Share News

Laura Siegemund: ఈసారి కీస్‌ వంతు..

ABN , Publish Date - Jul 05 , 2025 | 03:36 AM

వింబుల్డన్‌ ఆరంభంనుంచి రోజుకో సీడెడ్‌కు చుక్కెదురవుతోంది.

Laura Siegemund: ఈసారి కీస్‌ వంతు..

లండన్‌: వింబుల్డన్‌ ఆరంభంనుంచి రోజుకో సీడెడ్‌కు చుక్కెదురవుతోంది. ఐదో రోజు..ఆరో సీడ్‌ మాడిసన్‌ కీస్‌ ఇంటిబాట పట్టింది. ఆమెతోపాటు నాలుగు గ్రాండ్‌స్లామ్‌ల చాంపియన్‌ నవోమి ఒసాకాకు కూడా మూడో రౌండ్‌లో పరాజయం ఎదురైంది. అలాగే పురుషుల నాలుగో సీడ్‌ జాక్‌ డ్రేపర్‌కూ ఓటమి తప్పలేదు. రెండో సీడ్‌ అల్కారజ్‌, ఐదో సీడ్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌ నాలుగో రౌండ్‌లో ప్రవేశించారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో లారా సీగ్మండ్‌ 6-3, 6-3తో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత కీస్‌కు షాకిచ్చింది. మరో మ్యాచ్‌లో పల్యుచెన్కోవా 3-6, 6-4, 6-4తో ఒసాకాను చిత్తు చేసి నాలుగో రౌండ్‌కు చేరింది. 13వ సీడ్‌ అనిసిమోవా 6-3, 5-7, 6-3తో దల్మా గాఫీపై మూడో రౌండ్‌లో నెగ్గింది.


పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ అల్కారజ్‌ 6-1, 3-6, 6-3, 6-4తో స్ట్రఫ్‌పై, 5వ సీడ్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌ 6-4, 6-3, 6-7 (7), 6-1తో 26వ సీడ్‌ డవిడోవిచ్‌పై, 14వ సీడ్‌ రుబ్లేవ్‌ 7-5, 6-2, 6-3తో మన్నానోపై గెలుపొందారు. ఇక గురువారం అర్ధరాత్రి జరిగిన రెండో రౌండ్‌లో టైటిల్‌ ఫేవరెట్‌ సినర్‌ 6-1, 6-1, 6-3తో ఉకిక్‌ని వరుస సెట్లలో ఓడించాడు. మరో మ్యాచ్‌లో వెటరన్‌ మారిన్‌ సిలిచ్‌ 6-4, 6-3, 1-6, 6-4తో నాలుగో సీడ్‌ డ్రేపర్‌ను తిరుగుముఖం పట్టించాడు. 10వ సీడ్‌ బెన్‌ షెల్టన్‌ 6-2, 7-5, 6-4తో హిజికటాపై నెగ్గి మూడో రౌండ్‌కు చేరాడు.


మూడో రౌండ్‌లో భాంబ్రీ జోడీ: యుకీ భాంబ్రీ/జియాంగ్‌ జిన్‌యు (చైనా) ద్వయం మిక్స్‌డ్‌ డబుల్స్‌ మూడో రౌండ్‌కు చేరింది. రెండో రౌండ్‌లో భాంబ్రీ/జియాంగ్‌ జంట 6-3, 1-6, 7-6 (6)తో నికోల్‌/క్రిస్టియన్‌ అమెరికా జోడీపై నెగ్గి ముందంజ వేసింది.

Updated Date - Jul 05 , 2025 | 03:36 AM