Governor Urges Inter Caste Marriages: కులాంతర వివాహాలే సామాజిక న్యాయానికి మార్గం
ABN , Publish Date - Oct 27 , 2025 | 01:58 AM
సమాజంలో కులాంతర వివాహాలను ప్రోత్సహించే సంస్కృతి బలపడాలని, దీని ద్వారానే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని గవర్నర్...
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
అచ్చంపేటలో 111 చెంచు జంటలకు వివాహాలు
నాగర్‌కర్నూల్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): సమాజంలో కులాంతర వివాహాలను ప్రోత్సహించే సంస్కృతి బలపడాలని, దీని ద్వారానే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభిలషించారు. ఆదివాసీలకు అండగా నిలబడాల్సిన బాధ్యత అన్ని వర్గాలపై ఉన్నదని, వారి ఉన్నతి కోసం నిరంతరం శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు. వనవాసీ కల్యాణ్ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో చెంచు తెగకు చెందిన 111 జంటలకు సామూహిక వివాహాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి జిష్ణుదేవ్ వర్మతో పాటు హర్యాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, హైకోర్టు జడ్జి మాధవీ లత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. కులాలు, మతాలు లేని సమాజం ఏర్పడాలని ఆకాంక్షించారు. ఇందుకోసం కుటుంబంలోనే మార్పు మొదలు కావాలని సూచించారు. ఆదిమ జాతి చెంచులను అక్కున చేర్చుకుని వారికి అండగా నిలబడాలని ఆయన కోరారు. బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, చెంచుల జీవితాల్లో సమూలమైన మార్పు కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలన్నింటినీ ప్రోత్సహించాలన్నారు. 111 జంటలను ఏకం చేసిన వనవాసీ కల్యాణ్ పరిషత్ సభ్యులను ఆయన అభినందించారు.