Medical Costs Soaring in India: వైద్యం ఖర్చు తడిసి మోపెడు!
ABN , Publish Date - Nov 13 , 2025 | 05:13 AM
పదేళ్ల కిందట కార్డియాక్ బైపాస్ సర్జరీ చేయించుకోవాలంటే రూ.2.50 లక్షల ఖర్చయ్యేది.. కానీ, ప్రస్తుతం మెట్రో నగరాల్లో అదే ఆపరేషన్ చేయించుకోవడానికి రూ.4.5-6 లక్షలు అవుతోంది....
ఈ ఏడాది 13-14ు పెరిగే చాన్స్.. బంగారం, వెండి ధరల కన్నా వేగంగా పెరుగుదల
వైద్య ద్రవ్యోల్బణంలోఆసియాలోనే భారత్ టాప్
వైద్య ఖర్చులతో ఏటా 3 కోట్ల మంది పేదరికంలోకి..
వెల్లడించిన పలు సర్వే నివేదికలు
హైదరాబాద్, నవంబరు 12(ఆంధ్రజ్యోతి) : పదేళ్ల కిందట కార్డియాక్ బైపాస్ సర్జరీ చేయించుకోవాలంటే రూ.2.50 లక్షల ఖర్చయ్యేది.. కానీ, ప్రస్తుతం మెట్రో నగరాల్లో అదే ఆపరేషన్ చేయించుకోవడానికి రూ.4.5-6 లక్షలు అవుతోంది. ఐదేళ్ల కిందట క్యాన్సర్ చికిత్స వ్యయం రూ.8-10 లక్షల మేర ఉండగా, ప్రస్తుతం అది రూ.15-25 లక్షలకు పెరిగింది. దేశంలో మునుపెన్నడూ లేనంత శరవేగంగా వైద్య ఖర్చులు పెరుగుతున్నాయి. భారత్‌లో ఆరోగ్య సంరక్షణ ఖర్చు ఈ ఏడాది 13-14ు మేర పెరిగే అవకాశం ఉన్నట్లు ఇటీవల విడుదలైన పలు సర్వే నివేదికలు వెల్లడించాయి. వైద్య ేసవలు, చికిత్స ఖర్చులు కాలక్రమేణా పెరగడాన్ని వైద్య ద్రవ్యోల్బణంగా వ్యవహరిస్తారు. భారత్‌లో సాధారణ ద్రవ్యోల్బణం రేటు 4-6శాతం మధ్య ఉండగా, వైద్య ద్రవ్యోల్బణం రేటు ఏటా 12-15 శాతంగా కొసాగుతోంది. దేశంలోని మధ్య తరగతి కుటుంబాలకు ఇది పెనుభారంగా మారుతోంది. ఆధునిక చికిత్సలు, దిగుమతి చేసుకున్న వైద్య పరికరాల కారణంగా వినియోగదారులపై పడే వైద్య ద్రవ్యోల్బణం 13శాతం మేర ఉంటోందని నిపుణులు పేర్కొంటున్నారు. వైద్య ఖర్చుల కారణంగా దేశంలో ఏటా 3 కోట్ల మంది పేదవారు అయిపోతున్నారని మరో సర్వే వెల్లడించింది. ఆసియాలోని ఇతర దేశాలతో పోల్చినా భారత్‌లోనే వైద్య ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉందని పేర్కొంది. చైనాలో 12ు, ఇండోనేషియా, వియత్నాం, ఫిలిప్ఫిన్స్‌లో 10ులోపే ఉందని తెలిపింది.
పెరుగుదలకు కారణాలేంటి?
భారత్‌లో వైద్య ఖర్చులు విపరీతంగా పెరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సర్వే నివేదికలు వెల్లడించిన వివరాల ప్రకారం భారత్‌లోని నగర, పట్టణ ప్రాంత ప్రజలు అత్యాధునిక, మెరుగైన చికిత్స కోరుకుంటున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్యం కారణంగా ఖర్చు పెరుగుతోంది. ముఖ్యంగా ఎంఆర్‌ఐ, రోబోటిక్ సర్జరీ వంటి దిగుమతి చేసుకున్న యంత్రాల వల్ల చికిత్స ఖర్చు ఎక్కువవుతోంది. డాక్టర్లు, నర్సుల కొరత కారణంగా వారి వేతనాలు పెరిగి, చివరికి ఆ భారం రోగులపై పడుతోంది. దిగుమతి చేసుకునే వస్తువులపై రూపాయి మారకపు విలువ, ఆస్పత్రుల నిర్వహణ భారం.. అంతిమంగా వైద్య ఖర్చుపై ప్రభావం చూపుతున్నాయి. ఆస్పత్రుల్లో చికిత్సల ఖర్చు పెరిగినప్పుడు.. బీమా సంస్థలు చెల్లించే క్లెయిమ్ మొత్తాలూ పెరుగుతాయి. ఇది నేరుగా ప్రీమియంలపై ప్రభావం చూపుతోంది. వైద్య ద్రవ్యోల్బణాన్ని ఆపలేకపోయినా.. దాని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బీమా సంస్థను ఎంచుకునే ముందు పాలసీల ఫీచర్లు, మినహాయింపులు, ప్రీమియంలను పోల్చి చూసుకోవాలని కోరుతున్నారు. వ్యక్తిగత పాలసీల కంటే ఫ్యామిలీ ఫ్లాటర్ ప్లాన్లు చౌకగా లభిస్తాయని పేర్కొంటున్నారు. బీమాతోపాటు ఊహించని వైద్య ఖర్చుల కోసం అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.