Share News

BRS MLAs: ఆ 10 మంది ఎమ్మెల్యేలదీ ఫిరాయింపే

ABN , Publish Date - Sep 23 , 2025 | 07:17 AM

బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచిన ఆ 10 మంది ఎమ్మెల్యేలది పార్టీ ఫిరాయింపేనంటూ ఆ పార్టీ నాయకులు తమ వద్ద ఉన్న ఆధారాలను అఫిడవిట్‌ రూపంలో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచారికి సమర్పించారు.

BRS MLAs: ఆ 10 మంది ఎమ్మెల్యేలదీ ఫిరాయింపే

  • కాంగ్రెస్‌ కండువాలు కప్పుకున్నారు..

  • ఆ పార్టీ సమావేశాల్లోనూ పాల్గొన్నారు

  • అసెంబ్లీ కార్యదర్శికి అఫిడవిట్‌ రూపంలో ఆధారాలిచ్చిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచిన ఆ 10 మంది ఎమ్మెల్యేలది పార్టీ ఫిరాయింపేనంటూ ఆ పార్టీ నాయకులు తమ వద్ద ఉన్న ఆధారాలను అఫిడవిట్‌ రూపంలో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచారికి సమర్పించారు. ఫొటోలు, పత్రికా ప్రకటనలు, సోషల్‌ మీడియాలో ప్రచారం, ఇతర ఆధారాలను అందజేశారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంను కలిశామని చెబుతున్నా.. కొన్ని నెలలుగా వారంతా కాంగ్రెస్‌ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని బీఆర్‌ఎస్‌ నాయకులు పేర్కొన్నారు. అనర్హులుగా ప్రకటిస్తారన్న భయంతో గతంలో సీఎంను కలిసినప్పుడు తమకు కప్పింది కాంగ్రెస్‌ పార్టీ కండువా కాదని, జాతీయ జెండా రంగులతో ఉన్న కండువా అని బుకాయిస్తున్నారని విమర్శించారు. పోచారం శ్రీనివాస్‌ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతలను గెలిపించాలని బాన్సువాడ కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో బహిరంగంగానే పిలుపునిచ్చారని వారు ఆ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ‘నేను జగిత్యాలలో బయలుదేరాను. నేరుగా గాంధీ భవన్‌కు వెళ్తున్నా’ అని ఎమ్మెల్యే సంజయ్‌ ‘ఎక్స్‌’ వేదిక చేసిన పోస్టును ప్రస్తావించారు. బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి (గద్వాల) ఒక రోజు ఇచ్చిన పత్రికా ప్రకటనలో కాంగ్రెస్‌ నాయకుల పేర్లు, ఫొటోలు ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌ రెడ్డి, తెల్లం వెంకట్రావు, కాలె యాదయ్య కూడా కాంగ్రెస్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. అనంతరం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు జగదీశ్‌ రెడ్డి, పాడి కౌశిక్‌ రెడ్డి, కె.సంజయ్‌ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పుట్టకముందే ఫిరాయింపుల చట్టం వచ్చిందని, మొదటి నుంచీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే కాంగ్రెస్‌ అని విమర్శించారు.


ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని చెప్పారు. తాను ఏ పార్టీలో ఉన్నానో స్పీకర్‌ నిర్ణయిస్తారని కడియం శ్రీహరి మాట్లాడడం దుర్మార్గమని, ఆయన సోయి, జ్ఞానంతో మాట్లాడాలన్నారు. పది స్థానాల్లో ఉప ఎన్నికలు రావడం, ఫిర్యాయింపు ఎమ్మెల్యేలు మట్టి కరవటం ఖాయమన్నారు. కృష్ణా జలాల విషయంలో ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, తాను రుజువులు చూపిస్తే సీఎం రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌ చెప్పుదెబ్బలకు సిద్ధమా అని జగదీశ్‌ రెడ్డి ప్రశ్నించారు.

Updated Date - Sep 23 , 2025 | 07:18 AM