Kukatpally Incident: 12 ఏళ్ల బాలిక దారుణ హత్య
ABN , Publish Date - Aug 19 , 2025 | 05:09 AM
కూకట్‌పల్లిలో 12 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. తల్లిదండ్రులు పనులకు వెళ్లడంతో ఇంట్లో చిన్నారి ఒక్కత్తే ఉండటం, మధ్యాహ్నం తండ్రి వచ్చి చూసేసరికే బాలిక రక్తపుమడుగులో విగతజీవిగా పడి ఉండటంతో ఘటనపై తీవ్ర అనుమానాలు ..
కూకట్‌పల్లిలో ఘటన.. సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్న పోలీసులు
గుర్తు తెలియని దుండగుడు పొడిచి చంపాడని అనుమానం
తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా బాలిక
మధ్యాహ్నం తండ్రి వచ్చేసరికి రక్తపు మడుగులో మృతదేహం
కేపీహెచ్‌బీకాలనీ, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లిలో 12 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. తల్లిదండ్రులు పనులకు వెళ్లడంతో ఇంట్లో చిన్నారి ఒక్కత్తే ఉండటం, మధ్యాహ్నం తండ్రి వచ్చి చూసేసరికే బాలిక రక్తపుమడుగులో విగతజీవిగా పడి ఉండటంతో ఘటనపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూకట్‌పల్లిలోని దయార్‌గూడలో జరిగిన ఈ ఘటన స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. గుర్తు తెలియని దుండగుడు ఇంట్లోకి చొరబడి బాలికను కత్తితో పొడిచి చంపాడని భావిస్తున్నారు. హతురాలు.. కృష్ణ, రేణుక దంపతుల కుమార్తె సహస్ర (12). ఈ దంపతులకు సహస్రతో పాటు ఓ బాబు ఉన్నాడు. ఐదేళ్ల క్రితం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మక్తక్యాసారం నుంచి బతుకుదెరువు కోసం కూకట్‌పల్లికి వచ్చి ఉంటున్నారు. కృష్ణ బల్కంపేటలో ఓ బైక్ రిపేర్ షాపు నిర్వహిస్తున్నాడు. రేణుక కూకట్‌పల్లిలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ ల్యాబ్‌లో టెక్నిషియన్‌గా ఉద్యోగం చేస్తోంది. కూతురు సహస్ర కేంద్రీయ విద్యాలయంలో ఆరో తరగతి చదువుతుంటే.. కుమారుడు ఇంటికి సమీపంలోనే ఓ ప్రైవేటు స్కూల్లో చదువుతున్నాడు. సోమవారం ఉదయం 9 గంటలకు కృష్ణ, రేణుక పనులకు, బాబు స్కూల్‌కు వెళ్లారు. ఇంట్లో సహస్ర ఒక్కత్తే ఉంది. మధ్యాహ్నం 12:30కు కుమారుడికి లంచ్ బాక్స్ తీసుకెళ్లేందుకు కృష్ణ ఇంటికి వెళ్లాడు. ఒంటికి తీవ్రగాయాలైన స్థితిలో కూతురు మృతదేహాన్ని చూసి షాక్‌తో బిగ్గరగా రోదించాడు. ఫోన్ చేసి భార్యకు ఘోరం గురించి చెబుతుంటే.. ఆమెకు భర్త మాట్లాడుతోంది గానీ, ఎందుకు రోదిస్తున్నాడని గానీ అర్థం కాకపోవడంతో పక్కవాళ్లకు ఫోన్ చేస్తే జరిగిన ఘోరం గురించి తెలిసింది. డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలానగర్ డీసీపీ సురేశ్ కుమార్, కూకట్‌పల్లి ఏసీపీ రవికిరణ్‌రెడ్డి, ఎస్‌హెచ్‌వో కేవీ సుబ్బారావు ఘటనాస్థలికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం రంగంలోకి దిగి వివరాలు సేకరించారు. తమకు ఎవ్వరిపైనా అనుమానాలు లేవని పోలీసులకు బాఽధిత తల్లిదండ్రులు చెప్పారు. మృతదేహాన్ని గాంధీ మార్చురికీ తరలించారు. చుట్టు పక్కల ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. బాలికతో సన్నిహితంగా ఉండే స్నేహితుల గురించి ఆరా తీస్తున్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బాలిక కుటుంబసభ్యులను పరామర్శించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.