Share News

T20 Series: అదరగొట్టిన సుందర్‌

ABN , Publish Date - Nov 03 , 2025 | 04:28 AM

వాషింగ్టన్‌ సుందర్‌ (23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 49 నాటౌట్‌) ధనాధన్‌ బ్యాటింగ్‌తోపాటు అర్ష్‌దీప్‌ (3/35) విజృంభించడంతో..

T20 Series: అదరగొట్టిన సుందర్‌

  • అర్ష్‌దీప్‌కు 3 వికెట్లు

  • 5 వికెట్లతో భారత్‌ గెలుపు

  • ఆసీస్‌తో మూడో టీ20

హోబర్ట్‌: వాషింగ్టన్‌ సుందర్‌ (23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 49 నాటౌట్‌) ధనాధన్‌ బ్యాటింగ్‌తోపాటు అర్ష్‌దీప్‌ (3/35) విజృంభించడంతో.. ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌ను భారత్‌ 1-1తో సమం చేసింది. ఆదివారం జరిగిన మూడో టీ20లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత ఆసీస్‌ 20 ఓవర్లలో 186/6 స్కోరు చేసింది. టిమ్‌ డేవిడ్‌ (74), స్టొయినిస్‌ (64) అర్ధ శతకాలు వృథా అయ్యాయి. వరుణ్‌ చక్రవర్తి2 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో భారత్‌ 18.3 ఓవర్లలో 188/5 చేసి గెలిచింది. తిలక్‌ వర్మ (29), అభిషేక్‌ శర్మ (25), సూర్యకుమార్‌ (24) రాణించారు. నాథన్‌ ఎల్లీస్‌ మూడు వికెట్లు దక్కించుకొన్నాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా అర్ష్‌దీప్‌ నిలిచాడు.

టాప్‌ తడబడినా..: ఛేదనలో సుందర్‌ ఆటే హైలైట్‌గా నిలిచింది. తిలక్‌తో కలసి ఐదో వికెట్‌కు 34 పరుగులు జోడించిన సుందర్‌.. ఆరో వికెట్‌కు జితేష్‌ (22 నాటౌట్‌)తో కలసి 25 బంతుల్లో 45 పరుగుల అజేయ భాగస్వామ్యంతో జట్టును గెలిపించాడు. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, గిల్‌ (15) పవర్‌ప్లేలోనే పెవిలియన్‌ చేరారు. వీరిద్దరినీ ఎల్లీస్‌ అవుట్‌ చేశాడు. సూర్యకుమార్‌ దూకుడుగా ఆడే క్రమంలో వికెట్‌ పారేసుకొన్నాడు. అయితే, తిలక్‌, అక్షర్‌ పటేల్‌ (17) నాలుగో వికెట్‌కు 35 పరుగులతో ఆదుకోవడంతో టీమ్‌ స్కోరు సెంచరీ మార్క్‌ దాటింది. కానీ, అక్షర్‌ను కూడా ఎల్లీస్‌ వెనక్కిపంపాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సుందర్‌.. తిలక్‌తో కలసి ఎదురుదాడి చేయడంతో టీమిండియా గెలుపు సునాయాసమైంది. 14వ ఓవర్‌లో సీన్‌ అబాట్‌ బౌలింగ్‌లో సుందర్‌ 19 పరుగులు రాబట్టడంతో భారత్‌ 145/4తో గెలుపు బాటలో నిలిచింది. తిలక్‌ను బ్రాట్‌లెట్‌ అవుట్‌ చేసినా.. జితేశ్‌తో కలసి సుందర్‌ మరో 9 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించాడు.


స్కోరు బోర్డు

ఆస్ట్రేలియా: హెడ్‌ (సి) సూర్య (బి) అర్ష్‌దీప్‌ 6, మార్ష్‌ (సి) తిలక్‌ (బి) వరుణ్‌ 11, ఇంగ్లిస్‌ (సి) అక్షర్‌ (బి) అర్ష్‌దీప్‌ 1, డేవిడ్‌ (సి) తిలక్‌ (బి) దూబే 74, ఓవెన్‌ (బి) వరుణ్‌ 0, స్టొయినిస్‌ (సి/సబ్‌) రింకూ (బి) అర్ష్‌దీప్‌ 64, షార్ట్‌ (నాటౌట్‌) 26, బ్రాట్‌లెట్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: 20 ఓవర్లలో 186/6; వికెట్ల పతనం: 1-6, 2-14, 3-73, 4-73, 5-118, 6-182; బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 4-0-35-3, బుమ్రా 4-0-26-0, వరుణ్‌ 4-0-33-2, అక్షర్‌ 4-0-35-0, శివం దూబే 3-0-43-1, అభిషేక్‌ 1-0-13-0.

భారత్‌: అభిషేక్‌ (సి) ఇంగ్లిస్‌ (బి) ఎల్లీస్‌ 25, గిల్‌ (ఎల్బీ) ఎల్లీస్‌ 15, సూర్య (సి) ఎల్లీస్‌ (బి) స్టొయినిస్‌ 24, తిలక్‌ (సి) ఇంగ్లిస్‌ (బి) బ్రాట్‌లెట్‌ 29, అక్షర్‌ (సి) బ్రాట్‌లెట్‌ (బి) ఎల్లీస్‌ 17, సుందర్‌ (నాటౌట్‌) 49, జితేశ్‌ (నాటౌట్‌) 22; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 18.3 ఓవర్లలో 188/5; వికెట్ల పతనం: 1-33, 2-61, 3-76, 4-111, 5-145; బౌలింగ్‌: బ్రాట్‌లెట్‌ 4-0-30-1, అబాట్‌ 3.3-0-56-0, ఎల్లీస్‌ 4-0-36-3, కునేమన్‌ 4-0-31-0, స్టొయినిస్‌ 2-0-22-1, షార్ట్‌ 1-0-13-0.

Updated Date - Nov 03 , 2025 | 04:31 AM