రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు 2025 జూలై 13న తిరస్కరించారు. మక్తా మహబూబ్‌పేట సర్వే నంబరు 44లోని భూమి.. రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా (22ఏ జాబితాలో) ఉన్నందున.. రిజిస్ట్రేషన్‌ చట్టం 1908 సెక్షన్‌ 22ఏ(1)(బి) ప్రకారం రిజిస్ట్రేషన్‌ నిషేధితమని పేర్కొంటూ రిఫ్యూజల్‌ ఆర్డర్‌ (నంబరు 269/2025) ఇచ్చారు. తిరస్కరణకు కారణాలుగా.. భూమి మొత్తం విస్తీర్ణం (266 ఎకరాలు)లో కలిసి ఉందని, భూ మార్పిడి జరగలేదని, నాలా సర్టిఫికెట్‌ ఇవ్వలేదని, అందుకు సంబంధించిన ఆధారాలు లేవని పేర్కొన్నారు. అంతేకాకుండా 2019 మే 1న ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌ మెమో నంబరు జి3/3247/2018 నిబంధనలకు విరుద్ధంగా ఉందని తెలిపారు. రిజిస్ట్రేషన్‌ను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ సదరు వ్యక్తులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమ డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌ను అనుమతించాలని కోరుతూ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. భూమిపై హక్కు ఉన్నట్లు లింక్‌ డాక్యుమెంట్‌ (311/1967) చూపించి.. ఇందుకు సంబంధించిన వివరాలు హైదరాబాద్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలోని వాల్యూమ్‌ నంబరు 173 పేజీ నంబరు 211లో ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో రిజిస్ట్రేషన్‌ చేయాలంటూ కోర్టు తీర్పునిచ్చింది. దాని ఆధారంగా రంగారెడ్డి ఎస్‌ఆర్‌వో (1510) ఈ ఏడాది సెప్టెంబరు 29న 14380/2025 సేల్‌ డీడ్‌ను రిజిస్టర్‌ చేశారు. అయితే.. విచారణలో కోర్టును కూడా వారు తప్పుదారి పట్టించినట్లు తెలుస్తోంది. 200 గజాల స్థలం రిజిస్ట్రేషన్‌కు అనుమతించాలని మాత్రమే కోర్టును ఆశ్రయించిన ముఠా.. ఎకరానికి సేల్‌ డీడ్‌ చేసుకొని రిజిస్ట్రేషన్‌ చేయించుకుంది. పైగా రిజిస్ట్రేషన్‌ జరిగిన స్థలంలో కేవలం ఒక చదరపు అడుగు(1-ఎస్‌ఎ్‌ఫటీ) మాత్రమే నిర్మాణం జరిగినట్లు కోర్టుకు తెలిపింది. ఇందుకు రంగారెడ్డి సబ్‌ రిజిస్ర్టార్‌తోపాటు రిజిస్ర్టేషన్‌ శాఖ ఉన్నతాధికారులూ సహకారం అందించారనే ఆరోపణలున్నాయి. ఈ అంశాలే.. మొత్తం 43 ఎకరాల భూమిని స్వాహా చేసేందుకు ప్లాన్‌ చేశారన్న అనుమానాలకు తావిచ్చాయి. దీనిపై కొందరు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.


లింక్‌ డాక్యుమెంట్‌ నుంచీ అనుమానాలే..

లింక్‌ డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌ జరిగిన తేదీ 1967 ఫిబ్రవరి 12గా పేర్కొన్నారు. అయితే ఆ రోజు ఆదివారం కావడంతో సెలవు రోజు రిజిస్ట్రేషన్‌ శాఖ ఎలా పని చేసిందన్నది అనుమానంగా మారింది. పైగా.. లింక్‌ డాక్యుమెంట్‌ ఆధారాలు బుక్‌-1 వాల్యూమ్‌-173లో ఉన్నాయా, లేదా అన్నదానిపై ఉన్నతాధికారులు జరిపిన విచారణలో.. ఆ వాల్యూమ్‌ 44 ఏళ్లుగా హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టులో ఉందని రంగారెడ్డి జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌ రెండు రోజుల క్రితం ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. 1981 ఫిబ్రవరి 10 నుంచి ఓఎస్‌88/1968 కేసుకు సంబంధించి ఈ వాల్యూమ్‌ సిటీ సివిల్‌ కోర్టులో ఉన్నట్లు తెలిపారు. అయితే వాల్యూమ్‌ అందుబాటులో లేకపోయినా 1967లో రిజిస్ట్రేషన్‌ జరిగినట్లు చెబుతున్న హైదరాబాద్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మరో మూడు రిజిస్టర్లలో (ఇండెక్స్‌ బుక్‌, వేలిముద్రల రిజిస్టర్‌, ప్లానింగ్‌ రిజిస్టర్‌లో)నైనా లింక్‌ డాక్యుమెంట్‌ వివరాలు నమోదు చేసి ఉండాలి. కానీ, అక్కడ కూడా ఆ వివరాలు లేవని తేల్చారు. వాల్యూమ్‌ శిథిలమైందని, ఇతర (మూడు) రికార్డులు అందుబాటులో లేవని నివేదికలో ప్రస్తావించారు.

రిజిస్ట్రేషన్‌ వేళ ఎందుకు గుర్తించలేదు?

బుక్‌-1 వాల్యూమ్‌ రికార్డు 44 ఏళ్లుగా కోర్టులోనే ఉంది. సాధారణంగా ఏదైనా కేసు విషయంలో కోర్టుకు అప్పగించిన తరువాత.. ఆ రికార్డును మళ్లీ కోర్టు అనుమతితో వెనక్కి తీసుకొస్తారు. కానీ, ఈ వాల్యూమ్‌ను అధికారులు వెనక్కి తీసుకురాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాల్యూమ్‌ గానీ, ఇతర రికార్డులు గానీ అందుబాటులో లేకపోయినా 14380/2025 డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌ సమయంలో అధికారులు మదర్‌ డాక్యుమెంట్‌కు ఉన్న చట్టబద్ధతను తనిఖీ చేయకుండానే అనుమతించినట్లు స్పష్టమవుతోంది. దీంతో అత్యంత ఖరీదైన భూములను స్వాహా చేసేందుకు రంగంలోకి దిగిన ముఠా.. నకిలీ పత్రాలతో ఏకంగా 44 ఎకరాల ప్రభుత్వ భూమికి రేకులతో కంచె వేసింది. దీనిపై శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. హైడ్రా సైతం స్పందించలేదని స్థానికులు చెబుతున్నారు. ఇదే అదనుగా నకిలీ సేల్‌ డీడ్‌లు సృష్టిస్తూ ప్రభుత్వ భూములను స్వాహా చేసే ముఠాలు చెలరేగిపోతున్నాయి. వాటికి అడ్డుకట్ట వేయాల్సిన రిజిస్ర్టేషన్‌ శాఖ అధికారులు.. నకిలీ ముఠాలకు సహకరించడం వల్లనే ఈ తరహా సంఘటనలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి.

Updated Date - Dec 25 , 2025 | 05:23 AM