Share News

Debate Around Shubman Gill: ఒత్తిడికి చిత్తవుతున్నాడా?

ABN , Publish Date - Nov 18 , 2025 | 05:59 AM

సీనియర్‌ ఆటగాళ్లు వీడ్కోలు పలికిన సంధి దశలో.. భారత నవయువ సారథిగా జెన్‌ జడ్‌ శుభ్‌మన్‌ గిల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు....

Debate Around Shubman Gill: ఒత్తిడికి  చిత్తవుతున్నాడా?

  • వర్క్‌లోడ్‌తో గిల్‌కు ఇబ్బందులు

  • ఊపందుకొన్న కెప్టెన్సీ విభజన అంశం

న్యూఢిల్లీ: సీనియర్‌ ఆటగాళ్లు వీడ్కోలు పలికిన సంధి దశలో.. భారత నవయువ సారథిగా ‘జెన్‌-జడ్‌’ శుభ్‌మన్‌ గిల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. భవిష్యత్‌లో మూడు ఫార్మాట్లలోనూ అతడిని టీమిండియా కెప్టెన్‌గా నియమించాలనేది బీసీసీఐ, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ వ్యూహం. అయితే, సొంతగడ్డపై తొలి టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమితో భారత జట్టుకు దిమ్మతిరిగింది. దీంతోపాటు తొలి ఇన్నింగ్స్‌లో స్లాగ్‌ స్వీప్‌ ఆడే క్రమంలో గిల్‌ (4) మెడ పట్టేయడంతో మళ్లీ బరిలోకి దిగలేక పోయాడు. రెగ్యులర్‌ కెప్టెన్‌ లేకపోవడంతో మ్యాచ్‌ ఏ దిశగా సాగుతుందో కూడా అర్థం కాలేదు. అంతిమంగా గెలవాల్సిన టెస్టులో టీమిండియా చతికిలబడడం సదరు అభిమానికి మింగుడు పడడం లేదు. ఈ క్రమంలో 26 ఏళ్ల గిల్‌పై వర్క్‌లోడ్‌ ఎక్కువైపోయిందన్న చర్చసాగుతోంది. ఆయా ఫార్మాట్లకు తగ్గట్టుగా సారథ్యాన్ని విభజించాలన్న డిమాండ్‌ ఊపందుకొంది.

ఆ భారాన్ని మోయలేకపోతున్నాడా?

యువకుడే కావచ్చు.. కానీ మితిమీరిన పనిభారం శుభ్‌మన్‌ గిల్‌ కెరీర్‌ను దెబ్బతీస్తోందని మాజీలు విమర్శిస్తున్నారు. శుభ్‌మన్‌ సారథ్యంలో హోరాహోరీగా సాగిన ఇంగ్లండ్‌ టూర్‌లో ఐదు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 2-2తో సమం చేసింది. నాయకుడిగా గిల్‌ బ్యాటింగ్‌లో జట్టును ముందుండి నడిపించాడు. ఒకరకంగా విషమ పరీక్ష పాసయ్యాడు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకొన్నారు. ఆ తర్వాత వెస్టిండీ్‌సతో స్వదేశంలో టెస్టు సిరీ్‌సను 2-0తో గెల్చుకొన్న భారత్‌.. పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లింది. వన్డే సారథిగా శుభ్‌మన్‌కు బాధ్యతలు అందించిన బీసీసీఐ.. టీ20ల్లో వైస్‌ కెప్టెన్‌గా నియమించింది. త్వరలో పొట్టి ఫార్మాట్‌ జట్టును కూడా అతడి చేతిలోనే పెట్టాలనుకొంది. కోచ్‌ గంభీర్‌ కూడా గట్టిగా మద్దతు పలుకున్నాడు. అయితే, కీలక టెస్టు సిరీ్‌సలో అతడు గాయపడడంతో బీసీసీఐ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో జట్టు భవిష్యత్‌ కోసం వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను నియమించడమే సరైనపని అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టెస్టుల్లో జట్టును నడిపిస్తాడనుకొన్న శుభ్‌మన్‌.. ఒత్తిడికి చిత్తవుతున్నాడని భారత మాజీ ఆటగాడు అభినవ్‌ ముకుంద్‌ అన్నాడు. అంతేకాకుండా బ్యాటింగ్‌కు వెన్నెముకగా మారాల్సిన గిల్‌ భవిష్యత్‌ను కూడా దృష్టిలో ఉంచుకొని కెప్టెన్సీని విభజించడం ఎంతో తెలివైన పని అని సలహా ఇచ్చాడు.

Updated Date - Nov 18 , 2025 | 05:59 AM