Share News

Shubman Gill: గిల్‌కు చోటు దక్కేనా?

ABN , Publish Date - Aug 19 , 2025 | 04:53 AM

వచ్చేనెలలో జరిగే ఆసియాకప్‌ టీ20 టోర్నీ కోసం మంగళవారం భారత జట్టును ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో టెస్టు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌కు బెర్త్‌ దక్కుతుందా? లేదా? అనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.

Shubman Gill: గిల్‌కు చోటు దక్కేనా?

  • ఆసియాకప్‌ జట్టు ఎంపిక నేడు

న్యూఢిల్లీ: వచ్చేనెలలో జరిగే ఆసియాకప్‌ టీ20 టోర్నీ కోసం మంగళవారం భారత జట్టును ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో టెస్టు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌కు బెర్త్‌ దక్కుతుందా? లేదా? అనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీ్‌సలో పరుగుల వరద పారించిన గిల్‌ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అలాగే ఐపీఎల్‌లోనూ రాణించాడు. అయితే గిల్‌ను ఎవరి స్థానంలో భర్తీ చేయాలనేదే సెలెక్టర్లకు ఇప్పుడు సమస్యగా మారింది. కొంతకాలంగా టాప్‌-3లో అభిషేక్‌, శాంసన్‌, తిలక్‌ మెరుగ్గానే రాణిస్తున్నారు. ఇప్పుడు వారికి పోటీగా జైస్వాల్‌, గిల్‌, సుదర్శన్‌ సిద్ధంగా ఉన్నారు. కానీ వీరు లేకుండానే సూర్యకుమార్‌ నేతృత్వంలోని టీ20 జట్టు చివరి 20 మ్యాచ్‌ల్లో 17 విజయాలతో అదరగొట్టింది.


ఒకవేళ 15 మందితో కూడిన భారత జట్టులో గిల్‌కు చోటిస్తే అతడిని కచ్చితంగా బరిలోకి దింపాల్సి ఉంటుంది. అదే జరిగితే శాంసన్‌, అభిషేక్‌, తిలక్‌లలో ఒకరు తమ స్లాట్‌ను త్యాగం చేయాల్సిందే. అటు గిల్‌ కోసం రింకూ సింగ్‌పై వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిడిలార్డర్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌ చోటుపైనా సస్పెన్స్‌ కొనసాగుతోంది. బౌలింగ్‌ విభాగంలో పేసర్‌ బుమ్రా అందుబాటులో ఉంటాడని సమాచారం. అతడికి జతగా అర్ష్‌దీప్‌, హార్దిక్‌ ఉంటారు. హర్షిత్‌ రిజర్వ్‌ పేసర్‌. ప్రసిద్ధ్‌, సిరాజ్‌లను సెలెక్టర్లు టెస్టు పేసర్లుగానే పరిగణిస్తున్నారు కాబట్టి అక్టోబరులో వెస్టిండీ్‌సతో టెస్టు సిరీ్‌సకు వీరిద్దరు తాజాగా బరిలోకి దిగవచ్చు. స్పిన్నర్లుగా అక్షర్‌, కుల్దీప్‌, వరుణ్‌ చక్రవర్తి మొదటి ప్రాధాన్యంలో ఉన్నారు. అయితే ఆల్‌రౌండర్‌ కావాలనుకుంటే వాషింగ్టన్‌ సుందర్‌ను తీసుకున్నా ఆశ్చర్యం లేదు. రెండో సీమ్‌ ఆల్‌రౌండర్‌గా శివమ్‌ దూబేతో పాటు రిజర్వ్‌ కీపర్‌గా జితేశ్‌, జురెల్‌ల మధ్య పోటీ నెలకొంది.

Updated Date - Aug 19 , 2025 | 04:53 AM