Tennis Results: మెద్వెదెవ్ అవుట్
ABN , Publish Date - Jul 01 , 2025 | 04:00 AM
వింబుల్డన్ తొలిరోజే సంచలనాలు చోటు చేసుకున్నాయి. ఎనిమిదో సీడ్ హోల్గర్ రూన్, తొమ్మిదో సీడ్ డానిల్ మెద్వెదెవ్‌కు మొదటి రౌండ్‌లోనే చుక్కెదురైంది. ఇక..మూడో టైటిల్ వేటలో ఉన్న అల్కారజ్ ఆరంభ మ్యాచ్‌లో ఐదు సెట్లు పోరాడాల్సి వచ్చింది.
రూన్ కూడా ఇంటిబాట
ఐదు సెట్లు పోరాడి గెలిచిన అల్కారజ్
సబలెంకా, రదుకాను, కీస్ బోణీ
లండన్: వింబుల్డన్ తొలిరోజే సంచలనాలు చోటు చేసుకున్నాయి. ఎనిమిదో సీడ్ హోల్గర్ రూన్, తొమ్మిదో సీడ్ డానిల్ మెద్వెదెవ్‌కు మొదటి రౌండ్‌లోనే చుక్కెదురైంది. ఇక..మూడో టైటిల్ వేటలో ఉన్న అల్కారజ్ ఆరంభ మ్యాచ్‌లో ఐదు సెట్లు పోరాడాల్సి వచ్చింది. మహిళల టాప్ సీడ్ సబలెంకా, లోకల్ ఫేవరెట్ ఎమ్మా రదుకాను శుభారంభం చేయగా, ఆరో సీడ్ మాడిసన్ కీస్ మూడు సెట్లు శ్రమించాల్సి వచ్చింది. సోమవారం జరిగిన తొలి రౌండ్‌లో చిలికీ చెందిన క్వాలిఫయర్ నికొలాస్ జారీ ఐదు సెట్ల పోరాటంలో 4-6, 4-6, 7-5, 6-3, 6-4తో రూన్‌ను చిత్తు చేశాడు. ఫ్రాన్స్‌కు చెందిన 64వ ర్యాంకర్ బెంజమిన్ బోంజి 7-6 (2), 3-6, 7-6 (3), 6-2తో 2021 యూఎస్ ఓపెన్ విజేత మెద్వెదెవ్ (రష్యా)పై సంచలన విజయం సాధించాడు. ఇటీవల జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ మెద్వెదెవ్ ఆరంభ రౌండ్‌లోనే వెనుదిరిగాడు. ఇక.. 20వ సీడ్ పాపిరిన్ 4-6, 1-6, 6-4, 4-6తో ఆర్థుర్ ఫెర్రీ చేతిలో ఓటమి పాలయ్యాడు. డబుల్ డిఫెండింగ్ చాంపియన్ అల్కారజ్‌కు ఇటలీ ఆటగాడు ఫాబియో ఫోనిని గట్టి ప్రతిఘటన ఇచ్చాడు. దాంతో అల్కారజ్ 7-5, 6-7 (7), 7-5, 2-6, 6-1తో గట్టెక్కాడు. 12వ సీడ్ టియఫో 6-3, 6-4, 6-2తో మోలెర్‌ని ఓడించి ముందంజ వేశాడు. మహిళల సింగిల్స్‌లో సబలెంకా 6-1, 7-5తో బ్రాన్‌స్టిన్‌పై సులువుగా నెగ్గగా, ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత కీస్ 6-7 (7), 7-5, 7-5తో గాబ్రియెలాపై పోరాడి గెలిచింది.
బ్రిటన్ నెంబర్‌వన్ క్రీడాకారిణి రదుకాను 6-3, 6-3తో తన దేశానికే చెందిన మింగ్ గ్జూపై, 12వ సీడ్ ష్నీడెర్ 7-6 (5), 6-3తో మొయూకాపై, 14వ సీడ్ స్విటోలినా 6-3, 6-1తో అనా బోండర్‌పై విజయాలతో రెండో రౌండ్ చేరారు. 20వ సీడ్ ఒస్టాపెంకోకు 7-5, 2-6, 6-2తో అన్‌సీడెడ్ సోనె కర్తాల్ షాకిచ్చింది. రెండుసార్లు వింబుల్డన్ రన్నరప్ ఆన్స్ జెబ్యూర్, 24వ సీడ్ సిట్సిపాస్ గాయాలతో తొలి రౌండ్ నుంచి అర్ధంతరంగా వైదొలిగారు.
స్టార్ కళ..
ఇంగ్లండ్ ఫుట్‌బాల్ మాజీ సూపర్ స్టార్ డేవిడ్ బెక్‌హామ్, టెన్నిస్ అందాల తార మరియా షరపోవా రాకతో వింబుల్డన్ తొలిరోజు పోటీలు స్టార్ కళను సంతరించుకున్నాయి. 2004లో 17 ఏళ్ల వయస్సులోనే వింబుల్డన్ విజేతగా నిలిచిన షరపోవా.. బెక్‌హామ్‌తో దిగిన సెల్ఫీని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.