Share News

Sangareddy: 108 అంబులెన్స్‌ సిబ్బందిపై ప్రశంసలు

ABN , Publish Date - Dec 28 , 2025 | 07:10 AM

మోకాళ్ల లోతు నీటి కారణంగా అంబులెన్స్‌ వెళ్లే దారి లేకపోయినా గర్భిణిని స్ర్టెచర్‌ సాయంతో ఆసుపత్రికి తరలించిన 108 సిబ్బందిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

Sangareddy: 108 అంబులెన్స్‌ సిబ్బందిపై ప్రశంసలు

  • అంబులెన్స్‌ వెళ్లే అవకాశం లేకున్నా స్ట్రెచర్‌పై గర్భిణి తరలింపు

పుల్కల్‌, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): మోకాళ్ల లోతు నీటి కారణంగా అంబులెన్స్‌ వెళ్లే దారి లేకపోయినా గర్భిణిని స్ర్టెచర్‌ సాయంతో ఆసుపత్రికి తరలించిన 108 సిబ్బందిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలం బొమ్మారెడ్డిగూడెంకు చెందిన బొమ్మరాజు అనూష(22)కు పురిటి నొప్పుల సమాచారం అందుకున్న 108 అంబులెన్స్‌ సిబ్బంది గ్రామానికి బయలుదేరారు. అయితే ఎసన్‌ చెరువు బ్యాక్‌ వాటర్‌ కారణంగా గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా జలమయమై అంబులెన్స్‌ ముందుకు వెళ్లలేకపోయింది. పైలట్‌ కె.మోహన్‌, ఈఎంటీ పి.అనుదీప్‌ అంబులెన్స్‌ను కోడూరు సమీపంలో నిలిపివేసి, స్ర్టెచర్‌తో కాలినడకన మోకాళ్లలోతు నీటిలో నడుచుకుంటూ అనూష ఇంటికి చేరుకున్నారు. ఆమెను స్ర్టెచర్‌పై పడుకోబెట్టి, నీటిని దాటుకుంటూ అంబులెన్స్‌లోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత సంగారెడ్డిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రసవం ఇంకా కాలేదని సిబ్బంది తెలిపారు.

Updated Date - Dec 28 , 2025 | 07:11 AM