ఇక విరాట్ వంతు
ABN , Publish Date - May 11 , 2025 | 05:37 AM
ఏడాదిలో భారత క్రికెట్‌లో ఎన్ని అనూహ్య పరిణామాలో! నిరుడు జూన్‌లో టీమిండియా టీ20 ప్రపంచ కప్ గెలిచింది. ఆ వెంటనే దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా పొట్టి క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశారు...

టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పనున్న కోహ్లీ
బీసీసీఐకి సమాచారం ఇచ్చిన స్టార్ బ్యాటర్?
నేడో రేపో అధికారిక ప్రకటన
న్యూఢిల్లీ: ఏడాదిలో భారత క్రికెట్‌లో ఎన్ని అనూహ్య పరిణామాలో! నిరుడు జూన్‌లో టీమిండియా టీ20 ప్రపంచ కప్ గెలిచింది. ఆ వెంటనే దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా పొట్టి క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశారు. అలా ఏడాది గడుస్తున్నదో లేదో..తిరిగి వరుస సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న కెప్టెన్ రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించి దేశ క్రికెట్ వర్గాలను, ఫ్యాన్స్‌ను షాక్‌లోకి నెట్టాడు. ఆ విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్న అభిమానులకు మరో విస్మయకర వార్త ఇది! స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా టెస్ట్‌లనుంచి వైదొలగనున్నాడనేదే ఆ వార్త. ఈమేరకు విషయాన్ని విరాట్ బీసీసీఐ పెద్దలకు తెలియజేసినట్టు విశ్వసనీయ సమాచారం. వచ్చే నెలలో ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీ్‌సలో భారత్ తలపడనుంది. ఇప్పటికే రోహిత్ తప్పుకోగా, ఇప్పుడు కోహ్లీ కూడా అదే బాటలో పయనిస్తే..ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షి్‌ప కొత్త సైకిల్ (2025-27) ఆరంభ సిరీ్‌సలో భారత్ అవకాశాలపై ప్రభావం పడుతుందని బోర్డు పెద్దలు ఆందోళన చెందుతున్నారట. దీంతో రిటైర్మెంట్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని వారు కోహ్లీని కోరినట్టు సమాచారం.
అప్పుడే నిర్ణయానికొచ్చేశాడా ?: సుదీర్ఘ ఫార్మాట్‌కు బై చెప్పాలని ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ సిరీస్ ముగిసిన వెంటనే విరాట్ నిర్ణయించేసుకున్నాడట. ‘ఐదు టెస్ట్‌ల ఆ సిరీ్‌సలో కోహ్లీ ఒక సెంచరీ మినహా..పెద్దగా పరుగులు చేయలేదు. పేలవ ప్రదర్శన దరిమిలా వచ్చిన విమర్శలతో టెస్ట్‌ల నుంచి విరమించుకోవాలని కోహ్లీ నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఇంగ్లండ్‌తో కీలకమైన సిరీ్‌సలో భారత్ తలపడాల్సి ఉండడంతో రిటైర్మెంట్ నిర్ణయాన్ని పునఃపరిశీలన చేయాలని విరాట్‌ను కోరాం. కానీ బోర్డు అభ్యర్థనపై అతడు స్పందించలేదు’ అని బీసీసీఐ అధికారి ఒకరు శనివారం వెల్లడించాడు.
ఎంతోకాలంగా పేలవ ఫామ్: కోహ్లీ చాలాకాలంగా టెస్ట్‌ల్లో అంతగా ప్రభావం చూపలేకపోతున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ తొలి టెస్ట్‌లో అతడు శతకం సాధించాడు. దాంతో విరాట్ ఫామ్ గాడిలో పడినట్టేనని అంతా భావించారు. అయితే తదుపరి నాలుగు టెస్ట్‌లలో విఫలమయ్యాడు. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను అతడు అత్యంత పేలవంగా 23.75 సగటుతో ముగించాడు. కోహ్లీ వైఫల్యం ఆ ఒక్క సిరీ్‌సకే పరిమితం కాలేదు. అంతకుముందు ఐదేళ్ల్లలో 37 టెస్ట్‌లు ఆడిన విరాట్ 3 సెంచరీలతో 1990 పరుగులే చేశాడు. కెరీర్‌లో ఇప్పటిదాకా 123 టెస్ట్‌లు ఆడిన కోహ్లీ 46.85 సగటుతో 9230 రన్స్ సాధించాడు.
ఐపీఎల్‌లో అదుర్స్: బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో విఫలమైనా..ఈసారి ఐపీఎల్‌లో మాత్రం విరాట్ దుమ్ము రేపుతున్నాడు. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల్లో 500కు పైగా రన్స్ చేయడంతో అతడిలో ఆత్మవిశ్వాసం ఇనుమడించింది. ఈ ఫామ్‌ను కొనసాగిస్తూ ఇంగ్లండ్‌తో రాబోయే టెస్ట్ సిరీ్‌సలో రాణిస్తాడని అతడి ఫ్యాన్స్ గంపెడాశతో ఉన్నారు.
సచిన్ మాత్రమే ఆపగలడు!
రిటైర్మెంట్ నిర్ణయంపై పునరాలోచన చేయాలని బోర్డు పెద్దలు అడిగినా విరాట్ స్పందించకపోవడంతో.. ఇక అతడి మనసు మార్చగలిగేది సచిన్ టెండూల్కరేనని భావిస్తున్నారు. కారణం..సచిన్‌ను కోహ్లీ తన ఆరాధ్య క్రికెటర్‌గా భావిస్తుండడమే. రిటైర్మెంట్ నిర్ణయమనేది ఆ ఆటగాడి వ్యక్తిగతం. దానిని ఎవరూ కాదనలేరు. కానీ ప్రస్తుతం యువ క్రికెటర్లతో నిండి ఉన్న భారత టెస్ట్ జట్టుకు మైదానంలో మార్గనిర్దేశం చేయాలంటే విరాట్ లాంటి అపార అనుభజ్ఞుడి అవసరమనేది వాదన.
ప్లీజ్..వద్దు!
టెస్ట్‌లకు కోహ్లీ అప్పుడే గుడ్‌బై చెప్పొద్దని భారత జట్టు మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ‘విరాట్ ప్లీజ్.. రిటైర్ కావొద్దు. గతంకంటే ఎక్కువగా భారత జట్టుకు నీ అవసరం ఉంది. అయినా నీలో ఇంకా ఎంతో ఆడే సామర్థ్యముంది’ అని ఎక్స్ ద్వారా రాయుడు సూచించాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి.