Share News

Jubilee Hills By Election: రెండు రోజుల్లోనే 20 నామినేషన్లు

ABN , Publish Date - Oct 15 , 2025 | 04:10 AM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో నామినేషన్ల జాతర కొనసాగుతోంది. రెండు రోజుల్లోనే ఏకంగా 20 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు..

Jubilee Hills By Election: రెండు రోజుల్లోనే 20 నామినేషన్లు

  • నేడు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సునీత దాఖలు

హైదరాబాద్‌ సిటీ/బంజారాహిల్స్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో నామినేషన్ల జాతర కొనసాగుతోంది. రెండు రోజుల్లోనే ఏకంగా 20 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో మెజార్టీ స్వతంత్ర అభ్యర్థులు, ఎన్నికల సంఘం గుర్తింపు లేని పార్టీల అభ్యర్థులు ఉన్నారు. షేక్‌పేట తహసీల్దార్‌ కార్యాలయంలోని రిటర్నింగ్‌ ఆఫీసర్‌కు అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలు సమర్పిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత బుధవారం నామినేషన్‌ వేయనున్నారు. ఆమె 19న భారీ ర్యాలీతో రెండో సెట్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారని అనుచరులు తెలిపారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ 17న నామినేషన్‌ వేయాలని నిర్ణయించుకున్నారు. ఇక బీజేపీ తమ అభ్యర్థిని నేడో, రేపో ఖరారు చేసే అవకాశం ఉంది.

64 దాటితే... బ్యాలెట్‌!

ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే నిరుద్యోగులు, రైతులు, రీజనల్‌ రింగ్‌ రోడ్డు భూ బాధితులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేస్తామని ప్రకటించారు. అభ్యర్థుల సంఖ్య గరిష్టంగా 64 దాటితే బ్యాలెట్‌ పత్రాలతో పోలింగ్‌ నిర్వహించాల్సి ఉంటుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి ఈనెల 21 వరకు గడువు ఉండడంతో, ఇంకా ఎన్ని నామినేషన్లు వస్తాయో వేచి చూడాలి.

Updated Date - Oct 15 , 2025 | 04:10 AM