Health ATMs Introduced in PHCs: పీహెచ్‌సీల్లో హెల్త్ ఏటీఎంలు!
ABN , Publish Date - Oct 20 , 2025 | 05:01 AM
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో ‘హెల్త్ ఏటీఎం’లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కారు యోచిస్తోంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లోని...
నిమిషాల్లోనే 132 రకాల వైద్య పరీక్షలు
పైలట్ ప్రాజెక్టుగా కింగ్‌కోఠి, మలక్‌పేట ఏరియా ఆస్పత్రుల్లో ఏర్పాటు
2 నెలలుగా ప్రయోగాత్మకంగా పరీక్షలు
హైదరాబాద్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో ‘హెల్త్ ఏటీఎం’లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కారు యోచిస్తోంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లోని కింగ్ కోఠి ఆస్పత్రి, మలక్‌పేట ఏరియా ఆస్పత్రిలో ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేటు సంస్థ అభివృద్ధి చేసిన హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు. రెండు నెలల పాటు వీటి సేవలను పరిశీలించారు. ఈ హెల్త్ ఏటీఎంల ద్వారా క్షణాల్లో ప్రాథమిక ఆరోగ్య పరీక్షలన్న్నీ పూర్తి అవుతున్నాయి. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు అవసరమైన రక్త, మూత్ర పరీక్ష నమూనాలను సేకరించి, జిల్లా కేంద్రాల్లోని టీ డయాగ్నస్టిక్ కేంద్రాలకు పంపుతున్నారు. వాటి ఫలితాలు వచ్చి, రోగ నిర్ధారణ అవ్వడానికి ఒకోసారి ఒకటి రెండు రోజుల సమయం పడుతోంది. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు విజృంభించే సమయంలో రోగులకు ప్రాథమిక పరీక్షలు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తక్షణమే ప్రాథమిక ఆరోగ్య పరీక్షల నివేదికలు అందించే హెల్త్ ఏటీఏంలపై సర్కారు దృష్టిసారించింది. ఈ హెల్త్ ఏటీఎంలు అత్యంత ఆధునికమైన ఇంటిగ్రేటెడ్ వైద్య పరికరాలతో పనిచేస్తాయి. ఇవి మనిషి ముఖ్యమైన ఆరోగ్య సూచికలను వెంటనే గుర్తిస్తాయి. శరీరాన్ని స్కాన్ చేసి, శరీర ఉష్ణోగ్రత, రక్తపోటు (బీపీ), బరువు, ఎత్తు, బీఎంఐ, రక్తంలో ఆక్సిజన్ స్థాయి వంటి వాటిని తక్షణమే కొలుస్తాయి. అంతేకాకుండా రోగ నిర్ధారణ పరీక్షలైన రక్తంలో గ్లూకోజ్ (షుగర్), ఈసీజీ, కొలెస్ట్రాల్, యూరిన్ టెస్టులతో పాటు, డెంగ్యూ, మలేరియా, హెచ్‌ఐవీ వంటి వ్యాధులకు సంబంధించిన రాపిడ్ టెస్టులు కూడా చేస్తాయి. మొత్తం 132 రకాల పరీక్షల ఫలితాలు నిమిషాల్లోనే అందుబాటులోకి వస్తాయి. ప్రతి రోగి ఆరోగ్య రికార్డు డిజిటల్‌గా తయారై, సురక్షితంగా నిల్వ చేయబడుతుంది. దీనివల్ల భవిష్యత్తులో ఆన్‌లైన్‌లో ఎప్పుడైనా వారి ఆరోగ్య వివరాలను పొందవచ్చు. పరీక్షలు పూర్తయిన వెంటనే, రోగి ఈ యంత్రం ద్వారానే ఎక్కడో ఉండే వైద్యుడితో వర్చువల్‌గా మాట్లాడవచ్చు. మిషన్ సేకరించిన ఆరోగ్య డేటా మొత్తం డాక్టర్‌కు అందుతుంది. దీని ఆధారంగా డాక్టర్ సలహాలు, చికిత్సను అందిస్తారు.
పోలిక నిర్ధారించుకున్న తర్వాతే
కింగ్‌కోఠీ, మలక్‌పేట ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రయోగాత్మకంగా రోజుకు 20-25 మంది రోగులకు హెల్త్ ఏటీఏం ద్వారా పరీక్షలు చేశారు. అదే రోగుల నుంచి రక్తనమూనాలను సేకరించి, నారాయణగూడలోని టీ డయాగ్నస్టిక్ కేంద్రానికి పంపి, అక్కడ వేరేగా పరీక్షలు చేశారు. హెల్త్ ఏటీఏం ద్వారా వచ్చిన టెస్టు ఫలితాలను, టీ డయాగ్నస్టిక్ ల్యాబ్‌లో చేసిన పరీక్షల ఫలితాలను పోల్చి చూశారు. రెండు నివేదికలు ఒకేలా ఉన్నాయి. అలాగే కొన్ని నమూనాలను ప్రైవేటు ల్యాబ్‌లకు కూడా పంపి పరీక్షించారు. అక్కడి నుంచి వచ్చిన ఫలితాలను హెల్త్ ఏటీఎం ఇచ్చిన టెస్టు రిపోర్టులతో పోల్చి చూస్తే ఒకేలా ఉన్నాయి. దీంతో హెల్త్ ఏటీఏంలు ఇచ్చే ఫలితాలు చాలా ఖచ్చితత్వంతో ఉన్నాయని వైద్యశాఖ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదిక అందించింది.
ఇతర రాష్ట్రాల్లోనూ..
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, సిక్కిం రాష్ట్రాలు పీహెచ్‌సీలు, ఇతర ఆస్పత్రుల్లో సెల్ప్ ఆపరేటెడ్ కియోస్కిలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అలాగే ప్రస్తుతం తెలంగాణలో పైలెట్ ప్రాజెక్టు కింద సేవలందిస్తోన్న ఢిల్లీ సంస్థనే ఇతర రాష్ట్రాల్లోనూ ఇటువంటి సేవలందిస్తోంది. అయితే అక్కడ ఈ హెల్త్ ఏటీఎం సేవలు ఎలా ఉన్నాయి? వాటిని ఎప్పటి నుంచి వాడుతున్నారు? తదితర విషయాలపై అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆ శాఖ ఉన్నతాధికారులతో హెల్త్ ఏటీఎంలపై సమీక్ష నిర్వహించారు. ముందుగా వీటిని ఏర్పాటు చేసిన ఆయా రాష్ట్రాలకు వెళ్లి అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వాలని మంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేయడంపై మళ్లీ ఒక కమిటీని వేయనున్నారు. ఆ కమిటీ నివేదిక అనంతరం వీటిని కొనుగోలు చేయనున్నారు.