GHMC: జీహెచ్‌ఎంసీలో విలీనం పూర్తి!
ABN , Publish Date - Dec 04 , 2025 | 04:47 AM
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ జీహెచ్‌ఎంసీలో శివారులోని 20 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనం బుధవారం పూర్తయ్యింది....
కలిసిపోయిన 20 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లు
బుధవారం ఉత్తర్వులు జారీచేసిన పురపాలక శాఖ
తాత్కాలిక సర్కిళ్లుగా విలీన మునిసిపాలిటీలు
ప్రొసీడింగ్స్ ఇచ్చిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్
పునర్విభజన అనంతరం మారనున్న స్వరూపం
290 నుంచి 300 డివిజన్లు అయ్యే అవకాశం
ఒక కార్పొరేషనా..? రెండా, మూడా? అనేదానిపై సస్పెన్స్
ప్రభుత్వానికి అందిన పునర్విభజన ముసాయిదా
సర్కారు ఆమోదం తర్వాత అభ్యంతరాల స్వీకరణ
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో శివారులోని 20 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనం బుధవారం పూర్తయ్యింది. ఈ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు (జీవో-264) జారీ చేసింది. గ్రేటర్ పరిధిని తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) వరకు విస్తరిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ చట్టం-1955లో పలు సవరణలు చేస్తూ.. అవి ఈ నెల 1వ తేదీ నుంచే అమలులోకి వచ్చినట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తెలంగాణ మునిసిపల్ చట్టం -2019 నుంచి విలీన మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను తొలగించారు. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ డిసెంబరు 2వ తేదీ నుంచి అమలవుతుందని తెలిపారు. టీసీయూఆర్ వరకు జీహెచ్‌ఎంసీ విస్తరణ మంగళవారం నుంచే అమల్లోకి వచ్చిందని వెల్లడించారు. ఈ జీవో వచ్చిన వెంటనే విలీనమైన మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల కార్యాలయాల్లోని రికార్డులన్నీ స్వాధీనం చేసుకొని, వాటికి జీహెచ్‌ఎంసీ బోర్డులు ఏర్పాటుచేయాలని బల్దియా కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. విలీనం నేపథ్యంలో ఆయా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను తాత్కాలికంగా సర్కిళ్లుగా పరిగణిస్తున్నారు. పాలనాపరమైన ఇబ్బందులు లేకుండా అక్కడి కమిషనర్లు ఇక నుంచి డిప్యూటీ మునిసిపల్ కమిషనర్లుగా వ్యవహరిస్తారని ఆర్‌వీ కర్ణన్ ప్రొసీడింగ్స్ జారీచేశారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో 30 సర్కిళ్లు, ఆరు జోన్లు ఉన్నాయి. 27 విలీన మునిసిపాలిటీలతో కలిపి సర్కిళ్ల సంఖ్య 57కు పెరుగనుంది.
పునర్విభజన వరకే...
వార్డుల పునర్విభజన జరిగే వరకు ఈ సర్కిళ్లు, మునిసిపల్ కమిషనర్లు కొనసాగుతారు. పునర్విభజన ముసాయిదాను జీహెచ్‌ఎంసీ ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదించింది. సర్కారు ఆమోదించాక రెండుమూడు రోజుల్లో అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణకు కమిషనర్ నోటిఫికేషన్ ప్రకటిస్తారు. అనంతరం పునర్విభజన ప్రక్రియను పూర్తిచేయనున్నారు. ఫిబ్రవరి 10వ తేదీ తరువాతే పునర్విభజన అమలులోకి వస్తుందని ఓ అధికారి తెలిపారు. అప్పటి వరకుశివారు మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు సర్కిళ్లుగా కొనసాగనున్నాయి. అనంతరం మొత్తం స్వరూపం మారిపోనుంది.
10 జోన్లుగా మెగా జీహెచ్‌ఎంసీ..?
విలీనం తర్వాత రెండు వేల చదరపు కిలోమీటర్లకుపైగా విస్తీర్ణంలో ఉన్న టీసీయూఆర్ ను 9-10 జోన్లుగా విభజించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. టీసీయూఆర్ పరిధిలో 1.30 కోట్లకుపైగా జనాభా ఉంటుందని అంచనా. 40 వేల నుంచి 50 వేల జనాభాకు ఒకటి చొప్పున 290 నుంచి 300 వరకు డివిజన్లు ఏర్పాటయ్యే అవకాశముంది. గ్రేటర్‌తో పోలిస్తే శివారు మునిసిపాలిటీల్లో జనసాంద్రత తక్కువ. ఈ క్రమంలో సహజ సరిహద్దులతోపాటు భవిష్యత్తులో ఏ స్థాయిలో అభివృద్ధి జరిగే, జనాభా పెరిగే అవకాశ ముందన్నది పరిగణనలోకి తీసుకున్నారు. టీసీయూఆర్ వరకు ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా..? లే దంటే రెండుమూడు కార్పొరేషన్లుగా విభజించాలా..? అన్నదానిపై సర్కారు నుంచి స్పష్టత రావాల్సి ఉందని జీహెచ్‌ఎంసీ అధికారి ఒకరు తెలిపారు. అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణకు నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఎన్ని కార్పొరేషన్లు ఉంటాయన్నదానిపై స్పష్టత రానుంది. ఒకటి కంటే ఎక్కువ కార్పొరేషన్లుగా విభజించిన పక్షంలో జోన్ల సంఖ్యలో మార్పు ఉంటుంది. దీనిపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో దాదాపు వారంపాటు పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు సుదీర్ఘ కసరత్తు చేశారు. జీహెచ్‌ఎంసీతోపాటు విలీన మునిసిపాలిటీలు, కార్పొరేషన్లవారీగా ప్రాంతాలను క్లస్టర్లుగా విభజించి మ్యాపింగ్ చేశారు. విలీనమైన కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో ప్రస్తుతం 512 మంది రెగ్యులర్, 6,026 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులున్నారు. గెజిట్ విడుదలతో వీరంతా జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వస్తారు.